NTR , అమితాబ్ బచ్చన్ లు ఇద్దరికీ యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజిలను ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన సినిమాలు ఈ రెండు . హిందీలో సూపర్ హిట్ అయిన జంజీర్ సినిమాకు రీమేక్ గా వచ్చింది మన నిప్పులాంటి మనిషి . 1974 లో వచ్చిన ఈ సినిమా రజతోత్సవం చేసుకుంది . ఈ సినిమా తర్వాత NTR చాలా హిందీ సినిమాలకు రీమేకులలో నటించారు . అన్నీ బ్రహ్మాండంగా ఆడాయి .
ఇంక ఈ సినిమాలో ప్రత్యేకంగా మెచ్చుకోవలసింది సత్యనారాయణనే . హిందీలో ప్రాణ్ నటించిన పాత్రను సత్యనారాయణ ప్రాణ్ తో సమానంగా చాలా బాగా నటించారు . ప్రాణ్ కన్నా కూడా బాగా చేసాడేమో అనిపిస్తుంది .
రివెంజ్ నేపధ్యంలో జానపద , సాంఘిక చిత్రాలు ఇంతకుముందే చాలా వచ్చాయి . వాటిల్లో హీరోలు యాంగ్రీ యంగ్ మెన్లు కాదు . ఈ సినిమా తర్వాత వచ్చిన నేరం నాది కాదు ఆకలిది , అన్నదమ్ముల అనుబంధం వంటి రివెంజ్ సినిమాలు పాతవాటికి కాస్త భిన్నంగానే వచ్చాయి .
Ads
నిప్పులాంటి మనిషి సినిమా అనగానే ఎవరికయినా మొదటగా గుర్తుకొచ్చేది స్నేహమేరా నా జీవితం స్నేహమేరా శాశ్వతం పాటే . సంగీత దర్శకుడు సత్యాన్ని అభినందించాలి . Friendship Day నాడు టివిల్లో వినిపిస్తుంటుంది . కత్తికి సాన చురకత్తికి సాన అనే లత మీద తీయబడిన పాట కూడా చాలా పాపులర్ . వెల్ కం స్వాగతం , ఏదో అనుకున్నాను , ఒరబ్బీ ఒరబ్బీ పాటలు బాగుంటాయి . యస్ డి లాల్ దర్శకుడు .
హిందీలో జయబాధురి వేసిన పాత్రను తెలుగులో లత వేసింది . ఇతర పాత్రల్లో దేవిక , ప్రభాకరరెడ్డి , రాజబాబు ద్విపాత్రాభినయం , రేలంగి , హలం , త్యాగరాజు ప్రభృతులు నటించారు . యూట్యూబులో ఉంది . NTR అభిమానులు చూసి ఉండకపోతే తప్పక చూడండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు……… ( By డోగిపర్తి సుబ్రహ్మణ్యం )
2013 లో కావచ్చు రిలయెన్స్ వాళ్లు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ హీరోగా ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో పునర్నిర్మించారు… తెలుగులో తుఫాన్, హిందీలో అదే పేరు జంజీర్… రెండు భాషలకూ దర్శకులు, సంగీత దర్శకులు వేర్వేరు… కానీ మెప్పించలేకపోయింది… రెండు భాషల్లోనూ ఫ్లాప్… ఈ సినిమా హిట్టయి ఉంటే రామ్ చరణ్ హిందీలో ఇంకొన్ని సినిమాలు చేసి ఉండేవాడేమో…
అమితాబ్ పాత జంజీర్‌తో పోల్చడం హిందీలో ఫెయిల్‌కు ఓ కారణం కావచ్చు, తెలుగులో నిప్పులాంటి మనిషి కూడా ఈరోజుకూ జనానికి గుర్తుండటం, కొత్త సినిమాతో పోలిక కూడా తెలుగు ఫ్లాప్‌కు మరో కారణం అయి ఉండవచ్చు… పాత సినిమాలకు ప్రాణం పాటలు… కాగా కొత్త జంజీర్‌లో చంద్రబోస్ రాసిన పాటలు క్లిక్ కాలేదు… ప్రియాంక చోప్రాకు చాలా రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకున్నా ఆమె కూడా ప్లస్ పాయింట్ కాలేకపోయింది..!! (ముచ్చట)…
Share this Article