ఎవరో జూనియర్ ఆర్టిస్టులు నటించవలసిన ఈ సినిమాలో NTR , భానుమతి అంతటి ఉద్దండులు ఎందుకు నటించారో అర్థం కాదు . 1974 లో వచ్చిన ఈ అమ్మాయి పెళ్ళి సినిమా ఎంత మంది చూసి ఉంటారు ?! సినిమా టూకీగా డాక్టర్ పెళ్ళాం గొప్పా లేక లాయర్ మొగుడు గొప్పా !?
NTR , భానుమతిలు మధ్య వయస్కుల పాత్రల్లో నటించారు . వారికి ఓ కూతురు , ఇద్దరు కొడుకులు . కూతురి పెళ్లి సమస్య . లాయర్ తండ్రి తన జూనియర్కి ఇచ్చి పెళ్ళి జరిపించాలని , డాక్టర్ తల్లి తన జూనియర్కి ఇచ్చి పెళ్ళి జరిపించాలని పట్టుదల . అసలు అమ్మాయి మరో అబ్బాయిని ప్రేమించటం . ఈ కీచులాట చిలికి చిలికి గాలి వాన అయి , విడాకుల దాకా పోవటం , వాళ్ళ మిత్రులు , కూతురు , కూతురి లవర్ అందరూ ఓ కిడ్నాప్ డ్రామా ఆడి లాయర్ , డాక్టర్ దంపతులను కలపటం . ఇదీ కధ . ఈ కథాంశంతో తర్వాత కాలంలో చాలా సినిమాలు వచ్చాయి .
కన్నడంలో వచ్చిన నా మెచ్చిద హుడుగ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో కూడా కట్టిల తొట్టిల అనే టైటిల్ తో రీమేక్ అయింది . తమిళంలో భానుమతి , జెమినీ గణేశన్ ప్రధాన పాత్రల్లో నటించారు . మన తెలుగు సినిమాకు భానుమతి దర్శకత్వం వహించారు . వారి స్వంత బేనర్ అయిన భరణీ పిక్చర్స్ బేనర్లో వచ్చింది .
Ads
సంగీత దర్శకత్వాన్ని భానుమతి , సత్యం వహించారు . అయినా గుర్తుండే పాటలు లేకపోవటం ఆశ్చర్యమే . లత , పద్మనాభం , గుమ్మడి , చంద్రమోహన్ , రావి కొండలరావు ప్రభృతులు నటించారు . సినిమా యూట్యూబులో ఉంది . NTR , భానుమతి అభిమానులు చూడాలని అనుకుంటే చూడవచ్చు . అలాగే మూడు భాషల్లో ఎందుకు , ఎలా తీసారు అని అధ్యయనం చేయాలనుకున్నా మూడూ చూడవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…… By డోగిపర్తి సుబ్రహ్మణ్యం
ఈ పోస్టు కామెంట్లలో ఇంకొన్ని ఇంట్రస్టింగు వివరాలున్నాయి… ‘‘NTR తీసిన తాతమ్మ కలకు భానుమతికి ఊహించిన దాని కన్నా రామారావు తక్కువ మొత్తాన్ని పారితోషికంగా ఇచ్చారట. భానుమతి పారితోషికం చాలలేదు అని చెప్పకుండా ఆ చెక్కుని వెనక్కి పంపుతూ, లౌక్యంగా ” నేను మీ సినిమాలో నటించాను. అదే పారితోషికానికి మీరు నాకొక చిత్రంలో నటించాలి” అని కబురు పెట్టారు… అలా తప్పని పరిస్థితులలో రామారావు ఆ తక్కువ పారితోషికానికే ఈ చిత్రంలో నటించవలసి వచ్చింది… ఇది ఆ రోజుల్లో సినిమా పత్రికలలో ఫ్లాష్ అయిన వార్త… లేకుంటే రామారావు స్థాయికి తగ్గ పాత్ర కాదది… కానీ తప్పలేదు… భానుమతి గారా మజాకానా?’’ (జి.వెంకటసోమనాథశాస్త్రి)…
చెక్కు వాపస్ పంపించినప్పుడు ఒక రూపాయి అదనంగా పంపించిందనే వార్తలు, కాదు, భానుమతి ఎన్టీఆర్‌కు 5 వేలు అదనంగా రెమ్యునరేషన్ ఇచ్చిందని మరికొన్ని వార్తల్ని కూడా కామెంట్లలో మిత్రులు గుర్తుచేశారు… సినిమాకన్నా ఈ వివరాలు ఇంట్రస్టింగు… భానుమతి భానుమతే..!!
Share this Article