ఆహా ఓటీటీలో ఓ కొత్త ధోరణి… ప్రతి ప్రోగ్రామ్‌కు ఓ కేరక్టర్ ఉంటుంది… ఉండాలి… దానికి ప్రేక్షకులు అలవాటు పడతారు, దాన్ని బ్రేక్ చేయొద్దు, చేస్తే ఓ రకమైన చిరాకు పుడుతుంది ప్రేక్షకుడికి… అప్పట్లో అన్‌స్టాపబుల్ అని బాలయ్యతో ఓ ప్రోగ్రామ్ చేశారు, సూపర్ హిట్… కానీ సీజన్‌కూ సీజన్‌కూ మధ్యలో అనుకుంటా, ఏదో తన సినిమాకు ప్రమోషన్ అవసరపడింది…
ఇంకేముంది..? తెర మీదకు వచ్చేసి ఒకటో రెండోె ఎపిసోడ్లు ప్రమోషన్ కోసం లాగించేసి వదిలేశాడు, ఇప్పటికీ మళ్లీ ఆ ప్రోగ్రాం తదుపరి సీజన్ జాడ లేదు… అసలు ఇక ఉంటుందో లేదో తెలియదు… తను రాడు, వేరే ఎవరినీ వీళ్లు తీసుకోలేరు… సర్కార్ షో అని సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్నాడు… గతంలో ప్రదీప్ చేసేవాడు… అదీ సూపర్ హిట్…
కానీ మధ్యలో ఆపేసి… బాగా ట్రెండింగ్‌లో ఉంది అంటూ సక్సెస్ పార్టీ పేరిట రెండు ఎపిసోడ్లు లాగించారు… అప్పటివరకూ పార్టిసిపేట్ చేసినవాళ్లనే మళ్లీ పిలిచి, మూడు గ్రూపులు చేసి, మళ్లీ అదే ఆట ఆడించాడు సుధీర్… సరే, బాగానే ఉంది కానీ ఆ టెంపో పోతుంది… అది గుర్తించినట్టు లేదు ఆహా క్రియేటివ్ టీం… ఐనా వాళ్లకు తోచింది చేసుకుంటూ పోవడమే కదా, ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ అస్సలు పట్టించుకోరు…
Ads
ఆహాలో మరో సూపర్ హిట్ సో తెలుగు ఇండియన్ ఐడల్… మస్తు ఖర్చు పెడుతున్నారు, దాదాపు ఒక సినిమాకు అయ్యేంత ఖర్చు… గత రెండు సీజన్లలో లేనట్టుగా… ఈసారి హఠాత్తుగా ఓ సగటు దిక్కుమాలిన టీవీ ప్రోగ్రామ్ తరహాలో… ఉన్న కంటెస్టెంట్లను మూడు గ్రూపులు చేసి, ముగ్గురు జడ్జిలను లీడర్లుగా చేసి… వాళ్ల నడుమ పోటీ పెట్టారు…
వాళ్లు మెరిట్ ఉన్నవాళ్లే..,. బాగానే పాడారు… ఎటొచ్చీ ఆ గ్రూపుల పోటీ అబ్సర్డ్… సీరియస్‌నెస్ పోయింది… మరో రెండు ఎపిసోడ్లు ఇలా లాగుతారన్నమాట… దీనికితోడు సినిమా ప్రమోషన్ల జాఢ్యం దీనికి కూడా పాకింది… అవును మరి, డబ్బులు వస్తాయంటే ఎవరికి చేదు… అందరూ లలితా జుయెలర్స్ గుండు బాసులే కదా…
మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్ కోసం దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె వచ్చారు… అఫ్‌కోర్స్ ఆమె ఓ అట్రాక్షన్ అక్కడ… చూశారా, నేను ఈ ఇండియన్ ఐడల్ షోకు ఎంత ప్రాధాన్యమిస్తున్నానో అని చెబుతూ… తన చివరి పాటను ఇక్కడ రివీల్ చేశాడు… అంటే, పల్లవిని అదే గాయకుడు శ్రీరామచంద్రతో పాడించాడు అక్కడే… పాట బాగున్నట్టు లేదు కానీ ట్యూన్, బీట్ బాగున్నాయి… ఇదంతా చూస్తూ ఆ ముగ్గురు జడ్జిలు పెద్ద ఇంప్రెస్ అయినట్టు మాత్రం కనిపించలేదు…
దొరికింది కదా చాన్స్ అనుకుని శ్రీరామచంద్ర కూడా భాగ్యశ్రీని వేదిక మీదకు పిలుచుకుని, రవితేజకు బాస్ తరహాలో స్టెప్పులు వేశాడు… చూడటానికి ఇదంతా ఎంటర్‌టెయిన్‌మెంటే… అదే ఈ షోల పరమార్థం అనుకుంటే తప్పు లేదు… కానీ ఇంత ఖర్చు పెట్టి, చివరకు ఓ సగటు టీవీ షోలాగా మార్చేశారనేదే అసంతృప్తి…!!
Share this Article