ఒక హీరోయిన్ మందార పువ్వు టీ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతూ ఒక పోస్ట్ పెడితే, ఒక డాక్టర్ ఆ వ్యాఖ్యపై నెగటివ్ గా స్పందించిన వార్త ఒకటి వచ్చింది.
అది పక్కన పెడితే మందార శాస్త్రీయ నామం: హైబిస్కస్ రోజా సైనెన్సిస్. మందారలో ఔషధాలకి ఉపయోగపడే ఎన్నోరకాల బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉండటం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న మాట వాస్తవం. మందార పువ్వులో ఫైటో కెమికల్స్ ఉంటాయి. డైరక్ట్ గా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచవు కానీ ఇన్సులిన్ నిరోధకతని తగ్గిస్తుంది అంటే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తే ఆటోమ్యాటిక్ గా ఇన్సులిన్ ఉత్పత్తికి మార్గం సులువు అవుతుంది. ఫైటో కెమికల్స్ ఒక్కటే కాదు, ఫాలీ ఫినోల్స్ కూడా ఉంటాయి మందార పువ్వు లో, అందుకే రక్తపోటుని తగ్గిస్తుంది.
అయితే, మందారలో అల్యూమినియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా తీసుకుంటే అది నిక్షేపం అయి కొన్ని దుష్పలితాలు కూడా ఉంటై. ఉదాహరణకి గర్భధారణ సమయంలో ఎక్కువ అల్యూమినియం మంచిది కాదు. ఇంకా కొందరికి అలర్జీ రావొచ్చు. గుండె సంబంధిత వ్యాధులు పెరగవచ్చు తక్కువ రక్తపోటు ఉంటే.., అందుకే ఏదీ గుడ్డిగా చేయకూడదు.
Ads
అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీ వాళ్ళు రీసర్చ్ చేసి పబ్లిష్ చేసిన ఆర్టికల్ వివరాల ప్రకారం వాళ్ళ మాటల్లో… “మందారం తరచుగా రక్తంలో గ్లూకోజ్, మొత్తం కొలెస్ట్రాల్, అధిక-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, రక్తపోటు, బరువు, లిపిడ్ శోషణ మరియు ఉదర కుహరం చుట్టూ ఉన్న ముఖ్యమైన అవయవాలలో కొవ్వు ఆమ్లాల ఆక్సీకరణను మెరుగుపరుస్తుంది.
అధిక మోతాదు కొన్ని సందర్భాల్లో ఎక్కువ ప్రయోజనాలకు దారితీసింది, ముఖ్యంగా జంతువుల శరీర ద్రవ్యరాశికి, కానీ తక్కువ మోతాదు తరచుగా సమానంగా ప్రభావవంతంగా ఉంటుంది. జీవక్రియ సిండ్రోమ్ యొక్క కొన్ని బయోమార్కర్లను, ముఖ్యంగా రక్తంలో గ్లూకోజ్ మరియు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో మందారం తరచుగా మందుల కంటే సమానంగా లేదా ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది”
శాస్త్రీయ అధ్యయనం ప్రకారం ఊబకాయాన్ని తగ్గిస్తుంది, యాంటీ డయాబిటెక్ గా పని చేస్తుంది, కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.. ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్న మాట వాస్తవం ( ఏప్రిల్ 24, 2021 వ సంవత్సరం ప్రచురించబడిన అధ్యయన ఆర్టికల్ “జర్నల్ ఆఫ్ ఇథనో ఫార్మకాలజీలో A review of the effectiveness of hibiscus for treatment of metabolic syndrome ప్రచురించబడింది)
ప్రతి విషయంలో శాస్త్రీయ దృష్టికోణం అనేది చాలా అవసరం. ఇలాంటి విషయాల్లో శాస్త్రీయ ఆధారాలతో కూడిన చర్చలు జరపాలి, శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం చాలా ముఖ్యం. ఆరోగ్య సంబంధిత విషయాలలో శాస్త్రీయ ఆధారాలు చాలా ముఖ్యమని అందరూ గుర్తించడం అవసరం. ఎవరు ఏమి చెప్పినా దానికి శాస్త్రీయత ఉందా లేదా చూడాలి.
ఏ విషయంలో ఖండించినా అది ప్రామాణికంగా ఉండాలి. సరైన వివరాలు, ఆధారాలు చెప్పకుండా నెగటివ్ గా కామెంట్ చేయడం కూడా సరికాదు. కామెంట్ చేసేటప్పుడు ఆ కామెంట్ కు సంబంధించిన వివరాలు, శాస్త్రీయ కారణాలు కూడా వివరించాలి కదా, ఆ డాక్టర్. అది చేయలేదు. ఏది ఏమైనా శాస్త్రీయ దృక్పథం కలిగిన ఆయుర్వేదం యొక్క అవసరం మన దేశంలో ఉంది. [ జగన్నాథ్ గౌడ్ ]
Share this Article