కె రామలక్ష్మి మార్కు సినిమా . ఈ అభిమానవతి సినిమాకు కధ ఆమెదే . ఆమె వ్రాసిన కరుణ కధ అనే నవల ఆధారంగా డూండీ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా . డైలాగులు కూడా ఆమే వ్రాసారు . మరి ఇంకా ఏదయినా సినిమాకు కూడా డైలాగులు వ్రాసారేమో నాకు తెలియదు . రామలక్ష్మి గారి హీరోయిన్ ఎలా ఉండాలో ఈ సినిమాలో హీరోయిన్ అలాగే ఉంటుంది .
షీరో వాణిశ్రీయే . ఆత్మాభిమానాన్ని ఎన్ని కష్టాలొచ్చినా వదలిపెట్టకుండా విధితోనే పోరాడే హీరోయిన్ గా వాణిశ్రీ బాగా నటించింది . అనాధగా పెరిగి , కోటీశ్వరుడికి భార్య అయి , ఇష్టం లేని అత్తగారి చేతిలో మోసపోయి , భర్త విదేశాలలో ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళవలసి వస్తుంది . బయటకు వెళ్ళాక తెలియకుండానే తండ్రి వద్దకు చేరి , హత్యానేరంలో కోర్టు బోనెక్కుతుంది . లాయరయిన కొడుకు రక్షిస్తాడు .
కృష్ణ తండ్రీ కొడుకులుగా బాగా నటించారు . అత్తగా యస్ వరలక్ష్మి , విలన్ గా శరత్ బాబు , కొడుకు కృష్ణకు ప్రియురాలిగా ప్రమీల బాగా నటించారు . ఇతర పాత్రల్లో ప్రభాకరరెడ్డి , మాడా , రావి కొండలరావు , టి జి కమలాదేవి ప్రభృతులు నటించారు .
Ads
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి . ముఖ్యంగా దాశరధి వ్రాసిన నీపైన నాకెంత ప్రేముందో నీకెలా తెలిపేది పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . బాలసుబ్రమణ్యం చాలా బాగా పాడారు . మిగిలిన పాటల్లో మామిడితోటలో అనే పాట ఇద్దరు కృష్ణల మీద బాగుంటుంది .
మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసినట్లు గుర్తు . కమర్షియల్ గా ఎలా ఆడిందో గుర్తు లేదు కానీ , సినిమా బాగుంటుంది . ముఖ్యంగా వాణిశ్రీ , రామలక్ష్మి అభిమానులకు బాగా నచ్చుతుంది . కృష్ణ , యస్ వరలక్ష్మి , ప్రమీలల నటన కూడా బాగుంటుంది . యూట్యూబులో ఉంది . చూడబులే .
By the way , 1975 లోకి వచ్చేసాం . ఈ సంవత్సరంలో సుమారు 70 సినిమాలు వచ్చాయి . అనారోగ్య కారణాల వలన ఈ సంవత్సరం అక్కినేని సినిమాలు ఏవీ రాలేదు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ………. ( By దోగిపర్తి సుబ్రహ్మణ్యం )
Share this Article