అవి తెలంగాణా స్వరాష్ట్రంగా ఏర్పడిన తొలినాళ్లు! నన్ను దేశరాజధాని ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాదుకు బదిలీ చేసిన రోజులు! సచివాలయంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వ కార్యకలాపాల బాధ్యతలు అప్పగించిన తరుణం! 2014 సాధారణ ఎన్నికల్లో ఉద్యమ సారథి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ విజయ దుంధుభి మోగించి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన సమయం!
సీఎం కేసీఆర్ కూడా సచివాలయానికి రావడం మొదలైన సందర్భం! ఆరోజు ఆయన సెక్రటేరియట్ వచ్చి అప్పుడే వెళ్ళిపోయారు! సరిగ్గా, సాయంత్రం అంటే అసుర సంధ్యవేళ కావస్తోంది! మేం కొంత మంది జర్నలిస్టులం అక్కడే సీబ్లాక్ ముందు డీజోన్ ఇనుపకంచె ఇవతలి వైపు నిలబడి ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నాం! ఇంతలో ఒక చిన్న అలెర్ట్!
ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ 6 వ అంతస్తు నుంచి దిగి కారెక్కి వెళ్లిపోవడానికి వస్తుందని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ [ఎస్పీఎఫ్] సిబ్బంది ద్వారా తెలిసింది! కొంత, లోలెవెల్ వాయిస్ లో మా నవ్వుల కోలాహలం కొనసాగుతూనే ఉంది! ఇంతలో తనను తాను అతిలోక సుందరిగా భావించుకునే ఆవిడగారు కిందకు రానే వచ్చారు! మేం అందరం కూడా సైలెంట్ అయ్యాం!
Ads
కారెక్కి వెళ్లి పోవాల్సిన మేఢం గారు, ఉన్నట్టుండి ఆగిపోయారు! ఏంటీ ఈమె కారు లోపల అడుగు పెట్టేదల్లా వెనకడుగు వేసిందని మేం అనుకుంటున్న లోపే విసురుగా వెనక్కి తిరిగింది! కాస్త ముందుకు వంగి, అనుమానంగా ముక్కుపుటాలు అదిలిస్తూ, దోషుల్లా మా వంక చూస్తూ, డిడ్ ఎనీ బడీ డ్రింక్ లిక్కర్ హియర్!? అని అడిగింది.
నిజానికి అక్కడున్న మేం ఎవరమూ డ్రింక్ చేయం! అనూహ్యంగా ఎదురైన ఆ ప్రశ్నతో షాకై ఉలిక్కిపడ్డ మేం విస్మయంగా ఆమె వైపు చూస్తూ అలాంటిది ఏమీ లేదంటూ ఆమె నిరాధార ఆరోపణను తోసిపుచ్చాం! నో నో ఇట్ స్మెల్స్ లైక్ దట్ అని దబాయిస్తూ, మళ్లీ ఒకసారి దురుసుగా చూసింది! దీంతో బిత్తరపోవడం మా వంతైంది! అలాంటిదేమీ లేదని మేమంతా గట్టిగా ఖండించడంతో కారెక్కి వెళ్లిపోయింది!
ఇదీ ఆమె ప్రవర్తన! అక్కడ ఉన్నది అందరూ ప్రొఫెషనల్స్, పైగా ఆ సమయం కూడా అలాంటి అనుమానాలకు తావిచ్చేది కాదు కూడా! నేను చెప్పేది ఏమిటంటే, జర్నలిస్టులపై ఆమెకు ముందే ఒక అభిప్రాయం ఉందని! అందుకే, మాపట్ల ఆరోజు అంత చులకనగా వ్యవహరించి ఉంటుందని! ఇక, డిసేబుల్డ్ గురించి ఆమె అలా వ్యాఖ్యానించడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదని! బట్, నో డౌట్! ఆ వ్యాఖ్యలు అబ్సర్డ్ అండ్ హైలీ ఆబ్జెక్షనెబుల్! ……
( ఇది మిత్రుడు, సీనియర్ పాత్రికేయుడు, ఎంతోకాలంగా ఎందరో ఉన్నతాధికారులను, నాయకులను దగ్గర నుంచి గమనించిన సూరజ్ వి. భరద్వాజ్ రాసిన స్వీయానుభవం… స్మిత సభర్వాల్ వికలాంగ రిజర్వేషన్లపై చేసిన పెడసరం వ్యాఖ్యాల మీద దుమారం రేగుతోంది కదా… ఆమె మనస్తత్వాన్ని, రాణిరికాన్ని పట్టిచ్చే ఓ చిన్న ఉదాహరణ అన్నమాట ఇది…)
Share this Article