ఇన్ని పొలిటికల్ బురద వార్తల నడుమ నిన్ను ఆకర్షించిన ఒక్క వేరే వార్త చెప్పు అనడిగాడు ఓ మిత్రుడు… మరోసారి గుర్తుచేసుకుంటే చటుక్కున మెదిలిన వార్త… ఒక చైనా జాతీయుడిని ఇండియన్ నేవీ సాహసోపేతంగా రక్షించిన వార్త… రియల్లీ గ్రేట్, ఎందుకంటే..?
సరే, అది యుద్దనౌక కాదు, తను సైనికుడూ కాదు… ఒక రవాణా నౌకలో హఠాత్తుగా అనారోగ్యం పాలైన లేదా తీవ్రంగా గాయపడిన ఓ నావికుడు… ఆ నౌక సిబ్బందిలో ఒకడు… అక్కడున్న ప్రాథమిక చికిత్స సదుపాయాలు పనిచేయలేదు… ముంబైకి దాదాపు 350 కిలోమీటర్ల దూరంలో నౌక…
Ads
The Maritime Rescue Co-ordination Centre (MRCC) కి ఓ కాల్ వచ్చింది… SOS కాల్ వంటిదే, అత్యవసర వైద్యసాయం కావాలి అని… ఇది ముంబైలో ఉంటుంది… 51 ఏళ్ల ఓ వ్యక్తికి తీవ్రంగా రక్తస్రావం… ప్రాణాపాయ స్థితి అనేది సందేశం… క్షణం కూడా తటపటాయింపు లేదు… వెంటనే Indian Naval Air Station INS Shikra నుంచి ఓ ఛాపర్ ఎగిరింది… కానీ..?
తీవ్రంగా గాలులు… డెక్ స్టేబుల్‌గా లేదు… ప్రతికూల వాతావరణంలోనూ మన స్టాఫ్ ఆ చైనా జాతీయుడిని ఎయిర్ లిఫ్ట్ చేసి, హాస్పిటల్‌కు తరలించింది… మన వాళ్లకు ఇది చిన్న విషయమే కావచ్చుగాక… ఇదేకాదు, ఈమధ్యే బోలెడుసార్లు ఎక్కడెక్కడో దూరంగా నౌకలు హైజాక్ అయితే, పైరేట్ల ధాటికి గురైతే మనమే వెళ్లి రక్షించాం… అది ఎవరి నౌక అని చూడలేదు… ఆపదలో ఉన్నట్టు ఓ కాల్ వస్తే చాలు, మన నేవీ అక్కడికి చేరుతుంది…
అది మన సత్తాకు పరీక్ష మాత్రమే కాదు… మన తత్వానికి ప్రతీక… అంతేకాదు, అంతర్జాతీయ జలాల్లో మన బలమైన ఉనికిని చాటుకోవడం… ఏమో, దొంగతనంగా మన సముద్ర జలాల్లోకి వచ్చేవి, అంతర్జాతీయ సముద్రజలాల్లోకి జొరబడే శతృ దేశ నౌకలో, జలాంతర్గాములో అయితే మన స్పందన ఎలా ఉండేదో గానీ… ఐనా ఆదుకోవాలనే కాల్ వస్తే ఆదుకుంటామేమో… యుద్ధంలో దీటుగా ఎదుర్కొందాం, ఆపదలో మనిషిగా సహకరిద్దాం అనే ధోరణి… కానీ ఒక పాకిస్థాన్ లేదా ఒక చైనా ఇంత ఉదారంగా వ్యవహరించగలవా అనే ఓ భావన మదిలో…
ఆమధ్య మన యుద్ధనౌకల్లో ప్రమాదాల వార్తలు వచ్చేవి… ఏదో కుట్ర నిరంతరమూ మన నేవీలో సాగుతూనే ఉంటుంది… మొన్నామధ్య కూడా ఏదో యుద్ధనౌకలో ప్రమాదం… ఏవో కోవర్టు ఆపరేషన్స్ కావచ్చు… ఐనా మనవాళ్ల నైతికస్థయిర్యం వీసమెత్తు దెబ్బ తినలేదు… ఏ ఛాలెంజ్‌కైనా రెడీ అన్నట్టుగా సన్నద్ధతను ప్రదర్శించడం ఆ వార్త స్థూల సారాంశం… అందుకే ఆ వార్త నచ్చింది…!!
Share this Article