ఒక మిత్రుడు చెప్పాడు… ‘బంగారు గుడ్లు పెట్టే బాతును చంపుకోవద్దని అల్లు శిరీష్ చెప్పాడు బాగానే ఉంది… మిగతా హీరోలు టికెట్ల ధరలు పెంచి, విడుదలైన ఒకటీరెండు రోజుల్లోనే కుమ్ముకోవాలని చూస్తుంటే, తను మాత్రం తన తాజా సినిమా బడ్డీ టికెట్ల ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా తగ్గింపచేశాడు… నిజానికి తన తండ్రి, ఇండస్ట్రీని శాసించే అల్లు అరవింద్ పక్కా వ్యాపార సూత్రాలకు ఇది విరుద్ధమే…
ఐనా సరే, శిరీష్ ఆ నిర్ణయం తీసుకునేలా చేశాడంటే… తన సినిమా ఔట్ పుట్ మీద తనకే పెద్దగా నమ్మకం కుదరలేదేమో… టికెట్ల ధరల తగ్గింపు వోకే గానీ, కంటెంట్ కూడా ప్రేక్షకుల్ని థియేటర్ దాకా రప్పించేలా ఉండాలి కదా… సరుకు బాగుంటేనే కదా ఎవడైనా టికెట్ కొనేది…’’ ఇదీ తన మాటల సారాంశం… నిజం… శిరీషా, నువ్వు టికెట్ల ధరలపై చెప్పిన మాటలు నిజమే కానీ సినిమాలో దమ్ము లేదు… అదీ నిజమే…
అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లను చూస్తే ఎప్పుడూ ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు గుర్తొస్తారు అదేమిటో… ఇద్దరి కుటుంబ నేపథ్యం ఒకటే… అత్యంత బలమైన మెగా కంపౌండ్… ప్రత్యేకించి అల్లు అరవింద్ మంచి సినిమా వ్యాపారి… కానీ అర్జున్ ఓ పాన్ ఇండియా స్టార్‌గా ఎక్కడికో వెళ్లిపోయాడు… కానీ శిరీష్ ఎక్కడావాడు అక్కడే ఉండిపోయాడు… 11 ఏళ్ల కెరీర్… జస్ట్, 7 సినిమాలు… ఇదీ నా సినిమా అని ఒక్కటీ చెప్పుకోలేని దురవస్థ…
Ads
నిజమే, తను భిన్న కథాంశాలను ఎంచుకుంటాడు… మాస్ మసాలా రొటీన్ ఇమేజీలకు భిన్నంగా ట్రై చేస్తున్నాడు గానీ కుదరడం లేదు… ఏదీ క్లిక్ కావడం లేదు… జస్ట్, లైక్ అనిల్ అంబానీ… పోనీ, అల్లు అరవింద్ ఏమైనా తనను ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడా అంటే అదీ పెద్దగా కనిపించదు… ఇప్పుడు బడ్డీ సినిమా తీశాడు… బాగా ఆశలు పెట్టుకున్నాడు…
గతంలో తమిళంలో వచ్చిన టెడ్డీకి ఇది రీమేక్ కాదు అని పదే పదే చెప్పుకోవడానికి ప్రయత్నించాడు గానీ… ఆ టెడ్డీ ఓసారి చూసి ఉండాల్సింది… జస్ట్, టెడ్డీ బేర్‌లోకి ఆత్మ రావడం అనే పాయింట్ తప్ప మిగతా మొత్తం కథంతా డిఫరెంట్ అని చెప్పాడు… కానీ కథలో అదే మెయిన్ పాయింట్ కదా… ఇక కొత్తగా ప్రేక్షకుడికి థ్రిల్ ఏముంది..? పైగా ఆ టెడ్డీ తమిళ సినిమా తెలుగులోకి కూడా డబ్బయింది… మరెందుకు ఈ కథకు వోకే చెప్పినట్టు..?
ఇప్పుడు మార్కెట్‌లో కల్కి తప్ప వేరే పెద్ద సినిమాల్లేవు, అదీ పాతబడింది… ఈ స్థితిలో శిరీష్ సినిమాకు ప్లస్ కావాలి… కానీ ఆ దర్శకుడు ఏమాత్రం ఆసక్తి రేకెత్తించకుండా, చాలా జాగ్రత్తగా సినిమాను తీశాడు… ఒక్కటంటే ఒక్క సీన్ పేలలేదు… నిజానికి టెడ్డీ బేర్‌లోకి ఆత్మ (మనిషి బతికి ఉండగానే ఆత్మ బయటికి వస్తుందా..? గతంలోనూ ఏదో సినిమాలో చూసినట్టు గుర్తు…) రావడమనేదే పెద్దగా మెప్పించని కథాప్రయోగం… పోనీ, దాన్నయినా బలంగా ప్రజెంట్ చేశాడా అంటే అదీ లేదు…
కామెడీ పేలలేదు, సంగీతం సోసో, యాక్షన్ సీన్స్ అసలే శిరీష్‌కు నప్పవు… హీరోయిన్ అందంగా ఉంది తప్ప పాత్రకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు… టెడ్డీ కథకన్నా భిన్నంగా ఇందులో అవయవాల వ్యాపార ముఠా అరాచకాల్ని తీసుకున్నారు, కథను హాంకాంగ్ దాకా తీసుకుపోయారు గానీ అంత థ్రిల్ ఏమీ అనిపించదు… కీలకమైన క్లైమాక్స్ కూడా అంతే… ప్చ్, శిరీష్, మళ్లీ నిరాశే… బాగాలేదు సినిమా, నిజంగానే..! నువ్వు టికెట్ల ధరలు తగ్గింపచేశావు కానీ ఆ క్యాంటీన్, ఆ పార్కింగ్ దందాల్ని ఏమీ చేయలేవుగా..!
Share this Article