మొన్న ఒక వార్త చెప్పుకున్నాం కదా… టేస్ట్ అట్లాస్ అను ఫుడ్ వెబ్ సైట్ (పాపులర్ ఇంటర్నేషనల్ సైట్) వరస్ట్ రెసిపీలు అని పది ఇండియన్ ఫుడ్స్‌కు ర్యాంకింగ్స్ ఇచ్చిందనీ, అందులో మన ఉప్మా కూడా ఉందనీ..! ఆ జాబితాలో పాంటా భాత్ అనే వంటకం కూడా ఉంది… ఇది ప్రధానంగా బెంగాలీ (బంగ్లాదేశ్ కూడా) సంప్రదాయ వంటకం… సింపుల్‌గా చెప్పాలంటే మన చద్దన్నం వంటిదే… వంటిదే కాదు, చద్దన్నమే…
కాకపోతే ఫ్రై చేసిన చేపల్ని లేదా ఉడికించి చిదిమిన ఆలూ ముద్దల్ని ఆధరువుగా తింటుంటారు… టేస్ట్ అట్లాస్ టేస్ట్ లెస్ ర్యాంకింగ్స్ మీద ఇండియన్ నెటిజనం విరుచుకుపడుతూనే ఉన్నారు… మన మీడియాకు పెద్దగా ఇలాంటి వార్తల మీద టేస్ట్ ఉండదు గానీ జాతీయ మీడియా కూడా స్పందించి టేస్ట్ అట్లాస్‌ను తిట్టిపోస్తోంది… ఇండియా టుడే ఈ పాంటా భాత్ మీద ప్రత్యేకంగా ఓ స్టోరీ చేసింది… బాగుంది…
వంటకాల పోటీలకు సంబంధించి మాస్టర్ చెఫ్ టీవీ షో ఇండియాలో పెద్దగా పాపులర్ కాదు (తెలుగులో కూడా ఆహాలో వస్తుంది) కానీ ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పాపులర్ షో అది… దాని 13వ సీజన్‌లో ఈ వంటకంతో కిశ్వర్ చౌదరి ఫైనల్స్‌కు చేరాడు… (తనవి బంగ్లాదేశ్ రూట్స్)… ఆ ఫుడ్ టేస్ట్ చేసిన జడ్జిలు ఎలా ప్రశంసించారు, అంతకుముందు ఓ సెలబ్రిటీ చెఫ్ ఇండియాకు వచ్చినప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఏమన్నాడు వంటి వివరాలు బోలెడున్నాయి ఆ కథనంలో…
Ads
సరే, సేమ్ వంటకం మన చద్దన్నం దగ్గరికి వద్దాం… పులియబెట్టిన ఆహారం మన భారతీయ కిచెన్ ప్రత్యేకత… రుచి, ఆరోగ్యం… ప్రొబయాటిక్స్ అందించే ఫర్మెంటెడ్ ఫుడ్ ఇంపార్టెన్స్ ఇప్పుడు ప్రపంచం మొత్తం అర్థం చేసుకుంటోంది… ఇప్పుడంటే ఫ్రిజ్జులు వచ్చాయి కానీ గతంలో మిగిలిపోయిన అన్నానికి కాస్త మజ్జిగో పాలో కలిపి రాత్రి అలా వదిలేసేవారు, తెల్లారేసరికి పులుస్తుంది… ఆ పులుపుకి తోడు పచ్చి ఉల్లిపాయ, పచ్చి మిరపకాయతో పొద్దున్నే లాగించడం అలవాటుగా ఉండేది… అదొక విశేషమైన టేస్ట్… ఆరోగ్యకరమైన రుచి…
ప్రత్యేకంగా వేరే వండేది ఏమీ ఉండదు… ఇప్పుడు కొన్ని స్టార్ హోటళ్లు కూడా సర్వ్ చేస్తున్నాయి… ఇంతకీ దీని ఉపయోగాలు ఏమిటి..? సాదా ఉడకబెట్టిన బియ్యంతో పోలిస్తే పాంటా భాత్ లేదా చద్దన్నంలో కాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం వంటి పోషకాలు పుష్కలంగా సమకూరతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి…
“సుమారు 100 గ్రాముల వండిన అన్నంలో కేవలం 3.4 మిల్లీగ్రాముల ఐరన్ మాత్రమే ఉంటుంది, అదే పరిమాణంలో 12 గంటల పాటు పులియబెట్టిన అన్నంలో ఐరన్ కంటెంట్ 73.91 మిల్లీగ్రాములకు పెరిగింది” అని చాన్నాళ్ల క్రితమే అస్సాం అగ్రికల్చరల్‌లో పరిశోధనా అధ్యయనంలో భాగమైన మధుమితా బరూహ్ మీడియాకు వెల్లడించింది…
ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వాషింగ్టన్, DC నుండి మరొక అధ్యయనం ప్రకారం.., ఫర్మెంటేషన్ వల్ల ఐరన్, జింక్ వంటి ఖనిజాల లభ్యతను విశేషంగా పెరుగుతుంది… రిబోఫ్లేవిన్, విటమిన్ బి స్థాయిలు కూడా పెరుగుతుంది… ఇప్పుడు సాధారణంగా కనిపించే ఓ రుగ్మత రక్తహీనత… ఆ బాధితులకు చద్దన్నం ఆరోగ్య ఔషధం… అంతేకాదు, ఫర్మెంటేషన్ కార్బొహైడ్రేట్లను ఇథనాల్, లాక్టిక్ యాసిడ్లుగా విడగొట్టి సులభ జీర్ణానికి అనువుగా తయారు చేస్తుంది ప్లస్ పోషక విలువల్ని పెంచుతుంది…
రకరకాల మసాలాలు, ఖరీదైన దినుసులతో… అత్యంత సంక్లిష్టంగా వండబడే ఫుడ్ ఐటమ్స్‌కు మాత్రమే టేస్ట్ అట్లాస్ ప్రాధాన్యమివ్వడమే ఇప్పుడు ఇండియా నెగెటివ్‌గా స్పందించడానికి కారణం…! చివరగా… మాధవన్ అని పాపులర్ తమిళ నటుడు తెలుసు కదా… ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు… ‘‘పొద్దున్నే నేను ఇడ్లీ, దోశ, పూరి వంటివి తనను, రాత్రి పులియబెట్టిన అన్నాన్నే (కంజి) తీసుకుంటాను..’’
Share this Article