అసలు ఒక ముఖ్యమంత్రి ప్రజల్ని నేరుగా కలవాల్సిన అవసరం ఏముంటుంది..? ఇదీ ఓసారి కేటీయార్ వేసిన ప్రశ్న మొన్నటి ఎన్నికల ముందు… సరే, వ్యవస్థ సరిగ్గా పనిచేస్తున్నప్పుడు ప్రజలు నేరుగా ముఖ్యమంత్రికి మొరపెట్టుకోవాల్సినవి ఏముంటాయి..? ఉండొద్దు కదానేది తన భావన… లెక్కప్రకారం కరెక్టే… కానీ..?
మన సిస్టమ్ పైనుంచి కింద దాకా సగటు మనిషిని సతాయించేదే తప్ప సానుకూలంగా వ్యవహరించేది కాదు… పైగా ముఖ్యమంత్రి నేరుగా ప్రజలను కలుస్తుంటే నిజంగా జనం నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యల తీవ్రత ఏమిటో, ఏయే సమస్యలపై జనం సఫరవుతున్నారో తెలుస్తుంది… తద్వారా తన పాలసీల్లో మార్పులు లేదా కొత్త పాలసీలు తీసుకుని, జనం మెప్పు పొందే చాన్స్ ఉంటుంది…
అన్నింటికీ మించి జనాన్ని కనెక్ట్ కావడం ముఖ్యమంత్రికి వ్యక్తిగత పాపులారిటీని పెంచుతుంది… అందుకే వైఎస్ ప్రతిరోజూ తప్పకుండా తన క్యాంపు ఆఫీసులో జనాన్ని కలిసేవాడు, స్వయంగా దరఖాస్తులు తీసుకునేవాడు, వాటిని సీఎం ఆఫీసు ఫాలోఅప్ చేసేది… అది వైఎస్ చరిష్మాను పెంచడమే కాదు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 వంటి ఉపయోగ పథకాలకు బాటు వేసింది…
Ads
అప్పుడు తను కట్టిందే బేగంపేటలోని సీఎం క్యాంప్ ఆఫీస్… తరువాత అది ఎప్పుడూ ప్రజల కోసం పెద్దగా తెరుచుకున్నది లేదు… రోశయ్యకు సొంత ఇల్లే క్యాంపాఫీసు… కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా తరచూ జనాన్ని కలిసినట్టు గుర్తులేదు… కేసీయార్ దాన్ని మరింత విస్తరించి ఓ గడీ చేసేశాడు… కీలకమైన రివ్యూ మీటింగులు అక్కడే… తను సచివాలయమే వెళ్లకపోయేది కదా…
రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ప్రగతిభవన్ పేరు మార్చి, ఒక భాగాన్ని ప్రజాఫిర్యాదుల స్వీకరణకు కేటాయించి, కొంత భాగాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసానికి ఇచ్చేశాడు… తను సొంత ఇంటి నుంచే ప్రస్తుతానికి వ్యవహారాలు నడిపిస్తున్నాడు… ఇల్లే క్యాంపాఫీసు… కానీ అదలా కొనసాగితే వచ్చీపోయేవాళ్లకు ఇబ్బంది… ముఖ్యుల రాకడకు వోకే గానీ జనం వచ్చిపోవడానికి సూట్ కాదు…
ఎంసీహెచ్ఆర్‌డీలో క్యాంపాఫీసు అన్నారు, లేదు… తరువాత దిల్‌ఖుష గెస్ట్ హౌజు దగ్గర కొత్త భవనం అన్నారు, లేదు… (నిజానికి దిల్‌ఖుష ఆవరణ పెద్దది, మంచి స్పాటే, రాజ్‌భవన్ కూడా పక్కనే… వీవీఐపీ జోన్…)… తరువాత కొన్నాళ్లుగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వచ్చి వెళ్తున్నాడు… దాన్ని పూర్తిగా పోలీసు కార్యకలాపాలకే వదిలేయడం బెటర్…
ప్రస్తుతం ఎవరైనా విశేష అతిథులు వస్తే..? మొన్న చంద్రబాబు వచ్చినప్పుడు మళ్లీ ఆ పాత ప్రగతిభవనే… అందుకని తనకు ఓ క్యాంపాఫీసు అవసరం… తను వ్యక్తిగతంగా జనానికి చేరువ కావడానికి, తన పాలన తీరును తనే స్వయంగా సమీక్షించుకోవడానికి, నేరుగా ఫీడ్ బ్యాక్ రావడానికి తను రోజూ ప్రజల్ని కలవడం అవసరం… కానీ దానిపై తనకు పెద్ద ఇంట్రస్టు లేనట్టుంది…
ఎన్నికలకు ముందు ఎవరో పంతులు తన కోసం రాజశ్యామల యాగం చేసినప్పుడు… నీ ఇల్లే నీకు గోల్డెన్ స్పాట్, అక్కడి నుంచే వ్యవహారాలు నడిపిస్తే నీకు మంచిది అని చెప్పినట్టు జర్నలిస్టు, బ్యూరోక్రాట్ల సర్కిళ్లలో ఓ టాక్… నిజమైనా, కాకపోయినా ముఖ్యమైన రాజకీయ, పాలన వ్యవహారాల్ని, కీలక సమీక్షల్ని అక్కడే కొనసాగించినా… జనానికి కనెక్టయ్యేలా తను రోజూ ప్రజల్ని కలవడం అవసరం… కేసీయార్ చేయలేకపోయింది అదే… అది జరగాలంటే తనకు ముందు ఓ క్యాంపాఫీసు కావాలి…!!
Share this Article