పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవిరియా… నిన్న చంద్రబాబు జగన్‌ను ఈ అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ ఉన్మాది, ఉగ్రవాదితో పోల్చాడు… ‘డబ్బు మీద పిచ్చి, దానికి ఏమైనా చేస్తారు… అలాంటివాళ్లు రాజకీయాల్లో ఉండటం మరీ డేంజర్…’ అని సదరు డ్రగ్స్ ఉగ్రవాది గురించీ కొన్ని వివరాలు చెబుతూ పోయాడు…
సరే, ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని అలాంటి అత్యంత విషమయ నేరగాడితో పోల్చడంలో ఔచిత్యం జోలికి ఇక్కడ పోవడం లేదు గానీ… ఇంతకీ ఎవరు ఈ ఎస్కోబార్..? అదీ ఆసక్తికరం… ప్రపంచం ఇలాంటి అత్యంత ధనిక, క్రూర నేరగాడిని ఇక చూడదేమో… అలాంటి చరిత్ర తనది… అనేక పుస్తకాలు, సినిమాలు, టీవీ కార్యక్రమాలు తన జీవితం మీద…
ఒక దశలో ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికుల్లో ఒకడు… ఓ చిన్న విషయం చెబితే అర్థమవుతుంది… తన కొకైన్ స్మగ్లింగ్ పీక్స్‌లో ఉన్న ఓ దశలో… తనకు రోజూ వచ్చి పడే డబ్బును కట్టలు కట్టేందుకు రబ్బర్ బాండ్లు కొంటారు కదా, వాటికి వారానికి వెయ్యి డాలర్లు ఖర్చయ్యేది…
Ads
సొమ్ము మొత్తం గోడౌన్లలో దాచేవాళ్లు… అందులో ఏడాదికి పది శాతం ఎలుకలు కొరికేయడం వల్ల పాడైపోయేది… అప్పట్లో మంచు విష్ణు హీరోగా చేసిన ఢీ అనే సినిమా గుర్తుంది కదా… అందులో డబ్బు లెక్కపెట్టడానికి శ్రీహరి ప్రత్యేకంగా మనుషుల్ని నియమించుకుంటాడు… ఓ ఆఫీసు… అలాంటిదే, దానికి వంద రెట్లు పెద్ద ఆఫీసు ఉంటే..? ఎస్కోబార్ డబ్బు లెక్కింపు వ్యవస్థ అలా ఉండేది…
1989లో ఫోర్బ్స్ మ్యాగజైన్ 227 అత్యంత ప్రపంచ సంపన్నుల్లో ఒకడిగా పరిగణించింది తనను… అప్పట్లో ప్రపంచ కొకైన్ మార్కెట్‌లో 80 శాతం తనదే… ఏటా 30 బిలియన్ డాలర్ల ఆదాయం ఉండేది ఒక దశలో… తన నేరజీవితం ఎలా మొదలైందో తెలుసా..? జస్ట్, సమాధుల మీద విలువైన రాళ్లను దొంగిలించి, కొత్త సమాధుల కోసం అమ్మే పనితో…
తరువాత నకిలీ బ్రాండ్ల సిగరెట్లు అమ్మేవాడు, ఫేక్ లాటరీ టికెట్లు అమ్మేవాడు… తరువాత వాహనాల దొంగతనాలు, ఫేక్ డిప్లొమా సర్టిఫికెట్లు తయారు చేసేవాడు… ఓసారి ఓ కిడ్నాప్ చేసి భారీగా డబ్బు సంపాదించి, ఇక డబ్బు రుచి మరిగాడు… ఎప్పుడైతే కొకైన్ సరఫరా వ్యవస్థలో భాగమయ్యాడో… దాన్ని భారీగా విస్తరించడానికి స్పేస్ ఉందని గ్రహించి, మెల్లిగా 1975లో సొంత స్మగ్లింగ్ వ్యవస్థను నిర్మించుకున్నాడు… తను పెరిగిన కొలంబియాలోని మెడెలిన్ పేరు మీద మెడెలిన్ కార్టెల్ అని పేరు పెట్టాడు తన డ్రగ్స్ వ్యవస్థకు…
అది ఎంతగా విస్తరించిందీ అంటే… ఒక దశలో నెలనెలా 70 నుంచి 80 టన్నుల కొకైన్‌ను కొలంబియా నుంచి అమెరికాకు పంపిణీ చేసేవాడు… కిలోమీటర్ల విస్తీర్ణం ఉండే ఓ భూమిని కొనుగోలు చేసి, అత్యంత విలాసవంతమైన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు… పెద్ద పెద్ద భవనాలు, గోదాములు, స్విమ్మింగ్ పూల్స్, జూ, పెద్ద క్లబ్ హౌజ్, తోటలు… కేవలం డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం విమానాలు, ఛాపర్లు కొన్నాడు…
నౌకల్లోనే కాదు, కొన్నిసార్లు జలాంతర్గాములను కూడా స్మగ్గింగుకు వాడేవాడు… డబ్బు విసిరితే లొంగని న్యాయమూర్తుల్ని, పోలీసుల్ని, అధికారుల్ని చంపించేవాడు… ప్రత్యేకంగా ఓ దీవిని కొని దాన్ని పూర్తిగా డ్రగ్స్ హబ్‌గా మార్చాడు… అక్కడ ఎయిర్‌స్ట్రిప్, ఓడరేవు, హోటల్, ఇళ్ళు, బోట్లు, విమానం వంటివన్నీ… కొకైన్ భద్రపరచడానికి శీతల గోడౌను కూడా… ఈ స్మగ్లింగ్ దందాలో, పోటీదారుల నడుమ గ్యాంగ్ వార్స్ ఉండేవి… ఏటా కొన్ని వేల హత్యలు… అక్షరాలా కొన్ని వేలు… తరువాత రాజకీయాల్లో చేరాడు… ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యుడయ్యాడు…
రాబిన్ హుడ్ తరహాలో చాలా డబ్బును పేదలకు ఇళ్లు కట్టించడానికి, ఫుట్‌బాల్ గ్రౌండ్స్‌కు ఖర్చు పెట్టేవాడు… వేలాది మందికి తను హీరో… కానీ ఎప్పుడైతే అమెరికన్ ప్రత్యేక యాంటీ డ్రగ్స్ టీమ్స్ వేటాడటం మొదలు పెట్టిందో, తనే శిక్ష వేయించుకుని, ఓ సువిశాలమైన, అత్యంత విలాసవంతమైన సొంత జైలు లా కాటెడ్రల్ పేరిట కట్టుకుని, అందులో ‘శిక్ష అనుభవించేలా’ తీర్పు చెప్పించుకున్నాడు… అక్కడి నుంచే డ్రగ్ రాకెట్ నడిచేది… తరువాత అమెరికా మరింత వేట ఉధృతి పెంచింది…
చివరకు ప్రత్యేక బృందాల వేట ఫలించింది.., టెక్నాలజీ సాయంతో తన ఉనికిని కనిపెట్టారు… తను చేయించిన హత్యలు, దాడుల బాధితులందరూ ఓ సంఘంగా ఏర్పడి యాంటీ డ్రగ్స్ టీమ్స్‌కు సమాచారం ఇచ్చేవాళ్లు… ఇళ్ల పైకప్పుల మీదుగా పారిపోతూ ఉంటే స్పెషల్ టీమ్స్ కాల్పులు జరిపాయి… ఒక తూటా చెవి నుంచి మెదడులోకి దూరి ప్రాణం తీసింది… కాదు, తప్పించుకోలేని స్థితిలో తనే ఆత్మహత్య చేసుకున్నాడనే వాదనా ఉంది… మరణించేనాటికి తన వయస్సు 44 ఏళ్లు మాత్రమే… ఇదీ ఎస్కోబార్ చరిత్ర..!!
Share this Article