“అమెరికన్ డ్రీమ్” అంటే ఏమిటి.? “తెలివితేటలు ఉండి కష్టపడితే ఏ సపోర్ట్ లేకపోయినా, ఎవరు అయినా, ఏదైనా సాధించవచ్చు అమెరికా లో” అదే అమెరికన్ డ్రీం. దీనికి మంచి ఉదాహరణ రిపబ్లికన్ పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన JD వాన్స్.
అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో ఒక చిన్న ఊర్లో జన్మించాడు JD వాన్స్. తన చిన్నప్పుడే తల్లి తండ్రులు విడాకులు తీసుకున్నారు. తన తల్లి మూడో భర్త తనని దత్తత తీసుకున్నాడు. తల్లి ఏమో డ్రగ్స్ కి బానిస అయ్యింది. పేదరికం వల్ల పిల్లలని చదివించే స్థితిలో ఆమె లేదు.
Ads
అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉండి హై స్కూల్ పూర్తి చేసి, అమెరికా నావికా దళంలో చేరి 2 సంవత్సరాలు పని చేశాడు JD వాన్స్. ఆ తర్వాత నేవీ, ఆర్మీలో పని చేసి తిరిగి వచ్చిన వారికి సపోర్ట్ చేసే ఒక ఆర్గనైజేషన్ సపోర్ట్ తో ఒహాయో స్టేట్ యూనివర్శిటీలో డిగ్రీ చేసి, ఆ తర్వాత అత్యంత ప్రఖ్యాత యేల్ విశ్వ విద్యాలయం నుంచి లా చేసి, అక్కడ పరిచయం అయిన తెలుగు అమ్మాయి ఉషా చిలుకూరి ని పెండ్లి చేసుకొని వెంచర్ క్యాపిటలిస్ట్ (ఫైనాన్సియల్ ఫీల్డ్) గా వర్క్ చేశాడు. అతని భార్య ఉషా మాత్రం లాయర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంది.
రిపబ్లికన్ పార్టీలో సభ్యత్వం తీసుకొని 2022 లో ఒహాయో రాష్ట్ర సెనేటర్ గా నిలబడదాం అని నిర్ణయించుకున్నాడు. ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా రిపబ్లికన్ పార్టీ నుంచి సెనేటర్ గా నిలబడితే సొంత పార్టీ వాళ్ళు వేసిన ఓట్లలో వాన్స్ గెలిచి రిపబ్లికన్ పార్టీ తరపున సెనేటర్ గా నిలబడి ప్రత్యర్ధి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి మీద 53-47 శాతం ఓట్లతో గెలిశాడు.
రెండు సంవత్సరాల తర్వాత రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ రేస్ లో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అతన్ని తన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా తీసుకున్నాడు. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధికి ఎన్నికలు ఉండవు, ప్రెసిడెంట్ ఏ పార్టీ గెలిస్తే వాళ్ళు నియమైంచుకున్న వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ అయ్యి అనుభవం తెచ్చుకొని ఆ తర్వాత కాలంలో ప్రెసిడెంట్ గా నిలబడతారు.
ట్రంప్ గెలిస్తే వాన్స్ అమెరికా సెనేట్ కి అధ్యక్షుడు అవుతాడు. JD వాన్స్ 2028 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెంట్ గా పోటీ చేసి అమెరికా అధ్యక్షుడుగా గెలవటానికి కూడా చాలా అవకాశం ఉంది.
అదే మన దగ్గర ఉండి ఉంటే కనీసం పంచాయతీ వార్డ్ మెంబర్ గా కూడా గెలిచి ఉండేవాడు కాదు. కానీ తల్లి తండ్రుల దగ్గర పెరగలేదు, చుట్టూ డ్రగ్స్, పేదరికం. చదువులో కూడా బొటాబొటీ మార్కులు. పై చదువులకి డబ్బులు లేక దేశం మీద ప్రేమతో నావికా దళంలో చేరి ఆ తర్వాత కూడా ఒక ఆర్గనైజేషన్ సహాయం చేస్తే డిగ్రీ చదువుకొని – అప్పుడు పూర్తిగా లోకాన్ని చదవటం మొదలు పెట్టాడు. అప్పుడు బాగా కష్ట పడి చదివి యేల్ యూనివర్శిటీ లా చదవటం జరిగింది.
అత్యంత సామాన్యుడు కంటే కూడా తక్కువ వ్యక్తి అసమాన్య స్థితికి చేరటం అమెరికాలో సాధ్యం, అదే అమెరికన్ డ్రీం. నిన్న JD వాన్స్ మాట్లాడుతూ అమెరికన్ డ్రీం గురించి ఒక మాట చెప్పాడు. ఎవరు అయినా, ఎలాంటి సపోర్ట్ లేకపోయినా కష్టపడి విజయం సాధించటం అమెరికన్ డ్రీం అంటారు. కానీ నా దృష్టిలో అమెరికన్ డ్రీం అంటే ఒక మంచి భర్తగా ఉండటం, ఇంకా పిల్లలకి ఒక మంచి తండ్రిగా ఉండటం అని చెప్పాడు.
నిజానికి ఇందులో నిగూఢమైన అమెరికన్ డ్రీం ఉంది. ఒక మంచి భర్తగా అంటే ఒక ఇల్లు కొని, ఇంకా భార్య ఏది అడిగినా కొనిచ్చే సామర్ధం ఉండటం, ఇంకా పిల్లలకి ఇష్టమైన వాటిని చదువుకునే సౌకర్యం కల్పించటం. భార్య, పిల్లలు ఏది అడిగినా వారికి కొనిచ్చే పరిస్థితులని అమెరికా కల్పించటం. మంచి స్వేచ్చాయుతమైన వాతావరణం, విద్య, వైద్య సదుపాయాలు కల్పించి మంచి “క్వాలిటీ ఆఫ్ లైఫ్” ని అందించగలగటం కంటే మించిన అమెరికన్ డ్రీం ఏముంటుంది అంటాడు వాన్స్.
నిజంగా సాధారణ తెలివి తేటలు ఉండి కష్టపడితే అమెరికాలో ఏదైనా సాధ్యమే. సపోర్ట్ లేకపోయినా, ఏ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా గెలవటం అమెరికాలో ఎవరికైనా, ఎలాంటివారికైనా సాధ్యమే దానికి JD వాన్స్ జీవితమే ఒక నిదర్శనం; ఇదే అమెరికన్ డ్రీం….. ( జగన్నాథ్ గౌడ్ ) – పూర్తి వ్యక్తిగత అభిప్రాయం….
Share this Article