ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి నవల బంగారు కలలు ఆధారంగా నిర్మించబడింది 1974 లో వచ్చిన ఈ బంగారు కలలు సినిమా . 1960s , 1970s యద్దనపూడి సులోచనారాణి , మాదిరెడ్డి సులోచన , కోడూరి కౌసల్యాదేవి , వాసిరెడ్డి సీతాదేవిల హవా . ఆహ్లాదకరమైన కుటుంబ కధా చిత్రాలు . పడుచు పిల్లలకు స్వప్న లోకాన్ని అందించాయి . పడవ కారు రాజశేఖరం , ఆజానుబాహులయిన కథానాయకులు , వగైరా . 1980s యండమూరి వీరేంద్రనాధ్ హవా . చిరంజీవి కోసమే వచ్చాయా అనిపించే నవలలు .
ఈ బంగారు కలలు సినిమాకు అప్పట్లో ప్రత్యేక ఆకర్షణ వహీదా రెహమానే . 1955 లో రోజులు మారాయి , జయసింహ సినిమాల్లో మెరిసి మాయమయపోయిన వహీదా 19 ఏళ్ల తర్వాత తెలుగులో నటించిన మొదటి సినిమా . ఊర్వశి పురస్కారం , 1972 లో పద్మశ్రీ పురస్కారం , 2006 లో ఆం.ప్ర . ప్రభుత్వ NTR అవార్డు , 2011 లో పద్మ భూషణ్ , 2021 లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను పొందింది .
సినిమా ఎలా ఉందని చూసొచ్చాక ఎవరయినా అడిగితే గూడ్సు బండి లాగా ఉందని చెప్పేవాళ్ళం . కాలేజీ రోజుల్లో మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసా . టివిలో కూడా వచ్చేది . ఆ రోజుల్లోనే గూడ్సు బండి . ఇంక ఈరోజుల్లో ప్రేక్షకులకు ఆనుద్దా !?
Ads
నవలల్ని సినిమాలకు అనుగుణంగా మలచటం కష్టమే . నవల , సీరియల్స్ తీరిగ్గా చదివేవి . సినిమా మూడు గంటల్లో టకాటకా అయిపోవాలి . ఉద్దండులు ఆదుర్తి , దుక్కిపాటి సినిమాకు అనుగుణంగా మలచలేక పోయారేమో అని అనిపించింది నాకు .
ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేవి యస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం లోని శ్రావ్యమైన పాటలు . బాగా హిట్టయ్యాయి . సింగారం చిందులు వేసే అమ్మాయిల్లారా బంగారూ కలలే కంటున్నారా , పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి , చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా , నాలోన వలపుంది మీలోన వయసుంది , నీ కన్నులలో నే చూసానులే , సన్నగా సన సన్నగా పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . మంచితనానికి తావే లేదు అనే విషాద గీతం కూడా బాగానే ఉంటుంది .
ANR , లక్ష్మి , వహీదా రెహమాన్ , SVR , కాంతారావు , రాజబాబు , సత్యనారాయణ , అల్లు రామలింగయ్య , గిరిబాబు , సూరేకాంతం ప్రభృతులు నటించారు . హాస్య నటి మమతకు మొదటి సినిమా ఇదే అనుకుంటా .
యూట్యూబులో ఉంది . సినిమా స్లో అయినా , చూడతగ్గ సెంటిమెంటల్ మూవీ . వహీదా రెహమాన్ అభిమానులయితే తప్పక చూడాల్సిందే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ………. By డోగిపర్తి సుబ్రహ్మణ్యం
Share this Article