సత్కవిని కాపాడుకోవడానికి దేవుళ్లే దిగివస్తారనడానికి మన బమ్మెర పోతన, తాళ్లపాక అన్నమయ్య, భద్రాద్రి రామదాసు, త్యాగయ్యలతో పాటు ఎన్నెన్నో ఉదాహరణలున్నాయి.
ఒకపక్క వ్యవసాయం చేస్తూ, మరో పక్క ఇంట్లో వంట వండుకుంటూ పోతన కావ్యం రాస్తుంటే సరస్వతీదేవి చూడలేకపోయింది. ఆమే స్వయంగా గరిటె పట్టి పోతన పూరిపాకలో వంట చేస్తుంటే…బయట అరుగు మీద ఘంటం పట్టి పోతన తెలుగు మందార మకరంద మాధుర్యమున పద్యాలను ముంచి తేలుస్తున్నాడు. ఈ దృశ్యాన్నే జాషువా-
“పోతనార్యుని గేహమున భారతీదేవి చిగురుచేతుల వంటజేయునాడు…”
అని పద్యంలో బంధించాడు.
పోతన రాస్తున్న కావ్యాన్ని తనకు అంకితమివ్వమని రాజు హుకుం జారీ చేశాడు. ఇంటి బయట రాజభటులు బల్లేలు, ఈటెలు పట్టుకుని కావ్యం తాళపత్రాల మూటను ఎత్తుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. వంటింట్లో సరస్వతీదేవి ఏడుపు మొదలు పెట్టింది. ఇంత గొప్ప కావ్యాన్ని నీచుడైన రాజుకు అంకితమిస్తే ఎంతటి అవమానం? అన్నది ఆ తల్లి బాధ.
Ads
“కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో
హాటకగర్భురాణి! నిను నాకటికిం గొనిపోయి యల్ల క
ర్ణాట కిరాట కీచకులు కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!-
నీవు కంటికి పెట్టుకున్న కాటుక…కన్నీటికి కరిగి రవికపై పడేలా ఎందుకు ఏడుస్తావు తల్లీ?
ఆ మహా విష్ణువుకు ఇష్టమైన కోడలా! ఓ మా తల్లీ!
బ్రహ్మదేవుడికి సాక్షాత్తు ఇల్లాలా!
నిన్నుతీసుకుపోయి అంగట్లో పెట్టినట్లు… ఆ కర్ణాట కిరాట కీచకులకు అమ్మను. త్రికరణ శుద్ధిగా ఒట్టు పెట్టి చెబుతున్నాను. నన్ను నమ్ము తల్లీ!”
అని ఆ సందర్భంలో పోతన సరస్వతీదేవికి హామీ ఇస్తేనే ఆమె కుదుటపడింది. రాజు మూర్ఖుడు. రాజభటులు ఇంకా మూర్ఖులు. బలవంతంగా ఇంట్లోకి చొరబడి కావ్యాన్ని ఎత్తుకెళ్లాలనుకున్నారు. లోపలికి రాబోతే గుమ్మం దగ్గర పెద్ద ముళ్ల పంది అడ్డుగా ఉండి…వారిని అడ్డుకుంటోంది. ఎంతగా ప్రయత్నించినా కుదరక భటులు వెనుదిరిగిపోయారు. వారిని అడ్డుకున్నది ఆదివరాహరూపంలో సాక్షాత్తు విష్ణువు.
అన్నమయ్య పదకవితల ఖ్యాతి దశ దిశలా మారుమోగిపోతోంది. రాజు సాళువ నరసింహరాయలుదాకా ఆ వార్త వెళ్లింది. ఇలాంటి మధుర పదకవితలు నామీద కూడా రాసి…పాడు అని ఆజ్ఞాపించాడు. నారాయణుడిని కీర్తించిన నా నాలుక…నీ పాడు జీవితాన్ని కీర్తించదు పొమ్మన్నాడు. రాజుకు కోపం కట్టలు తెంచుకుంది. అన్నమయ్య కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేయించి అస్థానంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు పాడు అని గేలి చేశారు.
పల్లవి:-
ఆకటి వేళల అలపైన వేళల
తేకువ హరినామమే దిక్కు మరి లేదు
చరణం-1
కొఱమారియున్న వేళ కులము చెడిన వేళ చెఱవడి వొరుల చేజిక్కినవేళ
వొఱపైన హరినామమొక్కటే గతి గాక
మఱచి తప్పిననైన మఱి లేదు తెరగు
చరణం-2
ఆపద వచ్చిన వేళ ఆఱడి బడిన వేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతి గాక
మాపు దాకా పొరలిన మరిలేదు తెరగు
చరణం-3
సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గతినాక
మంకు బుద్ది పొరలిన మరిలేదు తెరగు
అని పాడాడు అన్నమయ్య. అంతే. సంకెళ్లు తెగి పడ్డాయి. రాజుకు జ్ఞానోదయమయ్యింది. అన్నమయ్య కాళ్లమీద పడి…క్షమించమని ప్రాధేయపడ్డాడు. తరువాత అన్నమయ్య సాహిత్యాన్ని ప్రచారం చేసే యజ్ఞాన్ని సాళువ నరసింహరాయలే భుజాన వేసుకున్నాడు.
“ఇక్ష్వాకుకుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర!
నను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్ర!
చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్ర!
ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర!
లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్ర!
ఆ పతకానికి బట్టె పదివేల మొహరీలు రామచంద్ర!
సీతమ్మకు చేయిస్తిని చింతాకు పతకము రామచంద్ర!
ఆ పతాకానికి బట్టె పదివేల వరహాలు రామచంద్ర!
కలికి తురాయి నీకు కొలుపుగా జేయిస్తిని రామచంద్ర!
నీ తండ్రి దశరథ మహారాజు పంపెనా?
లేక మీ మామ జనక మహారాజు పెట్టెనా?
ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర?”
అని నానామాటలతో దులిపి పారేసినా…ఏదీ మనసులో పెట్టుకోని రామయ్యకు రామదాసు సాహిత్యం నచ్చే కదా వెంటనే వెళ్లి తానీషాకు డబ్బు చెల్లించి…రామదాసును గోల్కొండ చీకటి చెరసాలనుండి విడిపించి…ఆయన పాటలు వింటూ…ఆయన వెంట తిరిగాడు. ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాడు.
నాదబ్రహ్మ త్యాగయ్యకు బమ్మెర పోతన అంటే ప్రాణం. పోతన భాగవతాన్ని నిత్య పారాయణ చేసే త్యాగయ్య పోతన జీవితాన్ని కూడా ఆదర్శంగా పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో ఊరూరూ తిరిగి త్యాగయ్య కచేరీలు చేసేవాడు. ఒక సంస్థానాధీశుడు త్యాగయ్యకు బంగారు కాసులిస్తే తీసుకోడని తెలిసి…ఆయన శిష్యుల చేతికిచ్చి…ఖర్చులకు ఉపయోగపడుతుంది…ఉచండి అని ఇచ్చాడు. త్యాగయ్య కూర్చునే పల్లకిలో పరుపు కింద ఆ బంగారు కాసులమూటను దాచారు శిష్యులు. దారిలో దొంగలు పడ్డారు. మనదగ్గరేముంది? దోచుకోవడానికి! అన్నాడు త్యాగయ్య. విషయం చెప్పారు పల్లకీ మోస్తున్న శిష్యులు. ఆ దొంగలమీద రామలక్ష్మణులు బాణాలు వేశారు. స్వామీ! తప్పయ్యింది…మన్నించండి! అని దొంగలు త్యాగయ్య కాళ్లమీద పడ్డారు.
దొంగలకేమో దర్శనమిచ్చి…నాకంటికి కనపడకుండా తప్పించుకుని తిరుగుతారా! ఏమిటి స్వామీ! ఈ వివక్ష? అని త్యాగయ్య తనదైన శైలిలో కీర్తనలో రామలక్ష్మణులతో పంచాయతీ పెట్టుకున్నాడు.
లక్ష్మణుడు కూడా రాముడిని ఇదే ప్రశ్న అడిగితే-
నా దాసులకు దాసుడిని. వారిని కాపాడ్డానికి ఎక్కడిదాకా అయినా వెళతాను- బంటుగా అయినా మారతాను- అన్నాడట రాముడు.
ఇవన్నీ జరిగాయా? లేదా? అని సాక్ష్యాలు, ఆధారాలు అడగక్కర్లేదు. తాజాగా మహారాష్ట్రలో ఒక ప్రఖ్యాత కవి ఇంట్లో దొంగతనం తరువాత ఏమి జరిగిందో తెలుసుకుంటే- పోతన, అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య ఉదంతాలకు కూడా ఆధారాలు దొరుకుతాయి.
ప్రముఖ మరాఠా కవి నారాయణ్ సుర్వే అనాథగా బొంబాయిలో అడుగు పెట్టారు. కూలీ పనులు చేసుకుంటూ ఎదిగిన సుర్వే అద్భుతమైన రచనలు చేశారు. పట్టణ శ్రామిక వర్గాల కష్టాలను తన అక్షరాల్లో బంధించారు. పద్మశ్రీతోపాటు ఎన్నెన్నో అవార్డులు పొందారు. 2010లో కన్నుమూశారు. రాయగడ్ జిల్లా విరార్ నగర్ ఆయన ఇంట్లో కూతురు- అల్లుడు ఉంటున్నారు. వారు కొడుకు దగ్గరికి వెళ్లడంతో పదిరోజులుగా ఇంటికి తాళం వేసి ఉంది. ఒక దొంగ తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దోచుకెళ్లాడు. ఇల్లు ఖాళీగా ఉందన్న ధైర్యంతో రెండో రోజు మరిన్ని వస్తువులు దోచుకెళ్లడానికి వచ్చాడు. అప్పుడు నారాయణ్ సుర్వే ఫోటో, ఆయనకొచ్చిన జ్ఞాపికలు, పుస్తకాలు చూశాడు.
ఈ దొంగకు సుర్వే రచనలంటే చాలా ఇష్టం.
“సార్! తప్పయ్యింది. క్షమించండి. మీ ఇల్లని తెలియక దోచుకున్నాను. అన్నీ వెనక్కు తెచ్చి…ఎక్కడివక్కడ పెట్టి వెళుతున్నాను”
అని ఉత్తరం రాసి పెట్టి…వెళ్లాడు.
వెనక్కు తిరిగి వచ్చిన సుర్వే కూతురు- అల్లుడు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో లోకానికి ఈ విషయం తెలిసింది.
బహుశా సుర్వే బతికి ఉంటే కేసు పెట్టేవారు కాదేమో!
తన అక్షరానికి కార్యసిద్ధి కలిగిందని ఆ పాఠకోత్తమ చోరుడిని కలిసి అభినందించి ఉండేవారేమో!
ఒక కరడుగట్టిన దొంగే ఉత్తమ సాహిత్యానికి కరగగా లేనిది…
సాక్షాత్తు భాషాధిదేవతలు, అక్షరపరబ్రహ్మలైన, నాదరూపులైన దేవుళ్ళు అత్యుత్తమ సాహిత్యానికి కరిగి సేవలు చేయరా ఏమిటి!
చేస్తారు. కచ్చితంగా చేస్తారు.
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అని ఎగతాళి మాట.
మంత్రించిన మంచి సాహిత్యానికి చింతించిన దొంగలే మారుతున్నప్పుడు-
“మంత్రాలకు చింతిత ‘చింత’కాయలు రాలును!”
అని ఎగతాళి నెగటివ్ మాటను పాజిటివ్ మాటగా తిరగరాసుకోవచ్చు! – పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article