టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో హోటల్లో దిగగానే పెట్టెలు తెచ్చి ఒకబ్బాయి రూములో పెట్టాడు. ఊరికి కొంచెం దూరంగా సముద్రంలో చేరడానికి ముందున్న నదికి అభిముఖంగా పర్వతపాదం మీద ఉన్న ప్రశాంతమైన, అందమైన హోటల్ అది. టర్కీ నగదు లిరా కొద్దిగా అయినా లేదు. కరెన్సీ ఎక్స్ చేంజ్ కు ఎక్కడికెళ్లాలి? ఇక్కడి నుండి ఊళ్లోకి వెళ్లడానికి రవాణా ఎలా? అని ఆ అబ్బాయిని హిందీలో అడిగితే అర్థం కానట్లు అయోమయంగా మొహం పెట్టాడు.
ఇంగ్లీషులో అడిగితే అలాగే దిక్కులు చూస్తున్నాడు. వెంటనే జేబులోనుండి స్మార్ట్ ఫోన్ తీసి ఆడియో రికార్డ్ బటన్ నొక్కి…చెప్పమన్నట్లు సైగ చేశాడు. ఇంగ్లిష్ లో చెప్పింది ఫోన్లో టర్కిష్ లోకి వెంటనే ఆడియో తర్జుమా అయ్యింది. అతడి సమాధానం టర్కిష్ లోనే చెప్పి…ఆడియో అనువాదం యాప్ ద్వారా ఇంగ్లిష్ లో సమాధానం వినిపించాడు.
ఇంత ఆంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన ఇస్తాంబుల్లో ఇంగ్లిష్ రాకపోతే ఎలా? అన్నాను. పని అయ్యిందా? లేదా? అన్నట్లు టర్కీ నవ్వు నవ్వుతూ వినయంగా నమస్కారం పెట్టి వెళ్లిపోయాడు.
Ads
మరో టాక్సీ డ్రయివర్ తో కూడా ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. ఇస్తాంబుల్ టాక్సిమ్ స్క్వయర్ లో ప్రఖ్యాత యుద్ధ స్మారక చిహ్నం చూడడానికి సాయంత్రం బయలుదేరాము. పక్కనే మార్కెట్లో తిరిగాము. చీకటి పడింది. మళ్లీ హోటల్ కు వెళ్లాలి. అక్కడే ఉన్న టాక్సీల వారితో ఇంగ్లీషులో మాట్లాడితే వారికి అర్థం కావడం లేదు. ఒక టాక్సీ డ్రయివర్ స్మార్ట్ ఫోన్ నా చేతికిచ్చి జిపిఎస్ లో హోటల్ పేరు టైప్ చేయమన్నాడు. చేశాను. (చైనాలో ఎప్పట్నుంచో ఈ పద్ధతి ఫాలో అవుతున్నారు…)
టాక్సీ రేడియోలో అద్భుతమైన టర్కిష్ పాటలు (అరబిక్ బెల్లీ డ్యాన్స్ పాటల్లా ఉన్న వీనుల విందైనవి) లయబద్దంగా వినిపిస్తుండగా వాయువేగం దాటి మనో వేగంతో వెళుతున్నాడు. అతడితో మాటలు కలిపాను. ఉత్తర టర్కీ గ్రామీణ ప్రాంతం నుండి వచ్చాడట. ఇస్తాంబుల్ కంటే తన ఊరి సౌందర్యం ఇంకా గొప్పగా ఉంటుందని పరవశంగా చెప్పాడు.
సంభాషణ ప్రధానంగా అనువాద యాప్ ఆధారంగానే జరిగినా కాసేపు అయ్యాక యాప్ అవసరం లేని హృదయభాష ఆవిష్కారమవుతుంది. అప్పుడు అన్ని భాషలు, అనువాద యాప్ లు మూగబోయినా అర్థం కావడానికి ఎలాంటి గోడలు అడ్డు ఉండవు. ఇరవై నిముషాల్లో హోటల్ ముందు ఆపి…సలాం చేసి వెళ్లిపోయాడు.
హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో “భాషిణి” పేరిట ప్రత్యేక రియల్ టైమ్ అనువాద సాఫ్ట్ వేర్ తయారు చేస్తున్నారు. దాదాపు డెబ్బయ్ శాతం పరిశోధనలు, పరీక్షలు పూర్తయ్యాయి.
1. భాష గుర్తింపు
2. టెక్స్ట్ అనువాదం
3. రియల్ టైమ్ లో ఏ భాషలోకి కావాలంటే ఆ భాషలోకి ఆడియో తర్జుమా
ఇందులో ప్రధానమైన మూడు సాంకేతిక అంశాలు. ఉదాహరణకు మనం తెలుగులో టైప్ చేసింది ఇంగ్లిష్ భాషలోకి టెక్స్ట్ అనువాదం, తెలుగులో మాట్లాడింది హిందీ, ఇంగ్లిష్ లోకి ఆడియో అనువాదం అవుతాయి. ఇంగ్లిష్ తోపాటు ఇతర భారతీయ భాషల ఆడియోను రియల్ టైమ్ లో తెలుగులో వినవచ్చు.
ఇప్పటికే అందుబాటులో ఉన్న స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్ లతో నడిచే గూగుల్, అలెక్సాల్లో భాష కృతకంగా ఉంటోంది. వీలైనంతవరకు భారతీయ భాషల సహజ ఉచ్చారణ పద్ధతులకు దగ్గరగా ఉండడానికి “భాషిణి” ప్రాజెక్టులో సాంకేతిక నిపుణులు ప్రయత్నిస్తుండడం సంతోషించదగ్గ విషయం.
రేప్పొద్దున ఘంటసాల, సుశీల, బాలసుబ్రహ్మణ్యం ఉచ్చారణ కొలమానాలు పోయి…”భాషిణి” ప్రమాణాలు స్థిరపడినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
“సర్వవర్ణోప శోభితా”
“మాతృకావర్ణ రూపిణి”
అని లలితా సహస్రనామాల్లో అమ్మవారి పేర్లు. వర్ణం అంటే అక్షరం. ఈ భావనతోనే కాళిదాసు కూడా శ్యామలా దండకం చివర్లో “సర్వ వర్ణాత్మికే!” అని జగజ్జననిని అనన్యసామాన్యంగా స్తుతించాడు. యాభై అక్షరాలు యాభై మాతృకలు. ఆ యాభై మాతృకలు కన్న పిల్లలే అనంతమైన అక్షరాల గుణింతాలు. వాటిలో శక్తిని నింపితే మంత్రాలవుతాయి. ఆ మంత్రాలను ఎలా పలకాలో అలా పలికితే ఆ శక్తి మన సొంతమవుతుంది. ఉచ్చారణకు భారతీయ భాషలు ప్రాణమివ్వడం వెనుక ఇంత అంతరార్థం, పరమార్థం దాగి ఉన్నాయి. ఇంతకంటే లోతుగా వెళితే ఇది ఆధ్యాత్మిక ప్రసంగమవుతుంది.
ఉంటే అనడానికి ఉల్టే;
కంటే అనడానికి కల్టే
అని… అందులో తప్పేమిటని ఉల్టా వాదించే కళ్లులేని తెలుగు కబోధుల ‘కళ్లావి’ల ముంగిళ్లలో పరవశించి పేడ లేకుండానే చల్లుకునే అనంతమైన కళ్లాపుల అజ్ఞానాన్ని ఇలాంటి ‘భాషిణి’లు కొంతవరకైనా తగ్గిస్తే- తెలుగు భాషకు అంతకంటే మంచి రోజులు ఏముంటాయి? – పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article