Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిరాడంబరుడు… నిజాయితీపరుడు… గుణధనికుడు… బుద్ధదేవుడు…

August 8, 2024 by M S R

‘కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే అమరవీరుల స్తూపానికి ఎర్ర రంగు వేస్తారా,’ అని సీపీఎం చివరి సీఎం బుద్ధదేవ్‌ను ఎత్తిపొడిచిన సత్యజిత్‌ రే!

………………………………..
పశ్చిమ బెంగాల్‌ రెండో మార్క్సిస్టు ముఖ్యమంత్రి, రాష్ట్ర రెండో బ్రాహ్మణ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య 80 ఏళ్ల వయసులో గురువారం కన్నుమూయడం దేశంలో కమ్యూనిస్టు సానుభూతిపరులకు పెద్ద విషాదం. నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరైన కామ్రేడ్‌ బుద్ధదేవ్‌ బెంగాల్‌లో కమ్యూనిస్టు పాలనకు తన అనాలోచిత పాలనా విధానాలతో పాతరేశాడనే చెడ్డ పేరుతో మనకు కనుమరుగవ్వడం కూడా ఎంతో బాధాకర వాస్తవం.

దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ పుట్టుకకు ఐదు నెలల ముందు అంటే 1944 మార్చి ఒకటిన ఉత్తర కలకత్తాలోని సాంప్రదాయ బెంగాలీ హిందూ పురోహితులు, సంస్కత పండితులు, హిందూ ధర్మ ప్రచారకర్తలు (ప్రచురణకర్తలు) కుటుంబంలో పుట్టిన బుద్ధదేవుడు తర్వాత నాస్తికుడుగా, మార్క్సిస్టుగా పరివర్తన చెంది తన 22వ ఏట కమ్యూనిస్టు పార్టీలో చేరడం ఆయన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది.

Ads

ప్రసిద్ధ కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో బీఏ బెంగాలీ సాహిత్యం చదివిన బుద్ధ దాకు సినిమాలు, సాహిత్యం సహా కళలంటే అమితాసక్తి. ఆయన గురువుగా పరిగణించే జ్యోతిబసు వృద్ధాప్యం కారణంగా ఆయన వారసుడిగా 2000 నవంబర్‌ 6న సీపీఎం నేతృత్వంలోని వామపక్ష ఫ్రంట్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బుద్ధదేవ్‌ 11 సంవత్సరాలు పదవిలో కొనసాగారు. కళలపై ఆసక్తితో ఆయన హైదరాబాద్‌ రవీంద్ర భారతి మాదిరి కళా కేంద్రం ‘నందన్‌’ను ఏర్పాటు చేశారు.

23 ఏళ్లకు పైగా సాగిన జ్యోతిబసు ‘మార్క్సిస్టు పాలన’లో కుంటుపడిన పారిశ్రామికాభివృద్ధిని తన హయాంలో ముందుకు తీసుకుపోవాలనే తొందరలో బుద్ధదేవ్‌ దా తీసుకున్న నిర్ణయాలు, పారిశ్రామిక విధానాలు కమ్యూనిస్టుల కొంప ముంచాయి. జ్యోతిబసు పాలనలో కలకత్తా వీధుల్లో ‘ కమ్యూనిస్టు కార్యకర్తలు ‘ తన తల పగలగొట్టినా గాని ముఖ్యమంత్రి పీఠంపై గురి మరల్చకుండా పోరాడుతున్న ‘ బెంగాలీ బెబ్బులి ‘, బ్రాహ్మణ నేత మమతా బంధోపాధ్యాయకు బుద్ధదేవ్‌ ‘పారిశ్రామిక విధానం’ ఎంతగానో ఉపయోగపడింది.

బెంగాల్‌కు మమత మూడో బ్రాహ్మణ ముఖ్యమంత్రి కావడానికి కమ్యూనిస్టులకు తగని ‘ బుద్ధుడి ’ పోకడలు పారాషూట్‌లా పనిచేశాయి. అజయ్‌ కుమార్‌ ముఖర్జీ అనే మాజీ కాంగ్రెస్‌ నేత తన పార్టీ నుంచి బయటికొచ్చి కమ్యూనిస్టులతో చేతులు కలిపి 1967లో బెంగాల్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ సీఎం అయ్యారు. ఇలా ఆయనే తొలి బెంగాల్‌ బ్రాహ్మణ ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు.

ఒకే ఒక బిడ్డ తర్వాత కొడుకై కూర్చుంది!
…………………………………………..
తెల్ల ధోవతీ, కుర్తాతో ఎల్లప్పుడూ కనిపించే బుద్ధదేవ్‌ చెయిన్‌ స్మోకర్‌. ఆయన తాత (నాన్న తండ్రి) కృష్ణచంద్ర స్మృతితీర్థ సంస్కృత పండితుడు, రచయితేగాక పూజారులు, పురోహితుల కోసం ‘ పురోహిత దర్ఫణం’ అనే గ్రంథం రాశారు. ఇప్పటికీ బెంగాలీ బ్రాహ్మణ పురోహితులకు ఈ పుస్తకం దిక్సూచి వంటిది. అలాంటి కుటుంబ మూలాలున్న బుద్ధదేవ్‌ ఎంతటి నిరాడంబర కమ్యూనిస్టు అంటే నాలుగు దశాబ్దాలపాటు బాలిగంజ్‌లోని సాధారణ 2 రూమ్‌ అపార్ట్‌మెంట్‌లోనే (మన భాషలో రెండు పడకగదుల ఫ్లాట్‌) జీవించారు.

గత ఐదేళ్లుగా అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన ఆయనను మరో ఇంటికి మారాలని వైద్యులు సలహా ఇచ్చినా ఆయన ఆ ఇంట్లోనే కొనసాగారు. ఆయన ఏకైక బిడ్డ సుచేతన ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదువుకుంది. బుద్ధదేవ్‌ ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తర్వాత అంటే ఆరేళ్ల పాలన తర్వాత జరిగిన పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె తండ్రికి ఒక సలహా ఇచ్చింది.

‘‘ ఈ ఎన్నికల ప్రచారంలో మీరు తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకురాలు మమతా బెనర్జీ పేరు అసలు ఎత్తకుండా ఎక్కడైనా ఏమైనా మాట్లాడండి,’ అని తన ఏకైక బిడ్డ సుచేతన కోరిందని 2006 ఎన్నికల్లో తన పార్టీ సీపీఎంను (176 సీట్లు) మంచి మెజారిటీతో గెలిపించాక బుద్ధదేవ్‌ మీడియాకు చెప్పారు. అయితే, బుద్ధదేవ్‌ కొన్నేళ్ల క్రితం మంచాన పడినాక కూతురు సుచేతన తన మానసిక, శారీరక స్థితిలో వచ్చిన మార్పును వెల్లడించి యువకుడిగా మారారు. అప్పటికే రాజకీయ కార్యకలాపాలకు దూరమైన బుద్ధదేవ్‌ పేరు పత్రికల్లో కూతురు కొడుకుగా మారిన సందర్భంగా మార్మోగింది.

భారతదేశంలో తొలి కమ్యూనిస్టు సీఎంగా ప్రసిద్ధికెక్కిన (కేరళకు చెందిన సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన) ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ తర్వాత రెండు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన ఐదుగురు కమ్యూనిస్టు నేతలు ముఖ్యమంత్రులయ్యారు ( సీపీఐకి చెందిన సీ అచ్యుత మీనన్, పీకే వాసుదేవన్‌ నాయర్, సీపీఎంకు చెందిన ఈకే నాయనార్, వీఎస్‌ అచ్యుతానందన్, పినరయి విజయన్‌). వారిలో బ్రాహ్మణులెవరూ లేకున్నా కేరళ రాజకీయ, సాంస్కృతిక విశిష్ఠత కారణంగా కమ్యూనిస్టు పార్టీలు ఇంకా సజీవంగా, సుచైతన్యంతో కొనసాగుతున్నాయి.

కాని. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం సాంప్రదాయ పౌరోహిత కుటుంబంలో పుట్టిన బుద్ధదేవ్‌ తర్వాత (2011 అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టుల ఘోర పరాజయం తర్వాత వరుసగా 2016, 2021లో ఓటములే) కమ్యూనిస్టు పార్టీలు ‘పత్తా లేకుండా పోవడం’ ఆయన స్మృతికి అవమానకర అంశం.

అంతేగాక, కమ్యూనిస్టుల బద్ధశత్రువైన హిందుత్వ బీజేపీ శరవేంగంతో బలపడి కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ స్థానంలో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందడానికి కూడా బుద్ధదేవ్‌ పాపాలే కారణమని నిందించేవారున్నారు. ఏదేమైనా జ్యోతిబసు 23 సంవత్సరాల పాలనకు, తన 11 ఏళ్ల పరిపాలనను జత చేసి బెంగాల్‌లో కమ్యూనిస్టుల ఉనికి లేకుండా చేశారనే చెడ్డపేరు మాత్రం బుద్ధదేవుడు మూటగట్టుకు పోవడం చరిత్ర మరవలేని విషాదం.

‘అధికారంలోకి వస్తే మార్క్సిస్టులు షహీద్‌ మీనార్‌కు సైతం ఎర్ర రంగేస్తారా, ఛీ: రే
…………………………………………
బుద్ధదేవ్‌ జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని గురువారం కలకత్తాకు చెందిన ఆంగ్ల దినపత్రిక టెలిగ్రాఫ్‌ తన న్యూజ్‌ వెబ్‌సైట్‌లో ప్రకటించింది. 1977 జూన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి సీపీఎం సొంతంగా మెజారిటీ సాధించడంతోపాటు తన సీనియర్‌ నేత జ్యోతిబసును ముఖ్యమంత్రి పీఠం ఎక్కనిచ్చింది. ఈ ఎన్నికల్లోనే 35 ఏళ్ల బుద్ధదేవ్‌ తొలిసారి కలకత్తా నగరంలోని కాశీపుర్‌–బెల్గాచియా నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

సీపీఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే తనకిష్టమైన ప్రపంచ ప్రఖ్యాత సినీ దర్శకుడు సత్యజిత్‌ రే ఇంటికి (బిషప్‌ లెఫ్రాయ్‌ రోడ్‌లోని అపార్ట్‌మెంట్‌)కు బుద్ధదేవ్‌ వెళ్లారు. ఎప్పటి మాదిరిగానే తలుపు తెరిచిన సత్యజిత్‌ రాయ్‌ వెంటనే ‘‘ షహీద్‌ మీనార్‌ స్మారక స్తూపం పై భాగానికి మీరు ఎర్ర రంగు వేశారు, ఛీ,’’ అంటూ బుద్ధదేవ్‌ను ఎత్తిపొడిచారు.

తర్వాత అక్కడి నుంచి బయటికొచ్చాక బుద్ధదేవ్‌ తన పార్టీ ముఖ్యమంత్రికి సత్యజిత్‌ రే మాటలు చెప్పి మళ్లీ స్తూపానికి తెల్ల రంగు వేయించారు. మరి, పశ్చిమ బెంగాల్‌ అధికార పీఠం ఇటుక రంగు రైటర్స్‌ బిల్డింగ్‌లో మార్క్సిస్టులు ఎప్పటికైనా పాలకపక్షంగా అడుగుబెడతారని నమ్మేవారు హైదరాబాద్‌లోనూ ఉన్నారు……. [ మెరుగుమాల నాంచారయ్య ] 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
  • డిస్టర్బింగ్ సీసీటీవీ ఫుటేజీ… కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు కూడా…
  • ‘‘నీ ఏడుపేదో నువ్వేడువు… నాకన్నా ఎక్కువ ఏడువు… నేనేమైనా వద్దన్నానా..?’’
  • అమ్మతనం అంటే అన్నీ సహించడం కాదు… కొన్ని వదిలించుకోవడం కూడా..!!
  • ఆ ఉగ్రవాది కసబ్‌ను కోర్టులో గుర్తించిన ఓ చిన్న పాప మీకు గుర్తుందా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions