తను ఎవరో… ఎక్కడివాడో తెలియదు… సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కనిపించింది, ఏదో షార్ట్ న్యూస్ షేర్ చేస్తూ… విషయం ఏమిటంటే..? హైదరాబాదులోని తెల్లాపూర్‌లో కిరణ్ అనే ఒక యువ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు…
తను ఓ సూసైడ్ నోట్ కూడా రాశాడు… అందులో ‘‘నా చిన్నప్పటి నుంచీ కష్టాలే, నచ్చిన చదువు చదవలేదు, నచ్చిన బట్టలు కాదు, నచ్చిన తిండి తినలేదు… కనీసం నచ్చిన జాబ్ కూడా లేదు… నాకు ఎవరి నుంచీ సపోర్ట్ లేదు, ఒక్కడినే ఇలా ఉండలేకపోతున్నారు, గుడ్ బై’… ఇదీ తను ఇంగ్లిషులో రాసిన నోట్‌కు రఫ్ తెలుగు అనువాదం…
Ads
బతకడానికి ఓ సాఫ్ట్‌వేర్ జాబ్ ఉంది… జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు, ఆత్మహత్య చేసుకోవడానికి నీకేం రోగంర భయ్ అని కామెంట్స్ చేసేవాళ్లు బోలెడు మంది… అసలు ఉద్యోగం సద్యోగం లేక నానా కష్టాలూ పడుతున్న యువతీయువకులు కోకొల్లలు… కొలువులు ఊడి జీవితంతో పోరాడుతున్నవారూ బోలెడు మంది… మరి నిక్షేపంగా ఓ కొలువు ఉన్నవాడు ఇలా సూసైడ్ చేసుకోవడం ఏమిటి..? ఇదే కదా మీ ప్రశ్న కూడా…
నిజమే, ఆత్మహత్య మహా పాపం… అది పిరికివాడు చేసే పని… కానీ కారణాల విశ్లేషణ మాత్రం తప్పనిసరి… సొసైటీ సీరియస్‌గా గమనించడం లేదు గానీ… సొసైటీలో ‘ఒంటరితనం’ అనే వ్యాధి విస్తరిస్తోంది… ఇది అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య విపత్తు… అన్నీ బాగానే ఉంటాయి గానీ… నా అనేవాళ్లు ఉండరు, కృత్రిమ స్నేహాలు, ప్లాస్టిక్ అభిమానాలు… ఎవడి జీవితం వాడితే, ఎవడి స్వార్థం వాడిదే… ఈ వ్యాధి పీడితుడు కూడా ఎన్నిసార్లు ఒంటరిగా కూర్చుని ఏడ్చి ఉంటాడో… ఆ పెయిన్ మనం విశ్లేషించి, ఓ ఆరోగ్య సూత్రంలో ఇరికించలేం…
ఒకప్పుడు స్నేహం కోసం ప్రాణాలిచ్చే తరం ఉండేదట… బంధుమిత్రగణమే బలగంగా వెంట నిలిచేవట… ఇప్పుడు కుటుంబ సభ్యులే పరాయివాళ్లుగా మెలుగుతున్నారు… మానవసంబంధాలే మృగ్యమవుతున్నాయి… నిష్కల్మషమైన ‘అభిమానం’ ఇప్పుడు కరువు… సున్నిత మనస్కులకు దుర్భరం… అవసరాల్ని బట్టే స్నేహాలు, వీడు పనికిరాడు, వట్టిపోయాడు అనుకున్న మరుక్షణమే సంబధాలు కట్… మాట్లాడేవాడే దొరకడు… ఇక రా‘బంధువుల’ గురించి చెప్పనక్కర్లేదు కదా…
సమూహంలో ఒంటరివాడికి ఏమీ కాదు… టైమ్లీ అటాచ్డ్… ఒంటరితనాన్ని ఎంజాయ్ చేసేవాడికీ ఏమీ కాదు, వాడు డిటాచ్డ్… ఎటొచ్చీ అటూఇటూ గాని వాడికే ఈ ప్రాబ్లం… ఏ సమస్య వచ్చినా నేనున్నాను అనే ఒక్క తోడు లేకపోతే అది దుర్భరమే… కనీసం కలిసి ఎంజాయ్ చేయడానికైనా ఓ సర్కిల్ లేనివాడి బతుకు మరీ దుర్భరం… ఇక్కడ డబ్బు కాదు సమస్య… సొసైటీతో సంబంధాలు సరిగ్గా లేకపోవడం…
ఏమో, సైకియాట్రిస్టులు చెప్పాలి… ఇలాంటి ఒంటరితనమే క్రమేపీ సూసైడ్ టెండెన్సీకి దారితీస్తుందేమో… మరి వేగంగా వ్యాపిస్తున్న ఈ వ్యాధికి, ఈ విపత్తుకు నివారణో, పరిష్కారమో ఏముంది..? సొసైటీయే ఇప్పుడు పొల్యూటెడ్… అందుకే అనేవాళ్లు పెద్దలు… వచ్చేదేదో రానియ్, జరిగేదేదో జరగనియ్… అన్నింటినీ ఆహ్వానిద్దాం, భరిద్దాం… ఆఫ్టరాల్… happening is life… ఆ కర్మ సిద్ధాంతం బుర్రల్లోకి ఇంకకపోతే ఇదుగో ఇవే అనర్థాలు…!! ఓ తెలుగు పాట గుర్తొస్తోంది… ఈ అనంత కాలగమనంలో ఈ రవ్వంత జీవన పయనంలో… అందరు నీవారూ… చివరికి మిగిలేదెవరూ లేరు… అంతే… అంతే…
Share this Article