Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎటుచూసినా ఎద్దు కొమ్ములే… ఎటొచ్చీ సొమ్ములే కొరత… ఎమ్మిగనూరు సంత…

July 16, 2024 by M S R

ఎమ్మిగనూరు ఎద్దుల మార్కెట్ చూశారా?
………………………………………………….
A Typical Indian Agrarian Tragedy
………………………………………………….

కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు
14 జూలై 2024 ఆదివారం ఉదయం
ఎమ్మే, ఎమ్మోగ అంటే ఎనుము, పశువులు -కన్నడలో. అదే ఎమ్మిగనూరు అయింది.
గాంధీనగర్ సెంటర్ నించి కొబ్బరికాయల దుకాణమూ, టీ కొట్లూదాటి, కర్నూలు బైపాస్ రోడ్డు మీద తిన్నగా అయిదారు నిముషాలు నడిస్తే –
పచ్చని కూరగాయల సంత, పశువుల్ని తోలుకొచ్చిన వందల మినీ వ్యాన్ ల వరసలు.
ఆ వెనకే ఆదివారం ఎద్దుల మార్కెట్.
అచట ముద్దొచ్చే ఎద్దులు అమ్మబడును.
తెల్లగా పువ్వుల్లా, అందమైన నల్లగా మెరిసే
గుండ్రటి పెద్ద కళ్ళతో అమాయకంగా వున్నాయవి! మొనదేలి వొంపు తిరిగిన కొమ్ములతో,
కళ్ళు తిప్పుకోలేని సౌందర్యంతో మెరిసిపోతున్నాయవి.

ఎద్దులు.. రెండేసి జతలు. రెండు ఎద్దుల్ని తాడుతో కలిపి పట్టుకున్న రైతులు… అలా ఆ పెద్ద గ్రౌండు నిండా జతలు జతలుగా వందల్లో ఎడ్లు. మౌనంగా ధ్యానముద్రలో ఎడ్లు. అవన్నీ అమ్మకానికే. కొనే వాళ్ళ వైపు రైతులు ఆశగా చూస్తున్నారు. బేరాలు నడుస్తున్నాయి.
బాగా హుందాగా, ఎత్తుగా, ఆకర్షణీయంగా వున్న రెండు ఎద్దుల్ని పట్టుకుని వున్న రైతుని అడిగాను, వాటి ఖరీదెంత? అని. “లక్షన్నర” అని చెప్పాడు.”ఒక్కొక్కటా?” అని అడిగాను.
“కాదు, రెండు కలిసే”, అన్నాడు.
“అరే, చాలా తక్కువ రేటే” అన్నాను.
ఈ మాత్రం పెట్టి కొనడానికే ఎవ్వరూ రావడం లేదు అని నిరాశగా అన్నాడు. ఒక్కొక్కటే లక్షకి అమ్మొచ్చు, దిట్టంగా వున్నాయని అని అన్నాను.

Ads

“మీరంటే సరిపోదు, ఇక్కడ ఆ రేటు పలకదు” అని కొంచెం చిరాకు పడ్డాడు. ఫోటో తీసుకుంటాం అంటే సరే అన్నాడు. బలిష్టంగా ఉన్న ఈ మేలు జాతి పశువుల్ని ‘కిలారు ఎడ్లు’ అంటారు. దూడలూ, పెద్ద సైజులో ఉన్న ఎద్దులూ సంతకో వింత
అందాన్ని తెచ్చాయి. ఎటు చూసినా కొమ్ములే!

గోవులొస్తున్నాయి జాగ్రత్తలో రావిశాస్త్రి గారు, కనుచూపు మేరా వున్న ఆవుల గురించి,
“అది కొమ్ముల తోటలా వుంది”అని రాశారు. రావిశాస్త్రి నవల ‘సొమ్మలు పోనాయండి’ ఎప్పటికీ గుర్తుండిపోయే వాక్యంతో మొదలవుతుంది.
“జత ఎడ్లండీ.. జెనం నిలబడి సూసీవోరండీ!”
ఎమ్మిగనూరు ఎనుములు మార్కెట్ లో
ఖచ్చితంగా నా అనుభవం ఇదే.

జనం కిటకిటలాడుతున్నారు.
అవి గనక కొమ్ము విసిరితే చావు దెబ్బ తింటాం. అస్సలు… అంత సీనులేదు, అవెంతో బుద్దిగా, వొద్దికగా, మౌనగంభీరంగా నిలబడి వున్నాయి. ఎంతసేపయినా చూడొచ్చు వాటిని!
ఎద్దులకు కట్టే తాళ్ళు, మోకులు, పలుపులు ముదురు ఎరుపు , పసుపు, నీలం రంగుల్లో గుట్టలు పోసి అమ్ముతున్నారు. కలర్ ఫుల్ గా వుంది మార్కెట్. హడావుడిగా వుంది.
ప్రేమతో సాకిన, దాణా పెట్టి పెంచిన, అపురూపంగా చూసుకున్న విలువైన ఆస్తుల్ని రైతులు నడి బజార్లో అమ్ముకుంటున్నారు. వాళ్ళ మొహాల్లో ఆత్రుత, నిరాశ, తగినంత రేటు రాదేమోనన్న బెంగ స్పష్టంగా తెలుస్తున్నాయి. ఎమ్మిగనూరుకి 60-70 కిలోమీటర్ల దూరంలోని అనేక గ్రామాల నుంచి రైతులు..,

ఎద్దుల్ని తీసుకొస్తారు. కొందరికి అప్పులుంటాయి. మరికొందరికి అత్యవసరాలు వుంటాయి. అక్కడ ఎద్దులు మాత్రమే నిబ్బరంగా, మెజిస్టిక్ గా, మౌనంగా వున్నాయి. నిజానికది రైతుల జీవితాన్ని పెనవేసుకుని వున్న పెను విషాదం. అక్కడ రైతుల వేదన మాత్రమే తెలుస్తుంది మనకి. వాటిని ప్రాణాధికంగా పెంచిన, ప్రేమించిన ఇళ్లల్లోని ఆడవాళ్ళ కన్నీళ్ళు కనిపించవు!

నన్ను మార్కెట్ కి తీసుకెళ్ళిన రచయిత మారుతి పౌరోహితం కొన్ని ఫోటోలు తీశారు. ఎమ్మిగనూరుకి 27 మైళ్ళ దూరంలోని ఒక స్కూల్లో హెడ్మాస్టరు మారుతి. ఆ ప్రాంతంలోని గ్రామీణ పేదరికం మీద, నీళ్లింకని నేలల మీద, ఎండి బీటలు వారిన సామాన్య జనం బతుకుల మీద మారుతీ పౌరోహితం అధారిటీ.
మారుతి నాతో ఇలా అన్నారు. బహుశా ఆ స్టన్నింగ్ ఎద్దుల్ని చూసి మురిసిపోతున్న నాకు కొన్ని నిజాలు చెప్పాలనుకున్నారేమో!

“ఆ మారుమూల గ్రామాల్లో, ఎమ్మిగనూరు తీసికెళ్ళడానికి తెలతెలవారుతుండగానే ఎద్దుల్ని సిద్ధం చేస్తున్నప్పుడు, ఇంట్లో పిల్లలూ, ఆడవాళ్ళూ పెద్దలూ దిగులుతో కుంగిపోతారు. విచారంతో సాగనంపుతారు. వాటితో ఏళ్ల తరబడి వాళ్ళకుండే గాఢమైన అనుబంధం ఆ రోజుతో తీరిపోతుంది. వేన్ల మీద ఎక్కించి తీసుకెళతారు.

మార్కెట్లో, బేరాలు సాగిసాగి తెగనమ్ముకున్నాక రైతు బాధచెప్పనలవి కాదు. చేతికందేది తక్కువ డబ్బు. ఆ ఎద్దులపై రైతులకుండే ఆపేక్ష చెప్పనలవి కానిది. “దిగులు నిండిన రైతులు, కళ్ళల్లో సన్నటి నీటి పొర కదలాడుతుండగా – కన్నబిడ్డల్లా పెంచుకున్న ఎద్దుల్ని ఎవరికో అప్పజెప్పి, వట్టి చేతుల్తో, ఆ చీకటిపడుతున్న సాయంకాలం వేళ వాళ్ళ గ్రామాల వైపు కదిలి వెళతారు.

ఎమ్మిగనూరులో ప్రతి ఆదివారం ఈ దృశ్యం చూడవచ్చు. భారతీయ గ్రామీణ పేదరికానికీ, సామాన్య రైతుల నిస్సహాయతకీ, పాలకుల నిర్లక్ష్యానికీ గుర్తుగా, కన్నీటి సాక్ష్యంగా ఎప్పటికీ గుండెల్లో కలుక్కుమంటూనే వుంటుంది- ఎమ్మిగనూరు ఎద్దుల మార్కెట్….  – తాడి ప్రకాష్          9704541559

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కాఫర్ డ్యామ్ కదా… పర్లేదు, అప్పుడప్పుడూ అలా జారుతూ ఉంటాయి…
  • ప్రశాంత్, వంగా, రాజమౌళి, మణిరత్నం…. ఈ ప్రేమకథ తీయగలరా..?
  • మార్వాడీ గో బ్యాక్..! సమాజంలో ఓ అలజడి రేపే కుటిలయత్నాలు..!!
  • దర్శనమివ్వని ఆ దేవదేవుడికి … బయటి నుంచే ఓ పే-ద్ద దండం పెట్టింది బిడ్డ..!!
  • ప్రజల కోసం చేసే పోరాటాలు, త్యాగాల వాస్తవ విలువ ఎంత..?!
  • సో వాట్..? నా నలుపే నా బలం…! తలెగరేసి చెబుతుంది అర్చన..!!
  • పెళ్లయిన 9 రోజులకే భర్త హత్య…! ఆ తరువాత ఆమె కథ ఏమైంది..?!
  • బిపాషా మగది..! నెట్‌లో ఓ పిచ్చి ‘కండల’ పంచాయితీ కలకలం..!
  • పెరోల్..! అన్ని బంధాల్నీ గౌరవించే ఓ అనుబంధాల బాధితుడి కథ..!!
  • సీఎం ప్రసంగాల్లో గుణాత్మక మార్పు… విజన్ 2047 గురించి గుడ్ ప్రొజెక్షన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions