కల్కి …. అది ఉడికీ ఉడకని ఎలక్ట్రానిక్ కిచిడీ… డిజిటల్ పిజ్జా…
మట్టిలో తరాలుగా నిర్లక్ష్యానికి గురైన రాయికి పసుపు కుంకుమ పెట్టు, అది విగ్రహం అవుద్ది. కథని పురాణం చేయి జనాలు నమ్ముతారు. కథనానికి మహిమత్వాన్ని అద్దు, అది ఐతిహ్యం అవుద్ది. చరిత్ర రచనలు ఉన్న సకల ఆధారాలలలో పురాణం కూడా ఒక దినుసు. కానీ కల్పనకూ కథకూ మధ్య కట్టిన చెలియల కట్ట ఏపాటి బిగువునో జనాలు గ్రహించగలరు. ఇది పురాణాల పాడు కాలం. పారవశ్యాల పాపపు కాలం. ఇది వెండితెరకు మతం రంగేసుకుని రంకెలేస్తున్న కాలం. వర్తమానానికి కుల తొడుగులు తొడుగు. అది ఎన్నికల పెట్టెలు నింపి వేసుద్ది. వర్తమాన కాలానికి ప్రాంతీయత అద్దు. అది మరో రాజరిక సౌధాలకి పునాది అవుద్ది.
దేశ ముఖ చిత్రానికి జాతీయత అద్దు, అది విముక్తి గీతమై సాగి పోతది. అది మితిమీరితే జరిగిన మత యుద్దాలు మారణ హోమాలు. మన కళ్ళ ముందే కారిన రక్త నదుల తడి చిత్తడి చిత్తడిగా ఉంది. ఆశల తీరంలో గమ్యం చేరని ఆష్విడ్జ్ చావుల్లా. హిట్లర్ నెరవేరని ఆశల లాగా.
Ads
చరిత్రకి మతం రంగు కలుపు, అది హోలీ అవుద్ది. మాంసానికి నెలపొడుపు కలుపు, అది రాచపుండులా రాయబడుద్ది. బోనాలకి లక్షల మేకలు తెగుతాయి, అక్కడ హింస కనబడదు.
రోజు ఐదు లక్షలాది పశువుల్ని అక్రమంగా నరికే గాధీమాయీ లో దైవత్వాన్ని చూద్దాం. గడిచిన పదేళ్లలో దేశ రాజకీయాలు మతం చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి సినిమాకి మత తొడుగు తొడిగితే కలక్షన్ల వరదలో సేద తీరిపోవచ్చు అనే కళల బేహారులు ఉన్నారు. ట్రాయ్ యుద్ద నేపధ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. జీసస్ బ్రతుకు ఆధారంగా ఎంతో సాహిత్యం, సినిమాలు వచ్చాయి, అంతెందుకు రామాయణ భారత కథల ఆధారంగా మన పూర్వ దర్శకులు మంచి సినిమాలు తీసారు. మార్కస్ బార్ట్లే మాయాజాలంలో జనాలు ముగ్ధులు అయ్యారు. ఇది కలికాలం కాదు. కాదు. కల్కి కాలం.
పని లేక నిన్న కల్కి సినిమాకి పోయా. ఈ మాత్రం సినిమా చిన్న పోరగాళ్లు పోకేమాన్ టెట్రీస్, మారియో గేమ్స్ తో ఆడుకున్న తరం కదా నాగ్ అశ్విన్ పెద్దగా రంజింప చేయలేక పోయాడు.
ఈ మధ్య వచ్చిన మాట్రిక్సులూ బొట్రిక్షులూ కలిపి రంగరించి ఎనిమిది వందల కోట్ల రూపాయల బిల్లు మన మొకాన కొట్టాడు. కొట్టిన వాడు వూరికే ఉంటాడా, ఒక ఆశక్తిని కలిగిస్తాడు. ఒక అసంబద్దాన్ని చూపిస్తాడు. కథ ఒక రీతిన అర్ధం అయ్యేలా తీయడు, అది అర్ధం చేసుకోడానికి ఇంకో ఆరు వందలు వదిలించుకున్నాక, చెవి తుప్పు వదిలిపోయాక, ఓహో అసలు కథ ఇదా అని మన వెర్రి వెనకబాటుతనాన్ని వీపున ఒకసారి చరుచుకుని సర్దుకుంటాం అన్నమాట. వేల యేళ్ల కింద ఉందో లేదో తెలియని ఊహల మహాభారతానికి ఆధునిక రూపం కల్కి .
అది ఉడికీ ఉడకని ఎలక్ట్రానిక్ కిచిడీ, డిజిటల్ పిజ్జా. అందులో కాస్త వైరస్ అనే సాస్ కలుపుకుని కళ్ళకు త్రీడీ అద్దాలేసుకుని . ఎలక్ట్రానిక్ సిగార్ పీలుస్తూ. యార్క్ షైర్ లాంబ్ పట్టిస్ స్టిక్కీ టాఫీ ఫుడ్డింగ్ తో కేవియర్, ఆయిస్టర్ ఎంత తిన్నా కడుపు నిండనట్టు ఉంటది అన్నమాట కల్కి సినిమా.
జనాలను మంత్రాలతో, మాయలతో మనిషి మాంసం తినే రాక్షసులతో తెర నిండా హింసని. అసంబద్దాన్ని నింపడంతో హాలీవుడ్ తో పోటీపడ్డ అశ్వనీ దత్తు కుటుంబాన్ని మెచ్చుకోలేకుండా ఉన్నాను, అదన్న మాట కల్కి అంటే …. #కల్కి #Kalki ….. By గుఱ్ఱం సీతారాములు
Share this Article