ఓ మిత్రుడు తన పదిహేను రోజుల నార్త్ స్పిరిట్యుయల్ టూర్ విశేషాలు చెబుతూ… కాశి, ఉజ్జయిని, అయోధ్య, ప్రయాగ, గయ, బృందావనం తదితర ప్లేసుల గురించి వివరిస్తున్నాడు… అయోధ్య, బృందావనం కట్టడాలు భక్తికే గాకుండా ఆ ఆర్కిటెక్చర్, ఆ వాతావరణం పర్యాటకులకు అబ్బురం…
మరి కాశి, ప్రయాగ, గయ..? దర్శనాలకే కాదు… నదీస్నానాలకు, అంతకుమించి పితృకర్మలకు ప్రాముఖ్యం… తమ పూర్వీకులకు అక్కడే పిండతర్పణం చేసిరావడానికి భక్తజనం ప్రాధాన్యమిస్తారు… హిందూ మతస్తులకు ఇవి పితృకర్మల కోణంలో ముఖ్య సందర్శనీయ స్థలాలు… ఇవన్నీ వింటుంటే… ఈనాడులో వచ్చిన ఓ ఫోటో, దాని రైటప్ గుర్తొచ్చింది…
కొచ్చిన్‌లోని ఓ గుడి దగ్గర జనం సామూహికంగా పిండతర్పణం చేస్తున్న ఫోటో… జస్ట్, ఒక్క ఫోటో పెట్టేసి వదిలేసి అన్యాయం చేశారు గానీ… ఆ ఉత్సవం లేదా ఆ కార్యక్రమం గురించి సంక్షిప్త వివరణైనా ఉండాల్సింది… సరే, మిగతా దిక్కుమాలిన పత్రికలతో పోలిస్తే నయమే… ఆ సామూహిక కార్యక్రమం పేరు కర్కిడక వావు… లేదా వావు బాలి…
Ads
ఇది మనకు కేరళలో కనిపిస్తుంది ప్రధానంగా… మలయాళం వాళ్ల కేలండర్‌లోని కర్కిడక మాసం అమావాస్యను అందరూ పితృకర్మల దినంగా పరిగణిస్తారు… (కర్కిడక వావు అంటే కర్కిడక మాసపు అమావాస్య అని…) ఏదైనా గుడి, నది, సముద్రం, ఇతర చిన్న ప్రవాహాల వద్దకు వెళ్లి జనం తమ పూర్వీకులకు పిండతర్పణం చేయడమే ఈ కార్యక్రమాల ఉద్దేశం…
అన్నిచోట్లా ఒకేతీరులో పిండప్రదానాలు ఉండాలని ఏమీ లేదు… కానీ చాలాచోట్ల అరిటాకుల్లో, లేదా స్థానికంగా దొరికే పెద్ద ఆకుల్లో పిండాలు చేసి పెట్టేస్తారు… కొందరు కేవలం బియ్యాన్ని, కొందరు అన్నంగా వండి, కొందరు ముద్దలుగా చేసిన వరిపిండి, చిన్న దీపం, గరికపోచలు, పూలు, నువ్వులు పెడతారు… కర్మల్లో నువ్వులే ప్రధానం కదా…
ఎవరి పంతుళ్లు చెప్పిన రీతిలో వాళ్లు తర్పణం అర్పిస్తారు… తద్వారా తమ పూర్వీకుల ఆత్మలు శాంతించి, పుణ్యగతులు పొందుతారని హిందూ మతకర్మలు చెప్పే సారాంశం… తెలుగు రాష్ట్రాల్లో కూడా పితృ అమావాస్య రోజును పాటిస్తారు… కానీ కేరళలోలాగా వేలాదిగా జనం ఒకేచోట ఒకే సమయంలో ఇలా ఓ సామూహిక కార్యక్రమంగా చేయడం ఉండదు… ఏ కుటుంబానికి ఆ కుటుంబం విడిగానే తమకు వీలున్నచోట కర్మ తంతును ఆచరిస్తారు…
మచ్చుకు పైన ఫోటో చూస్తే అర్థమవుతుంది కదా మలయాళీ హిందువులు ఈ రోజుకు ఎంత ప్రాధాన్యమిస్తారో… ప్రయాగరాజ్ వంటి క్షేత్రాల్లో పితృపక్షం అని పాటిస్తారు… ఎక్కడెక్కడి నుంచో వెళ్లిన ప్రజలు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు… అఫ్‌కోర్స్, ఇప్పుడు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని, డబ్బు కడితే మనం ఎవరి పేర్ల మీద తర్పణాలు విడవాలో చెబితే పంతుళ్లే అవి నిర్వహించే సదుపాయాలు (అదొక ఆధ్యాత్మిక మత వ్యాపారం) కూడా అందుబాటులోకి వచ్చాయి… ప్రస్తుత తరం ఈ కర్మకాండల్ని పెద్దగా నమ్మే కాలం కాదు ఇది… వీలు గాకపోవచ్చు లేదా నమ్మకాలు లేకపోవచ్చు… అలాంటప్పుడు మనం ముందే డబ్బు పే చేస్తే ప్రతి ఏటా నిర్దిష్ట దినాన మనం చెప్పిన పేర్లలో కర్మకాండలు నిర్వహించే వెసులబాట్లు కూడా వచ్చాయట కొన్నిచోట్ల..!!
Share this Article