Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాత బ్రిటిష్ చట్ట భాషకు స్వస్తి… ఇక ‘భారతీయ’ న్యాయ చట్టాలు…

July 2, 2024 by M S R

‘భారతీయ’ భాషాస్మృతి

ఇండియన్ పీనల్ కోడ్- ఐ.పి.సి. ఇకపై భారతీయ న్యాయ సంహిత.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్- సి.ఆర్.పి.సి. ఇకపై భారతీయ నాగరిక్ సురక్షా సంహిత.
ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇకపై భారతీయ సాక్ష్య అధినియం.

పోలీసు భాష

Ads

ప్రపంచంలో లిపి ఉన్నవి, లిపి లేనివి ఎన్ని భాషలయినా ఉండవచ్చుగాక. “ఆల్ యువర్ లాంగ్వేజెస్ విల్ ఎండ్ వేర్ మై లాఠీ బిగిన్స్” అని ఒక అలిఖిత పోలీసు దుడ్డు కర్ర భాష ఉంది కాబట్టి సకల భాషలు అక్కడ మూగవైపోతాయి.
పోలీసు “పద్ధతి” విచారణ
పోలీసు “మర్యాద”
పోలీస్ “ట్రీట్మెంట్”
లాంటి మాటల్లో పద్ధతి, మర్యాద, ట్రీట్మెంట్ పదాలు అర్థ వ్యాప్తి పొందితే దానికి పోలీసులు బాధ్యులు ఎలా అవుతారు పాపం!

బ్రిటీషువారు భారతీయులను చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి 1850లలోనో లేదా అంతకు ముందో ఏర్పాటు చేసిన క్రిమినల్ చట్టాలను, పరిభాషను స్వాతంత్య్రం రాగానే రద్దు చేసి… భారతీయ అస్తిత్వమున్న శిక్షాస్మృతులను, పరిభాషను సృష్టించుకోవాల్సింది. ఎందుకో బాగా ఆలస్యమయ్యింది. బెటర్ లేట్ ద్యాన్ నెవర్. ఇప్పటికయినా చేశారు. సంతోషం.

వ్యాకరణ భాష

భారత న్యాయ సంహిత
భారత నాగరిక్ సురక్షా సంహిత
భారత సాక్ష్య అధినియం
అంటే హిందీ వ్యాకరణం ఒప్పుకోదేమో!
తెలుగులో మనం భారత సర్వోన్నత న్యాయస్థానం, భారత ఆర్థిక ప్రగతి, భారత పురావస్తు శాఖ అనే అంటాం. అంటున్నాం. అలాగే అనాలి. హిందీలో ‘తీయ’ తప్పదేమో! భారతీయ జనతా పార్టీలో ‘భారతీయ’ వచ్చి న్యాయ సంహితల ముందు కూర్చుంటోందా? అని బి జె పి ప్రత్యర్థులకు లోలోపల ఉడుకుతోంది. దీనిమీద ఎంత గొడవ చేస్తే బి జె పి కి అంత లాభం. కాబట్టి గట్టిగా విమర్శించలేరు. విమర్శించకుండా ఉండలేరు. మోడీ- అమిత్ షాల ఎత్తుగడలది దానికదిగా వ్యాకరణం సూత్రీకరించలేని ఒక చాణక్య భాష.

కేరళ ఇక కేరళం

“కేరళ” పేరును “కేరళం” అని మారుస్తూ ఆ రాష్ట్ర శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్రానికి ఇప్పటికి రెండుసార్లు పంపింది. (ఒకసారి పంపిన తీర్మానంలో లోపాలుండడంతో…దాన్ని సవరించి రెండోసారి పంపాల్సి వచ్చింది) ద్రావిడ భాషా కుటుంబం నుండి మలయాళం ఎనిమిది లేదా తొమ్మిదో శతాబ్దంలో విడివడిందని కొందరు అంచనా వేశారు. దొరికిన ఆధారాలను బట్టి 12 వ శతాబ్దంలో మలయాళం ఏర్పడిందని భాషాశాస్త్రవేత్తలు అంటారు. ఈ విషయం మీద ఏకాభిప్రాయం కుదరలేదు. కేరళలో నాయర్, నంబూద్రీల సంస్కృతాభిమానం వల్ల మలయాళం మొత్తం సంస్కృతంతో నిండిపోయింది. లోతుగా చూస్తే దక్షిణాది భాషల్లో ఎక్కువ సంస్కృతాన్ని నింపుకున్నది మాలయాళమే కావచ్చు. దీనికి రకరకాల చారిత్రిక కారణాలున్నాయి. అవన్నీ ఇప్పుడు అనవసరం.

శతాబ్దాల తరబడి సంస్కృత భాషా నియమం ప్రకారం “కేరళం” అనే వాడుకలో ఉండేది. భోజనం, వస్త్రం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, వివాహం, కల్యాణం, కమనీయం, రమణీయం లాంటి మాటలను భోజన, వస్త్ర, ఉదయ, మధ్యాహ్న, రమణీయ అంటే అసమాపకంగా ఉండి ఒక నామవాచకంగా ఆ మాటలు ఎలా పూర్తి కావో అలాగే ‘కేరళం’ను కేరళ అంటే అసమగ్రమయిన మాట అన్నది సంప్రదాయ మలయాళ పండితుల వాదన.

ఇంగ్లీషు వాడి నోళ్లల్లో పడి మన రాజమహేంద్రవరం రాజమండ్రి అయ్యింది. కోకనదం కాకినాడ అయ్యింది. విశాఖపట్టణం వైజాగ్ అయ్యింది. ఏకశిలానగరం ఓరుగల్లు వరంగల్ అయ్యింది. అనంతపురం అనంటపూర్/అనంతపూర్, హిందూపురం హిందూపూర్ అయ్యాయి. కొన్నిటిని సవరించాము. కొన్నిటిని సవరించినా పూర్ పూర్ గానే పలుకుతూ ఉన్నాం.

ఇంగ్లీషువాడు “మైండ్ యువర్ లాంగ్వేజ్” అన్నాడు.  నిజమే- “ఇట్స్ హై టైమ్ టు మైండ్ అవర్ లాంగ్వేజ్!” (పాత కథనం. 2024 జులై ఒకటి నుండి ఈ కొత్త చట్టాలు అమలవుతున్న సందర్భంగా పునర్ముద్రణ) – పమిడికాల్వ మధుసూదన్   9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions