Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

క్రికెట్ గ్లోరీ షాట్స్‌.. మ్యాచ్ తీరును, ఫలితాన్నే మార్చేస్తాయి!

August 3, 2024 by M S R

శ్రీలంక-ఇండియా మధ్య శుక్రవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌ టైగా ముగిసింది. 14 బంతుల్లో సింగిల్ రన్ తీయాల్సిన సమయంలో శివమ్ దూబే సరైన ఫుట్ వర్క్ లేక.. గ్లోరీ షాట్‌కు ప్రయత్నించి ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక ఆఖరి వికెట్ మిగిలింది. బ్యాటింగ్‌కు వచ్చే ముందు అర్షదీప్ సింగ్‌‌కు కెప్టెన్ రోహితో, కోచ్ గంభీరో.. మరొకరో.. క్రీజులోనే ఉండి సింగిల్ తీసుకో అని చెప్పే ఉంటారు. కానీ ఆఖరి రన్ గ్లోరీ షాట్ కొట్టి హీరో అవ్వాలని భావించాడు. సింగిల్ బదులు సిక్స్‌తో ఎండ్ చేయాలనుకున్నాడు. గెలవాల్సిన మ్యాచ్ చివరకు టై అయ్యింది.

ఒక గ్లోరీ షాట్.. ప్రపంచ కప్‌ను దూరం చేసింది..
17 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికా వేదికగా తొలి టీ20 వరల్డ్ కప్ జరిగింది. ధోనీ కెప్టెన్‌గా తొలి సారి పగ్గాలు అందుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా సఫారీల గడ్డపై అడుగు పెట్టిన భారత జట్టు చరిత్ర సృష్టించింది. లీగ్ దశలో పాకిస్తాన్‌పై బౌల్ అవుట్‌లో గెలిచిన ఇండియా.. ఫైనల్‌లో ఓటమి నుంచి బయటపడి తొలి టీ20 వరల్డ్ కప్‌ను అందుకున్నది.

భారత్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ ఒక వైపు వికెట్లు కోల్పోతున్నా.. రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నది. తర్వాత కాలంలో జట్టు కెప్టెన్‌గా మారిన మిస్బా ఉల్ హక్ క్రీజులో ఉన్నాడు. ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు కావాలి. మిస్బా ఫామ్ చూస్తే కొట్టేసే లాగే కనపడ్డాడు. మరోవైపు ధోనీ ఎవరికి బౌలింగ్ ఇస్తాడా అని అందరూ ఎదురు చూశారు.

Ads

అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ మాత్రం అనుభవం లేని.. ఆ మ్యాచ్‌కు ముందు కేవలం మూడే టీ20లు ఆడిన జోగీందర్ సింగ్‌కు బంతి అందించాడు. స్టేడియంలో, టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులకు అసలు ఏమీ అర్థం కాలేదు. యూసుఫ్ పఠాన్, హర్బజన్ సింగ్‌లకు ఓవర్లు మిగిలి ఉన్నాయి. అయినా సరే అనుభవం లేని జోగీందర్ చేతికి ధోనీ బంతిని ఇవ్వడంతో ఆశ్చర్యపోయారు.

కాసేపు జోగీందర్‌తో ఏదో మాట్లాడిన తర్వాత ఫీల్డ్ సెట్ చేశాడు ధోనీ. ఫస్ట్ బాల్ వైడ్ వేశాడు. తర్వాత బంతి డాట్. ఆ తర్వాత బంతికి మిస్బా సిక్స్ బాదాడు. అంతే భారత అభిమానులు సైలెంట్ అయ్యారు. చివరి నాలుగు బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే కావాలి. ధోనీ మరోసారి ఫీల్డ్ సెట్ చేశాడు. మిస్బా గ్రౌండ్ అంతా ఒక సారి చూసుకున్నాడు. జోగీందర్ బంతి విసిరాడు.. సిక్స్‌తో మ్యాచ్ ముగించాలని మిస్బా ఉల్ హక్ షార్ట్ ఫైన్‌లెగ్ మీదుగా స్కూప్ షాట్ ఆడాడు.

మిస్బా షాట్‌ను కరెక్ట్‌గా ఆడకపోవడంతో గాల్లోకి లేచింది. ఫైన్‌లెగ్‌లో ఉన్న శ్రీశాంత్ ఎలాంటి మిస్టేక్ చేయకుండా బంతిని అందుకున్నాడు. భారత జట్టు 5 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలిచి ప్రపంచ విజేతగా నిలిచింది. ఆ రోజు మిస్బా కనుక గ్లోరీ షాట్ కోసం ప్రయత్నించకుండా రెండు, మూడు పరుగులు చేసుంటే.. చరిత్ర మరోలా ఉండేది. ఆ ఒక్క బంతితో జోగీందర్ సింగ్ భారత ప్రేక్షకులను సుపరిచితుడు అయ్యాడు. అదే ఊపులో క్రికెట్ కెరీర్ కొనసాగించి ఉంటే మరి కొన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగేవాడేమో.! కానీ అదే అతని ఆఖరి అంతర్జాతీయ టీ20 అయ్యింది.

వివాదాల పోలీస్..
టీమ్ ఇండియా తరపున కేవలం నాలుగు టీ20, నాలుగు వన్డే మ్యాచ్‌లు ఆడాడు జోగీందర్ శర్మ. ఫైనల్‌లో వేసిన ఓవర్‌తో ఇంప్రెస్ అయిన ధోనీ అతడికి సీఎస్కే జట్టులో స్థానం కల్పించాడు. కానీ ఎక్కువ మ్యాచ్‌లు మాత్రం ఆడలేదు. అయితే స్పోర్ట్స్ కోటాలో 2007లోనే హర్యానా ప్రభుత్వం అతనికి పోలీస్ ఉద్యోగం ఇచ్చింది. డీఎస్పీగా అతను గ్రూప్-1 ర్యాంకులో ఉద్యోగం ప్రారంభించి.. ఇప్పటికీ అదే ర్యాంకులో కొనసాగుతున్నాడు.

ఫ్యామిలీ కోసమే క్రికెట్ కంటే ఉద్యోగానికి ప్రాధాన్యత ఇచ్చాడు. డీఎస్పీగా ఉద్యోగం చేస్తూనే.. అడపా దడపా లీగ్ క్రికెట్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతూ వచ్చాడు. చివరకు 2023లో ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్ట్ అయ్యాడు. అప్పటికే అతను బ్యాట్ పట్టక ఆరేళ్లు గడిచిపోవడం గమనార్హం.

జోగీందర్ శర్మ పోలీసుగా పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఉద్యోగ బాధ్యతల్లో చాలా దురుసుగా వ్యవహరిస్తాడనే పేరుంది. ఈ ఏడాది జనవరిలో ఒక దళిత యువకుడి ఆత్మహత్యలో జోగీందర్ ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. ఒక ఆస్తి వివాదంలో సదరు యువకుడిపై ఒత్తిడి తీసుకొని రావడంతో జోగీందర్ సహా మరో ఐదుగురిపై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

గతంలో ప్రమోషన్ల విషయంలో కూడా హర్యానా ప్రభుత్వంతో వివాదం ఉన్నది. 2021లో నాన్-క్యాడర్ ఐపీఎస్ ప్రమోషన్లలో తనకు చోటు కల్పించలేదని కోర్టుకు వెళ్లాడు. తనకు అన్ని అర్హతలు ఉన్నా.. లిస్టులో పేరు చేర్చలేదని ప్రభుత్వంతో పేచీ పెట్టుకున్నాడు. అది కూడా ఇంకా పరిష్కారం కాలేదు. అయితే ఈ వివాదంలో హర్యానా-పంజాబ్ హైకోర్టు అప్పటి బీజేపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

12 ఏళ్ల తర్వాత..
సీఎస్కేతో అనుబంధం తెగిన తర్వాత జోగీందర్ శర్మ తన కెప్టెన్ ధోనీని ఇంత వరకు కలవలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టీవ్‌గా ఉండే జోగీందర్.. క్రికెట్ వ్యవహారాలకు చాలా దూరంగానే ఉన్నాడు. నిన్న (ఆగస్టు 2) మాజీ కెప్టెన్ ధోనీతో కలిసి దిగిన ఫొటోను జోగీందర్ పోస్టు చేశాడు. 12 ఏళ్ల తర్వాత ధోనీని కలిశానంటూ రాసుకొచ్చాడు. కింద ఉన్న ఫొటో అదే… #భాయ్‌జాన్   John Kora

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 55 ఏళ్ల క్రితం గల్లంతు..! ఆ అణు పరికరం కథ తెలిస్తే నేటికీ వణుకే..!!
  • నందమూరి దిష్టి తమన్… తెలియకపోతే అన్నీ మూసుకోవాలి బ్రదర్..!!
  • మూడు తెలుగు సినిమా పాటలు- ఒక నోస్టాల్జియా… అజరామరం…
  • నకిలీలకే ‘మెరుపు’లెక్కువ..! ముగ్గురు గరల్‌ ఫ్రెండ్స్, గర్భాలు..!!
  • తెలంగాణ గ్రామీణ వోటరు ఏం చెబుతున్నాడు..? ఇదీ క్లారిటీ..!!
  • హీరో మెటీరియలే..! కానీ ‘ఆది’ నుంచీ ‘డ్రైవ్’ కుదరడం లేదు పాపం…
  • మసక మసక చీకటిలో… మళ్లీ ఆనాటి స్మిత నయగారాలు, నయా రాగాలు…
  • బాలకృష్ణ అఖండ తాండవాలకు బీజం పడింది ఈ సినిమాతోనే..!!
  • మెస్సి టూర్ – నిజమైన సార్ధకత ఎక్కడుంది..? | Khelo India రియాలిటీ చెక్…
  • తగ్గొద్దు… రేవంతన్నా… ఏదేమైనా కానీ… ఈ స్పీడ్ ఆగొద్దు….

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions