హైదరాబాద్ అంటే ఫుడ్ ప్యారడైజ్… బిర్యానీ మాత్రమే కాదు, అనేక రకాల వంటకాలకు హైదరాబాద్ హోటళ్లు ప్రసిద్ధి… పెద్ద పెద్ద పేరున్న రెస్టారెంట్లు, హోటళ్లు, మెస్సులు, పబ్బులు, బార్లు, క్లౌడ్ కిచెన్లు, స్ట్రీట్ వెండర్లు, పార్శిళ్లు… వేల కోట్ల వ్యాపారం… రుచి సరే, కానీ పరిశుభ్రత, నాణ్యత..?
సరిగ్గా ఇదే డిబేట్ ఇప్పుడు సర్వత్రా… కొన్నాళ్లుగా రోజూ వార్తలు… హోటళ్లలో అపరిశుభ్ర కిచెన్లు, అధ్వానపు నిర్వహణ, కాలం చెల్లిన దినుసులు, పాచిపోయిన సరుకులు, రసాయనాలు వార్తల్లోకెక్కుతున్నాయి… తాము తింటున్నది ఇలాంటి ఫుడ్డా అని ప్రజలు హాశ్చర్యపోతున్నారు… మండిపడుతున్నారు…
చిన్న చిన్న హోటళ్లు కాదు… పేరున్న పెద్ద హోటళ్లలో సైతం దాడులు, తనిఖీలు, నోటీసులు, జరిమానాలు… ఓ ఉద్యమమే నడుస్తోంది ఇప్పుడు… ఎప్పుడు అధికారులు వచ్చి తనిఖీలు చేస్తారో తెలియక హోటళ్లు హఠాత్తుగా పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాయి ఇప్పుడు… రసాయనాల సీసాలు, డబ్బాలను పారేస్తున్నారు… డిసిప్లిన్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తోంది…
Ads
వీటన్నింటికీ కారకుడు ఆర్వీ కర్ణన్… కల్కి సినిమా చూసొచ్చి ప్రజలందరూ కర్ణుడు గొప్పోడా, అర్జునుడు గొప్పోడా అని వాదవివాదాల్లో మునిగి తేలుతుంటే, ఈ కర్ణుడు మాత్రం నిశ్శబ్దంగా ఆ గొప్ప ఎలా ఉండాలో తన చేతల్లో చూపిస్తున్నాడు… ఏప్రిల్ 16న మొదలుపెట్టాడు… ప్యారడైజ్, బాహుబలి కిచెన్, పిస్తా హౌజ్, బాస్కిన్ రాబిన్స్, రామేశ్వరం కేఫ్… ఇలా ఫేమస్, పాపులర్ అంటూ ఎవరినీ వదలడం లేదు…
అసలు ఫుడ్ సేఫ్టీ వింగ్ ఒకటి ఉంటుందని గతంలో చాలామంది తెలియదు… పాత శేషన్ తరహాలో ఈ కర్ణన్ ఆ సర్కారీ వింగ్ తలుచుకుంటే ఎలా పనిచేయగలదో నిరూపిస్తున్నాడు… లోప్రొఫైల్, ఒత్తిళ్లకు భయపడడు, అవినీతి లేదు, తెలంగాణ ప్రభుత్వం కూడా స్వేచ్ఛనిచ్చింది… ప్రత్యేకించి మంత్రి దామోదర రాజనరసింహ ఫుల్ సపోర్ట్…! ఫుడ్ ప్యారడైజ్‌గా హైదరాబాద్‌కు ఉన్న పేరును నిలబెట్టాలని, మంచి ఆహారం ప్రజలకు అందాలని నిర్దేశించింది… అంతే ఇక… ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ‘సింగం’ తరహాలో స్టార్ట్ చేశాడు వర్క్…
టాస్క్ ఫోర్స్‌లో ఎవరెవరు పనిచేస్తున్నారో, వాళ్ల నంబర్లు ఏమిటో కూడా ఎవరికీ తెలియనివ్వలేదు… అంత గోప్యంగా ఉంచి, ఎక్కడికి తనిఖీలకు వెళ్తున్నారో ముందే లీక్ గాకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు… తన తనిఖీల్లో తేలిన వివరాలను ఎక్స్ ఖాతాలో వీడియోలు, ఫోటోలతో సహా పోస్ట్ చేసేస్తాడు… మీడియా కూడా దాన్నే ఫాలో అవుతుంది…
చిన్న చిన్న నిర్లక్ష్యాలను కూడా భూతద్దంలో చూస్తున్నారా..? మరీ రంధ్రాన్వేషణ జరుగుతోందా..? అనే ప్రశ్నలు, సందేహాలు ఉన్నా సరే… ఓరకమైన కట్టడి, క్రమశిక్షణ, పరిశుద్ధ వాతావరణం, ఆహార నాణ్యత దిశలో ప్రస్తుతానికి ఈ దూకుడు అవసరమే అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి… ఇంతకీ ఎవరు ఈ కర్ణన్..?
తమిళనాడు… శివగంగ జిల్లా, కరైకుడి… 2007లో ఐఎఫ్ఎస్ టాపర్… తరువాత 2012లో యూపీఎస్సీ 158వ ర్యాంకు… మంచిర్యాల, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల కలెక్టర్‌గా కూడా చేశాడు… తండ్రి ఓ లైబ్రెరియన్, తల్లి సబ్ రిజిస్ట్రార్… ఏ కోచింగూ లేకుండానే యూపీఎస్సీ క్రాక్ చేశాడు… ఓ సక్సెస్ స్టోరీ… ఆయన సతీమణి ప్రియాంక కూడా సర్వీసులోనే ఉంది..! పేరు చక్కా ప్రియాంక… ఆమె కూడా ఐఏఎస్ అధికారిణే… సూర్యాపేట అడిషనల్ కలెక్టర్..!!
Share this Article