టీ20 వరల్డ్ కప్ గెలిచాం… సరే, మన క్రికెటర్లను వేనోళ్ల పొగిడాం… జైషా అయితే ఏకంగా 125 కోట్ల నజరానా ప్రకటించాడు… దేశం మొత్తం కీర్తిస్తోంది… రోహిత్, కోహ్లి, బుమ్రా, సూర్యకుమార్, పాండ్యా, అక్సర్ …. పేరుపేరునా ప్రశంసిస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం… ఈ గెలుపు వెనుక ఇంకెవరైనా తెర వెనుక వ్యక్తులు ఉన్నారా..? రాహుల్ ద్రావిడ్ గాకుండా…
ఉన్నాడు… తన గురించి చెప్పుకుంటేనే ఈ ప్రపంచ కప్ గెలుపు చరిత్ర చెప్పుకున్నట్టు… లేకపోతే అసంపూర్ణం… 21 రూపాయలతో ఇంటి నుంచి పారిపోయిన వ్యక్తి… స్మశానంలో పడుకుని ఉపవాసాలు చేసిన వ్యక్తి… తినీతినకుండా జట్టుకు సేవలు చేసిన వ్యక్తి… మీకు గ్రౌండ్‌లో కనిపించి ఉంటాడు కదా ఓ వ్యక్తి… నొసటన ఓ బొట్టు, ఓ బక్కపలుచని వ్యక్తి… కప్పు పట్టుకుని ముఖ్యులందరితోనూ ఫోటోలు దిగుతూ మురిసిపోయిన వ్యక్తి…
ఎస్, ఆయన పేరు రాఘవేంద్ర ద్వివేది… రెడిట్.కామ్‌లో ఓ వార్త కనిపించింది తన గురించి… చదువుతుంటే అబ్బురంగా ఉంది… తనది కర్నాటకలోని కుంట… క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి… తండ్రికేమో క్రికెట్ అంటే ఎలర్జీ… కొడుకు పిచ్చి చూసి ఓరోజు తండ్రి గద్దించి అడిగాడు, నీకు చదువు కావాలా, క్రికెట్ కావాలా..? మొహమాటం లేకుండా చేతిలో బ్యాగు, జేబులో 21 రూపాయలతో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు… ఇది జరిగి 24 ఏళ్లు…
Ads
కుంట నుంచి హుబ్లీ… వారం రోజులపాటు బస్టాండులో పడుకున్నాడు… ఏం చేయాలో తెలియదు, ఇల్లు వదిలి వచ్చాడు, కానీ క్రికెట్ కదా జీవితం, శ్వాస, ఏం చేయాలి..? తరువాత పోలీసులు తరిమికొట్టడంతో సమీపంలోని గుళ్లో కొన్నిరోజులు ఆశ్రయం… ప్రసాదమే కడుపు నింపేది… తరువాత..? సమీపంలోని స్మశానవాటిక తనకు ఆశ్రయం ఇచ్చింది… అందులోని ఓ పాడుబడిన ఇంట్లో ఉండేవాడు…
నాలుగున్నరేళ్లు అక్కడే… కుడి చేయి విరిగింది… క్రికెట్ ఆడాలనే కల అక్కడే ముగిసింది… ఇంటికి వెళ్లబుద్ధి కాలేదు… మరేం చేయాలి..? హుబ్లీలో స్టేడియంలో ప్రాక్టీస్ చేసే క్రికెటర్లకు బంతులు విసరడం, వారి ప్రాక్టీసుకు ఏ సాయం చేయాలన్నా చేయడం… ఓ దోస్త్ దొరికాడు, తనతో కలిసి బెంగుళూరు వెళ్లాడు… అక్కడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ తనకు ఆశ్రయం ఇచ్చింది… ప్రాక్టీస్‌కు వచ్చే కర్నాటక క్రికెటర్లకు బాల్స్ విసరడం, బౌలింగ్ మెషిన్‌లో సాయం చేయడం…
ఒకరోజు, కర్ణాటక మాజీ వికెట్ కీపర్, ప్రస్తుత అండర్-19 సెలక్షన్ కమిటీ చీఫ్ తిలక్ నాయుడు అతని పనిని గమనించాడు… రాఘవేంద్ర అంకితభావానికి ముగ్ధుడైన తిలక్ నాయుడు అతన్ని మరో కర్ణాటక మాజీ క్రికెటర్ జావగల్ శ్రీనాథ్‌కి పరిచయం చేశాడు… ఇది రాఘవేంద్ర జీవితంలో ఒక మలుపు. శ్రీనాథ్ కర్ణాటక రంజీ జట్టులోకి రావాల్సిందిగా ఆహ్వానించాడు. క్రికెట్ సీజన్‌లో కర్ణాటక జట్టుతో కలిసి పనిచేసి, పని లేనప్పుడు చిన్నస్వామి స్టేడియం సమీపంలోని జాతీయ క్రికెట్ అకాడమీలో సేవలందించాడు…
3-4 సంవత్సరాలు రాఘవేంద్ర పైసా సంపాదించకుండా పని చేసాడు… డబ్బు లేకపోవడంతో, అతను తరచుగా ఆహారం లేకుండా ఉండేవాడు… NCAలో ఉన్నప్పుడు, అతను BCCI లెవల్-1 కోచింగ్ కోర్సును పూర్తి చేశాడు… ప్రాక్టీస్‌కు వచ్చిన భారత జట్టు క్రికెటర్లలో ఫేవరెట్‌గా మారాడు… సచిన్ టెండూల్కర్ రాఘవేంద్ర ప్రతిభను త్వరగా గుర్తించాడు.., 2011లో భారత జట్టులో శిక్షణ సహాయకుడిగా అతని నియామకానికి దారితీసింది… గత 13 సంవత్సరాలుగా, జట్టు విజయంలో రాఘవేంద్ర ముఖ్యమైన పాత్ర పోషించాడు…
ఎవరైనా తన శ్రమను, తన జీవితాన్ని, తన ప్రయాసను, తన కంట్రిబ్యూషన్‌ను గుర్తించారా…? 2017 చాంపియన్స్ ట్రోఫీ సమయంలో కోహ్లీ ‘నా విజయం వెనుక ఇదుగో ఈయన శ్రమ పాత్ర ఎంతో పెద్దది, ఎవరు గుర్తించకపోయినా ఇదే నిజం’ అన్నాడు మనస్పూర్తిగా… ఇండియాకు త్రోడౌన్ స్పెషలిస్టు తను… ఓ ప్లేయర్ చెప్పిందేమిటంటే…? ‘‘ఇన్నేళ్లలో రఘు కనీసం ఓ మిలియన్ బంతులు విసిరి ఉంటాడేమో… కొన్నిసార్లు 150 కిలోమీటర్ల వేగంలో బాల్స్ విసురుతుంటే… గ్రౌండ్‌లో పేరున్న స్పీడ్ బౌలర్లు కూడా మీడియం పేస్ బౌలర్లు అనిపించేవాళ్లు…’’
ఏళ్లకేళ్లుగా తను చేసింది ఒకటే… క్రికెటర్లకు సాయం చేయడం… తెర వెనుక రఘు పాత్ర ఏమిటో ప్రతి ఇండియన్ క్రికెటర్‌కు తెలుసు… వాళ్లే తెరలపై వెలిగిపోతారు, తెర వెనుక ఈ ద్వివేదీలు లోకానికి కనిపించరు… కానీ ప్రపంచ కప్పు ముద్దాడిన రఘు కళ్లల్లో వెలుగు వెనుక తను అనుభవించిన చీకట్లు, పడ్డ ఇక్కట్లు మాత్రం ఇన్నాళ్లూ ఎవరికీ తెలియవు..!!
Share this Article