పురాణ కథలను కొత్తగా చెబుతారా..? వోకే… ఆయా పాత్రల కోణాల్లో కొత్తగా ప్రజెంట్ చేస్తారా..? వోకే… కాకపోతే స్థూలంగా పురాణాలను గేలిచేయకుండా, మూలకథ దెబ్బతినకుండా, ప్రయోగాలు చేస్తే పర్లేదు… మరీ ఆదిపురుష్‌లాగా చెత్తా చిత్రీకరణ అయితే జనం తిట్టిపోసే ప్రమాదముంది…
మన ఇతిహాసాలు, పురాణాల్లోని పాత్రల గుణగణాల మీద మనకు ఆల్రెడీ ఓ ప్రిజుడీస్ అభిప్రాయం ఉంటుంది… చిన్నప్పటి నుంచీ మనం చదివిన పుస్తకాలు, విన్న కథాకాలక్షేపాలు, చూసిన నాటకాలు, సినిమాలతో ఆ అభిప్రాయం ఏర్పడుతుంది… ఐతే చాలా సినిమాల్లో, చాలా పుస్తకాల్లో భిన్నమైన కేరక్టరైజేషన్ కూడా ఎంతోకాలంగా ఉంది…
విలన్లను హీరోలుగా, హీరోలను విలన్లుగా చూపించడమూ ఉంది… ఓ కొత్త కోణంలో కథను చెప్పడం… ఇప్పటి కల్కి మాత్రమే కాదు… ఏనాటి నుంచో ఆయా పురాణ పాత్రలను భిన్నమైన కోణాల్లో చూపిస్తున్నారు… ఇప్పుడేమో మనం సోషల్ మీడియాలో కర్ణుడే గొప్ప, కాదు, అర్జునుడే గొప్ప, నో, కర్ణుడిది చెత్తా కేరక్టర్ అంటూ రకరకాలుగా వాదించుకుంటున్నాం… సినిమాకు మరోరకం పబ్లిసిటీని మనమే కల్పిస్తున్నాం…
Ads
ప్రత్యేకించి అశ్వత్థామ, కర్ణ, అర్జున పాత్రల మీద సంవాదాలు సాగుతున్నాయి… నిజానికి ఇలాంటి ప్రయోగాలు చేసినవాళ్లలో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు… దుర్యోధనుడు, రావణుడు, కర్ణులను కూడా హీరోలుగా చిత్రీకరించాడు, జస్టిఫై చేయడానికి ప్రయత్నించాడు… శ్రీమద్విరాట పర్వం సినిమాలో కృష్ణుడు, కర్ణుడు, బృహన్నల, దుర్యోధనుడు పాత్రలతో పాటు కీచకుడి పాత్ర కూడా పోషించాడు తను…
మరో సినిమా గురించీ చెప్పుకోవాలి… అది సతీ సులోచన (ఇంద్రజిత్) సినిమా… చాలా ఏళ్ల క్రితం తీసిన సినిమా అది… ఎన్టీయార్, అంజలీదేవి, ఎస్వీఆర్, కాంతారావు నటీనటులు… అందులో ఎన్టీయార్ పాత్ర ఇంద్రజిత్… అంటే రావణాసురుడి కొడుకు… మనకు తెలిసిన కథేమిటంటే… తండ్రి ఆజ్ఞలకు బద్దుడు… యుద్ధంలో మాయోపాయాలు ప్రయోగించి, లక్ష్మణుడిని చావుబతుకుల్లోని నెట్టి, చివరకు హతమైపోతాడు…
కానీ ఈ సినిమాలో కథ తన భార్య కథ… ఆమె పేరు సులోచన… ఇంద్రుణ్ని ఓడించడానికి ప్రయత్నిస్తే, ఇంద్రుడు నాగలోకం వెళ్తాడు… ఇంద్రజిత్ అక్కడికీ వెళ్తాడు… అక్కడ నాగరాజు కూతురు సులోచన కనిపిస్తుంది… ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటారు… లంకేశుడి తత్వానికి తగినట్టు ఆమె నడుచుకుంటుందిలే అనుకుంటాడు ఇంద్రజిత్…
రావణుడు శివభక్తుడు, విష్ణుద్వేషి… కానీ సులోచన విష్ణుభక్తురాలు… ఇంద్రజిత్ నారాయణనామం వదిలేయమని ఒత్తిడి పెడతాడు… (ప్రహ్లాదుడి కథలోలాగా)… ఆమె వినిపించుకోదు… చివరకు నారాయణుడే రామావతారంతో రావణాసురుడిపై యుద్ధానికి వస్తాడు… ఇంద్రజిత్ హతుడవుతాడు… కానీ సులోచన కోపగిస్తుంది… భర్త కోసం తల్లడిల్లిపోతుంది, దాంతో భూమిపై కల్లోలం… చివరకు శ్రీరాముడే సులోచన దగ్గరికి వచ్చి శాంతపరుస్తాడు… ఇద్దరినీ స్వర్గానికి పంపిస్తాడు…
కొత్త కథ చదువుతున్నట్టు ఉంది కదా… కథ చెప్పడంలో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నట్టుగా ఉండదు… అదొక కథ… అంతే… అదొక సినిమా… అంతే… నచ్చితే చూడటం, లేదంటే ఆదిపురుష్‌ను వదిలేసినట్టు వదిలేయడం… అంతే… దానికి ఇన్నిరకాల సంవాదాలు అవసరమా అనేదే ప్రశ్న… అబ్బే, వేరే పనేమీ లేదు అంటారా..? వోకే, ప్రొసీడ్, కానివ్వండి… ఇదొక సినిమా..!!
Share this Article