డబుల్ ఇస్మార్ట్… పోతినేని రాం (రాపో) హీరోగా చార్మి జగన్నాథ్, సారీ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన సినిమా… ఆ సినిమాకు సంబంధించిన మార్ ముంత, చోడ్ చింత అనే ఓ సాంగ్ రిలీజ్ చేశారు… అదేదో ఐటమ్ సాంగ్ కావచ్చు బహుశా… గట్లనే వాసన కొట్టింది చూస్తుంటే…
సరే, సదరు రాపో అప్పట్లో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేశాడు కదా ఇదే జగన్నాథుడితో… అది సూపర్ హిట్… కానీ రాం నోటి వెంట తెలంగాణ యాసను అత్యంత కృతకంగా పలికించి, అవీ తనతో పిచ్చి పిచ్చి పదాలు పలికించి చిరాకెత్తించారు తెలంగాణ భాషాప్రియులను… ఐనా వాళ్లు పట్టించుకోరు… వీలైనంతగా తెలంగాణ యాసను, భాషను ఖూానీ చేస్తూనే ఉంటారు కదా…
తెలంగాణ వచ్చినా అంతే, రానప్పుడూ అంతే… ఇప్పుడంటే తెలంగాణ ఫోక్, సాంగ్, రోల్స్, కల్చర్, బ్యాక్ డ్రాప్ అన్నీ ట్రెండ్ కాబట్టి కాస్త ప్రయారిటీ ఇవ్వకతప్పడం లేదు కమర్షియల్ యాంగిల్‌లో… ఐతే నాని దసరా దగ్గర నుంచీ ఇప్పుడొచ్చిన ఈ పాట దాకా… తెలంగాణ అనగానే మందు కొట్టుడే అనే పిచ్చి భావనల్ని వ్యాప్తి చేస్తున్నారు ఈ దర్శకులు…
Ads
అప్పట్లో వచ్చిన బలగం, షరతులు వర్తిస్తాయి వంటి తెలంగాణ దర్శకులు తీసిన సినిమాల్లో తెలంగాణ కల్చరే కాదు, ఎమోషన్స్, తెలంగాణ జీవితాలు కనిపించాయి… భాష, పాట అన్నీ తెలంగాణను ప్రతిబింబించాయి… ఇప్పుడొచ్చే డబుల్ ఇస్మార్ట్ ఇంకెంతగా తెలంగాణ యాసను డబుల్ ఖూనీ చేస్తుందో తెలియదు గానీ… మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాట మాత్రం అచ్చంగా తెలంగాణ అంటే కల్లు, విస్కీ కొట్టుడే అన్నట్టుగా సాగింది…
అన్నింటికీ మించి పాట మధ్యలో కేసీయార్ పాపులర్ ఊతపదాలు… ఏం జేద్దామంటవ్ మరి పదాల్ని యథాతథంగా ఆయన టోన్‌నే వాడారు పాటలో రెండుసార్లు… ఆ పదాలు వస్తున్నప్పుడు మొత్తం కల్లు బింకీలు, కల్లు సీసాలు కనిపిస్తుంటాయి… ఏమో, ఇది తనను కించపరిచినట్టే అనిపిస్తోంది… కేసీయార్ అనగానే ఇరవై నాలుగు గంటలూ మందు కొట్టుడు అన్నట్టుగా కొందరు రాజకీయ ప్రత్యర్థులు తనకు మద్యపానానికీ లింకులు పెట్టి విమర్శిస్తారు కదా… ఇదీ అలాగే ఉంది… బాగా లేదు…
రాజకీయంగా తనను, తన విధానాల్ని విమర్శించొచ్చు, తప్పులేదు… కానీ ఇలాంటి చిల్లర ప్రచారాలు సరికావు, ఈ పాట దానికి భిన్నంగా ఏమీ అనిపించలేదు… బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో తెలియదు… కానీ గీత రచయిత కాసర్ల శ్యాం, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కూడా పక్కా తెలంగాణ వాళ్లే…
ఏవో కొన్ని తెలంగాణ పదాలతో పోరీ, ప్యారీ, మిఠా పాన్, బగర్ కత్తా, జర్దా వంటి పదాలతో ఆ ఐటమ్ సాంగ్‌కు అవసరమైనట్టే రాశాడు రచయిత, తనదైన శైలిలో బాగానే పాడాడు రాహుల్ కూడా… ఎటొచ్చీ మధ్యలో ఈ కేసీయార్ టోన్ ఇరికించడం, ఫుల్లు సీసాలు, మందు కొట్టుడు బాపతు చిత్రీకరణ ఏమిటో, ఈ టేస్టు ఏమిటో దర్శకుడికే తెలియాలి… తెలంగాణ వాళ్లే కదా, ఏం చేసినా పర్లేదు, ఎలా తీసినా పర్లేదు అనే పెడసరం ధీమా కావచ్చు..!!
Share this Article