చాలామందికి ఓ సందేహం… ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం బీజేపీయా..? బీజేపీ సైద్దాంతిక విభాగం ఆర్ఎస్ఎస్..? సంఘ్ ఓ వృక్షం మొదలు… దానికి అనేకానేక ‘శాఖలు’ ఉంటయ్… అందులో ఓ రాజకీయ కొమ్మ బీజేపీ… అని ఓ మిత్రుడి స్పష్టీకరణ…
స్వయం సేవకులు, వివిధ విభాగాల కార్యకర్తలు దీని బలగం… ఇందులో వ్యక్తీ ప్రాధాన్యం ఉండకూడదు… సంఘ్ మాత్రమే అల్టిమేట్ అనేది అలిఖిత రాజ్యాంగం… కానీ కొన్నిసార్లు కొందరు వ్యక్తులు సంఘ్‌కు అతీతంగా ఎదిగామని అనుకుంటారు… అప్పుడు కొమ్మలు నరికే పని పెట్టుకుంటుంది సంఘ్… అనగా బ్రాంచ్ కటింగ్…
నాది జీవసహజమైన పుట్టుక కాదు… నన్ను దేవుడు పంపించాడు… అనే స్థాయికి ఎవరైనా ఎదిగితే సంఘ్ ఏ స్థితిలోనూ సహించదు… నేనే సత్యం, మిగతావన్నీ మిథ్య అనే భావనను తుంచేయడానికి ప్రయత్నిస్తుంది… కఠినమైన సర్జరీ అయినా సరే… నిన్న ఎక్కడో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన మర్మగర్భ వ్యాఖ్యలతో ఇదుగో ఇలాంటి విశ్లేషణలే వినిపిస్తున్నాయి…
Ads
నిన్న జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లాలో వికాస్ భారతి అనే ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు ఆయన… అవి ఎవరిని ఉద్దేశించినవి..? అందరూ అవి మోడీని ఉద్దేశించి చేసినవే అనుకుంటున్నారు… కొన్నాళ్ల పరిణామాలూ అవే సూచిస్తున్నాయి… కాంగ్రెస్ కూడా ఈ వ్యాఖ్య మోడీ మీద ఆర్ఎస్ఎస్ ప్రయోగించిన అగ్ని క్షిపణి అని వ్యాఖ్యానించింది… ఇంతకీ ఏమన్నాడు..?
‘‘జీవుడు వికాస క్రమంలో మనిషి లక్షణాలు సంతరించుకుంటాడు… తరువాత అనేక అతీత శక్తులున్న సూపర్ మ్యాన్ కావాలనుకుంటాడు… తరువాత దేవుడు, తరువాత విశ్వరూపి కావాలని ఆశిస్తాడు… ఆ తరువాత..? అంతర్గత, బహిర్గత వికాసానికి అంతు ఉండదు…’’
ఆయన చేసినవి జనరలైజ్డ్ కామెంట్స్‌లాగా లేవు… ఎవరినో ఉద్దేశించి, ఎవరికో తగలాలనే అన్నాడు… మోడీపైనేనా..? గతంలోనూ ఆయన చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా బీజేపీ పెద్ద తలకాయలను ఒకింత డిఫెన్స్ లో పడేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి…
మోడీకి సాగినన్ని రోజులూ ఆర్ఎస్ఎస్ మౌనంగానే ఉంది… ఎంతో కొంత హిందూ సంఘటన జరుగుతున్నది కదాని ఉపేక్షించింది… మొన్నటి సాధారణ ఎన్నికల్లో బీజేపీ పట్ల పలు రాష్ట్రాల్లో నిరాదరణ స్పష్టంగా కనిపించింది… ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్…
నిజానికి ఆర్ఎస్ఎస్ మొన్నటి ఎన్నికల్లో కావాలనే తటస్థంగా ఉండిపోయిందనీ, మోడీషాలకు అర్థం కావాలనేదే దాని వెనుక మర్మమనీ పలు విశ్లేషణలు కూడా వినిపించాయి… ఫలితంగానే కొన్ని ఉత్తర రాష్ట్రాల్లో బీజేపీకి నెగెటివ్ ఫలితం వచ్చింది… ఇప్పుడిక నేరుగానే అస్త్రాలు మొదలెట్టింది…
యూపీలో రాజకీయాలు కూడా మారిపోతున్నాయి… లుకలుకలు బహిర్గతమవుతున్నాయి… ఒక్కసారి యోగి వైదొలిగితే మాత్రం యూపీలో మళ్లీ ఒకనాటి మాఫియా, నేర రాజకీయాలు బలం పుంజుకుంటాయి… ఆర్ఎస్ఎస్ మాత్రం అదేమీ ఆలోచించడం లేదు… మోడీ నేతృత్వంలోని వర్తమాన బీజేపీ బలహీనపడినా, హిందూ ద్వేష ఇండి కూటమి బలపడినా అది స్థూలంగా ఆర్ఎస్ఎస్ వ్యాప్తికే నిరోధకం… అదీ సంఘ్ ఆలోచిస్తున్నట్టు లేదు… ఆ కూటమిలోని డీఎంకే, టీఎంసీ మరీ హార్డ్ కోర్ యాంటీ హిందూ పాలిటిక్స్ నడిపించేవి…
మోడీలో పెరిగిన అహాన్ని కత్తిరించాలనే భావనేమో… ఇది తెలియనంత అమాయకుడేమీ కాదు మోడీ… సంఘ్‌తో రాజీ తప్పదు… తను స్వతహాగా సంఘ్ కోసం తన వ్యక్తిగత జీవితాన్ని సమర్పించిన ప్రచారక్… ప్రస్తుతం పెద్దగా కనిపిస్తున్న అగాధాన్ని ఎలా పూడ్చుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది…
Share this Article