పవన్ కల్యాణ్‌కు తీవ్ర ఘోర అవమానం అని ఏదేదో రాస్తున్నారు గానీ…. మోడీ ప్రభువుల వారి కరుణా వీక్షణాలు సోకి బాగా ఆనందపడిపోతున్న వారి గురించి ఎవరూ మాట్లాడరేమిటి అసలు..? మోడీ చక్రవర్తి గారి చల్లని చూపులకు నోచుకున్న వారి మనోభావాలకు అర్థం, విలువ ఏమీ లేవా అసలు..? ఉదాహరణకు అద్వాణీనే చూడండి… ఫాఫం, పార్టీ భవనానికి పునాదుల్ని తవ్వడం దగ్గర్నుంచి పెయింటింగ్ పని దాకా చేశాడు… తీరా ఇప్పుడు ఏం జరిగింది..? ఏమీ గాకుండా అయిపోయాడు… మోడీని చాలామంది తిట్టిపోశారు.., ఇదేం మర్యాదోయ్, రేపు నీకూ తప్పదు సుమా అని కూడా అన్నారు… విన్నాడా, లేదు… మహా స్థితప్రజ్ఞుడు… అంతటి కఠినాత్ముడు సైతం కరిగిపోయాడు ఈమధ్య… మారిపోయాడు… ఉదారవాది అయిపోయాడు… అద్వాణీని 75వ స్వాతంత్య్ర దినోత్సవాల జాతీయ కమిటీలో సభ్యుడిని చేశాడు… అంతటి ఉక్కుమనిషి అద్వాణీ ఈ మలిసంధ్యవేళ మోడీ గారి ఔదార్యం చల్లదనం తాలూకు షాక్ తట్టుకోలేక ఇంకా తేరుకున్నట్టు లేదు…
సరే, మాజీ రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కొందరు కేంద్ర మంత్రులు, ఇంకొందరు పౌరసమాజ ప్రముఖులు గట్రా ఎలాగూ కమిటీలో వేయకతప్పదు… కానీ రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థి సోనియా గాంధీని కూడా కమిటీలో వేశాడు మోడీ… ఎహె, మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అని ఈసడించుకోలేదు… మోడీ పేరెత్తితేనే అగ్గి ఫైరయిపోయే సీతారాం ఏచూరిని కూడా గౌరవించాడు మోడీ… అదండీ రాజకీయ మర్యాద… మోడీ మారిపోయాడు అంటే ఇంకా నమ్మరేం..? ఆమె కూడా అద్వాణీ రేంజ్ షాక్‌లోనే ఉంది ఇంకా…! ఫాఫం, వాళ్లెంతలే గానీ… అంతటి చంద్రబాబును కూడా క్షమించేశాడు మోడీ… మొన్నటి ఎన్నికలకు ముందు కత్తులు పట్టుకుని మోడీ అంతు చూస్తానని తిరిగాడు కదా… మంచీమర్యాద తప్పి కూడా తూలనాడాడు కదా… అలాంటి చంద్రబాబును సైతం క్షమించేసి కమిటీలో వేశాడు… చంద్రబాబుకు ఎంత గౌరవం..? అంతా మోడీ వారి ఉదార హృదయం… మారిన మనిషి…
Ads
మా చంద్రబాబును దూరం పెడతావా..? మా ఓం సిటీకి సపోర్ట్ చేయవా అని మహా కోపమ్మీద ఉన్న రామోజీరావును కూడా ఆదరంగా ఈ కమిటీలో వేశాడు మోడీ… చంద్రబాబు గ్రాఫిక్ డిజైనర్ రాజమౌళిని, రామోజీరావు బంధువు టీకా మందుల ఎల్లా కృష్ణను కూడా ఆదరించాడు చూశారా..? తెల్లారిలేస్తే తన ఆర్థిక విధానాలను ఆడిపోసుకునే అమర్త్యసేనుడినీ గౌరవించాడు… ఇవేమైనా పద్మ పురస్కారాలా..? నామినేటెడ్ పదవులా..? అంత పెద్ద సీన్ ఏముందీ అంటారా..? నో, నో, అలా తేలికగా తీసిపడేయొద్దు… అంత సీన్ లేకపోవచ్చుగాక, కానీ నాకు వ్యక్తుల మీద కోపాలు ఉండవు అని మోడీ ప్రభువుల వారు చూపిస్తున్న సీన్ ఇది… ఎంతటి విశాల హృదయుడు..? అందరూ అపార్థం చేసుకుంటారు గానీ, చూశారు కదా… తనకు పడనివారిని, తనంటే పడనివారిని కూడా ఎలా అలుముకుని ఆత్మీయత కురిపిస్తాడో…!!
Share this Article