ప్రణీత్ హనుమంతు ‘మావాడే’ అని చెప్పుకోడానికి శ్రీకాకుళం జనం, కాళింగులూ ఇంత భయపడాలా?
……………………
ఒకప్పుడు తెలుగు వ్యక్తి ఎవరైనా మంచి పని చేసో, దుర్మార్గానికి పాల్పడో వార్తల్లోకి ఎక్కితే సదరు మనిషి మా ప్రాంతం వాడైనందుకు సిగ్గుపడుతున్నామనో లేదా మంచి జరిగితే గర్వపడుతున్నామనో జనం ప్రకటించుకునేవారు. అదే ఐరోపా, అమెరికా దేశాల్లో ఏదైనా సాధించినా, మనం బాధపడే పనిచేసినా ఆ తెలుగు మనిషిది ఫలానా ప్రాంతం లేదా జిల్లా, కులం అని కూడా పత్రికల్లో వార్త వచ్చేలా మాట్లాడుకునేవాళ్లం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని పూర్వపు కృష్ణా, గుంటూరు జిల్లాలవాళ్లు, వారి తర్వాత గోదారి జిల్లాలవారూ ఈ విషయంలో మిగిలిన ప్రాంతాల వారికన్నా కాస్త ముందుండే వారు.
‘ తండ్రీకూతుళ్ల బంధాన్ని అసభ్య సంభాషణతో తెలుగు పౌరసమాజాన్ని సిగ్గుపడేలా చేశాడు’ అనే కారణంపై అరెస్టయిన ప్రణీత్ హనుమంతు కుటుంబ వివరాలు కొద్దిగా మీడియాలో రాశారు. కాని అతని కులం, కుటుంబ మూలాల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకో లేదు. అతని పేరులోని రెండో మాట హనుమంతు అతని ఇంటిపేరు అని కూడా చాలా మందికి తెలియదు. శ్రీకాకుళం జిల్లాలో పేరొందిన కాళింగులు అనే కాస్త పైకొచ్చిన కులంలో (బీసీ–ఏ లో ఉన్న ప్రాంతీయ బీసీ కులం) ప్రణీత్ హనుమంతు పుట్టాడు.
Ads
అతని తండ్రి అరుణ్ కుమార్ హనుమంతు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అని మాత్రమే మీడియాలో వచ్చింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈ ‘హనుమంతు’ అనే ఇంటి పేరున్న కాళింగ కుటుంబాల నుంచి ఇంతకు పూర్వం అనేక మంది ప్రముఖులు వచ్చారు. ఒక ఐపీఎస్, ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఎంపీ!
……………….
హనుమంతు ఇంటి పేరుతో మొదట మంచి పేరు, తర్వాత చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నది ప్రణీత్ మాత్రమే కాదు. ఆయనకు ముందు ఐపీఎస్ అధికారిగా ఉమ్మడి ఏపీ డీజీపీ, సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ వరకూ ఎదిగిన హెచ్.జే.దొరకు ‘సమర్ధ ఐపీఎస్’గానే గాక కర్కోటక పెద్ద పోలీసుగా కూడా చాలా చెడ్డపేరు వచ్చింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యంత ఇష్టుడైన పోలీసుగా దొర పేరు చెబుతారు. ముఖ్యంగా వరంగల్ జిల్లా వంటి తెలంగాణ ప్రాంతాల్లో ఈ హనుమంతు జగన్నాయకుల దొర (హెచ్.జె. దొర) నాయకత్వంలో పోలీసుల జులుం చాలా ఎక్కువ ఉండేదని నాటి పత్రికలు తిరగేస్తే తెలుస్తుంది.
అలాగే, దొరకు సమీప బంధువైన హనుమంతు లాలాలజపతి రాయ్ అనే ఐఏఎస్ అధికారికి మాత్రం నాకు తెలిసి చాలా చాలా మంచి పేరుండేది. బీసీ స్టడీ సర్కిల్ ను సమర్ధంగా ఆయన నడిపించి ఓబీసీ విద్యార్ధులకు ఎనలేని మేలు చేశారు. 1990ల చివర్లో అనేక మంది బీసీ విద్యార్ధులు యూపీఎస్సీ పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణులు కావడానికి లజపతిరాయ్ కృషి, సామర«్ధ్యం ప్రధాన కారణాలు. హనుమంతు కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో రాణించిన ఏకైక నేత హనుమంతు అప్పయ్య దొర.
ఆయన తెలుగుదేశం తరఫున శ్రీకాకుళం నుంచి పార్లమెంటుకు (1984–89) ఎన్నికైన మొదటి నాయకుడు. మొదటి టీడీపీ కాళింగ నేత కూడా. తర్వాత హనుమంతు అప్పయ్య దొర టెక్కలి నుంచి రెండుసార్లు పూర్వపు ఏపీ అసెంబ్లీకి టీడీపీ టికెట్ పై ఎన్నికయ్యారు. ఇలా ముగ్గురు కేంద్ర ఉన్నత సర్వీసు అధికారులను (దొర, లజపతిరాయ్, అరుణ్ కుమార్), ఒక రాజకీయ నేతను (అప్పయ్యదొర) అందించిన హనుమంతు కుటుంబనామం ఉన్న ప్రణీత్ హనుమంతు పూర్తిగా తెలుగు ప్రజలు అసహ్యించుకునే రీతిలో వార్తల్లో వ్యక్తిగా మారడం విషాదం……. ( By మెరుగుమాల నాంచారయ్య )
సరే, ఆ కులంలో, ఆ ఇంటి పేరుతో చాలామంది సగటు మనుషులు కూడా ఉండి ఉంటారు… టీవీల్లో బాగా రాణిస్తున్న సిరి హన్మంతు ఈ సమూహమో కాదో తెలియదు… మనకు పరిచయం లేని చాలామంది ఉండొచ్చు… కానీ ఒక్క చీడపురుగుతో అందరికీ చెడ్డపేరు అనడానికి ఈ ప్రణీతుడే పెద్ద ఉదాహరణ… (ముచ్చట)…
Share this Article