చంద్రబాబు మళ్లీ రెండు కళ్ల సిద్ధాంతం ఎత్తుకున్నాడు… తెలంగాణలో టీడీపీని రీయాక్టివేట్ చేస్తానంటున్నాడు… సరే, ఈ కొబ్బరి చిప్పల వ్యూహాలు ఎంతవరకూ ఫలిస్తాయో వేచిచూడాలి… తెలంగాణ తనను మళ్లీ నమ్ముతుందా..? ముంచేయడానికి మళ్లీ వస్తున్నాడనే భయంతో తిరస్కరిస్తుందా అనేది కాలం చెబుతుంది…
కానీ హైదరాబాదులో స్వాగతాలు, సత్కారాలు, ఊరేగింపులు, విజయోత్సవాల వేళ… తను చేసిన ఒక ప్రకటన ఎందుకోగానీ బాగా తేడా కొట్టేస్తోంది… అసలు చంద్రబాబు మనసులో రూపుదిద్దుకుంటున్న ప్రణాళిక ఏమిటో అంతుపట్టక అయోమయం రేపుతోంది… ఇంతకీ తను ఏమన్నాడంటే..? (వాళ్ల పత్రికే, ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలో కనిపించింది, అదీ హైదరాబాద్ ఎడిషన్‌లో…)
Ads
‘‘ఏపీలో వచ్చిన సునామీలో ఓ సైకో కొట్టుకుపోయాడు, పెట్టుబడిదారులను ఆహ్వానిస్తుంటే, మీపై నమ్మకం ఉంది కానీ ఆ భూతం మళ్లీ వస్తే పరిస్థితి ఏంటని అడుగుతున్నారు, అలాంటివారికి నేను భరోసా ఇస్తున్నా, ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం’’ ఇదీ ఆయన భీకర, భీషణ ప్రతిజ్ఞలా ధ్వనిస్తోంది… పవన్ కల్యాణ్ ఈ మాట అంటే ఏదో సినిమా డైలాగ్ కొట్టాడులే అనుకోవచ్చు, కానీ చాలావైపులా పదునున్న బహుముఖ కత్తి వంటి చంద్రబాబు నోటి వెంట ఆ మాట వింటుంటే రకరకాల డౌట్స్…
రాజకీయంగా ఇక జగన్‌ను ఎదగనివ్వను అనడం వేరు… జనం ఇష్టం అది… గత ఎన్నికల్లో 23కు పడేసిన ఆ జనమే మొన్న జగన్‌ను 11కు పడేశారు… చంద్రబాబు చెప్పినట్టు ఆడరు జనం… వాళ్లు తీర్పరులు… మరి భూస్థాపితం చేస్తాను ఆ భూతాన్ని అంటున్నాడు అంటే, ఇంకేదైనా భారీ రాజకీయేతర కుట్ర జరగబోతోందా..?
సరే, జగన్ అర్థం చేసుకోగలడు, జాగ్రత్తపడగలడు… పైగా ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, ఎంపీగా పోటీచేసి, ఢిల్లీకి తన యాక్టివిటీ షిఫ్ట్ చేస్తాడని నిన్నామొన్నటి నుంచి ఒకటే టాక్… అవును, అసెంబ్లీకి వెళ్తే ఈ టీడీపీ కూటమి చేసే ట్రోలింగ్ దుర్భరమే… పైగా తనకు ఇప్పుడు ఢిల్లీ అవసరం… అది నిజమా కాదా పక్కన పెడితే… వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఓ పోలిక…
వైఎస్ఆర్ అండగా ఉన్నాడు… తనది విస్తృతమైన ఆలోచన.. జగన్ పాలన విధానాలు పరిమితం… అండగా ఉండటానికి, పంచి పెట్టే పథకాలకూ నడుమ బోలెడు తేడా… పైగా వైఎస్ ఎప్పుడూ ఒక కులాన్ని టార్గెట్ చేసుకోలేదు… టీడీపీ తనకు బలమైన ప్రత్యర్థే అయినా సరే, కక్ష కట్టినట్టు వ్యవహరించలేదు, పైగా బాలకృష్ణ కాల్పుల వంటి సంఘటనల్లో చంద్రబాబు అడగ్గానే సాయం చేశాడు… అసలు తనను ఎవరితోనూ పోల్చలేం… కానీ జగన్ కమ్మ కులాన్ని టార్గెట్ చేయడం పూర్తిగా వైఎస్ తరహా పోకడలకు పూర్తి విరుద్ధం…
అన్నింటికీ మించి వైఎస్ పథకాల్లో ప్రజల పట్ల ఓ ఆత్మీయ స్పర్శ ఉంటుంది, అది జనానికి నేరుగా కనెక్టయింది… అర్థరహిత డబ్బు పంపిణీ కాదు అది… సోషల్ పెన్షన్ల పెంపుకన్నా ముఖ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 104, 108 వంటివి తనను ప్రజల హృదయాల్లో ఉన్నతంగా నిలిపాయి… అందరినీ కలుపుకుని వెళ్లడమే కాదు… అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసే జలయజ్ఞం కూడా తన పాలనలో హైలైట్… అఫ్‌కోర్స్, రాయలసీమకు ఎక్కువ నీళ్లు తీసుకుపోయే పోతిరెడ్డిపాడు వంటివి తెలంగాణ వ్యతిరేకం అనిపించినా… కాంపన్సేట్ చేయడానికి గోదావరి నుంచి ప్రాణహిత- చేవెళ్ల, దుమ్ముగూడెం వంటివీ జతచేశాడు… అవీ ప్లస్ పోలవరంతో కృష్ణా దిగువ ఆంధ్రా ఆయకట్టుకూ ప్రయోజన ప్రణాళిక చేశాడు… అదంతా వేరే కథ…
హైదరాబాద్ విషయానికొస్తే వైఎస్ చేసింది ఎప్పుడూ మరిచిపోలేనిది… గోదావరి తాగునీరు, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఐటీ కంపెనీలు… ఎన్నని… జగన్ తన తండ్రి పేరు చాలా పథకాలకు పెట్టాడు గానీ, ఆ తరహా పాలన ఒడుపును పట్టుకోలేకపోయాడు… ఫలితమే మొన్నటి దారుణ ఓటమి… అఫ్‌కోర్స్, అప్పుడే ఆట అయిపోలేదు, తను ఆగిపోడు, కానీ ఓసారి వైఎస్ పాలనతో పోలిక మాత్రం తప్పనిసరి..!!
Share this Article