100 గ్రాముల బరువు తగ్గించుకోలేక… వినేశ్ ఫోగట్ అనర్హతకు గురైంది… ఒలింపిక్స్‌లో రూల్ అంటే రూలే… జస్ట్, 100 గ్రాముల అధిక బరువుకు అంత శిక్షా అని యావత్ దేశం, ఇతర దేశాల క్రీడాకారులు సైతం ఆశ్చర్యాన్ని, ఆమె పట్ల సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు… కానీ ఓ ఉదాహరణ… ఈమె 2016లోనూ అనర్హతకు గురైంది, ఆమెకు రూల్స్ అన్నీ తెలుసు… ఇదే ఒలింపిక్స్‌లో ఓ ఇటాలియన్ క్రీడాకారిణి కూడా బరువు తగ్గించుకోలేక అనర్హతకు గురైంది… సరే, వినేశ్ ఫోగట్ కేసు ఇప్పుడు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్‌లో విచారణలో ఉంది, ఫలితం వేచి చూడాలి… తనకు కనీసం ఉమ్మడి రజతం ఇవ్వాలనేది ఆమె కోరిక…
తక్కువ బరువు కేటగిరీల్లో పోటీలుపడటం, ఇదుగో చివరలో ఇలా తంటాలు పడటం… మరో నిఖార్సయిన ఉదాహరణ చదివి తీరాలి… రేయ్ హిగుచి అని జపాన్ రెజ్లర్… ఈ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన రేయ్ హిగుచి… వినేశ్ ఫోగట్‌ను ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టి, నీ బాధను నాకన్నా ఇంకెవరూ బాగా అర్థం చేసుకోలేరేమో అన్నాడు… తను 2016 రియో ఒలింపిక్స్‌లో రజత విజేత… కానీ తమ సొంత గడ్డ, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో జస్ట్, 50 గ్రాముల అధిక బరువుతో అనర్హతకు గురయ్యాడు… అవును, జస్ట్ చటాక్ అధిక బరువు… 2018లో మన మేరీ చాన్ 4 గంటల వ్యవధిలో రెండు కిలోల బరువు తగ్గింది అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి..!!
Ads
సరే, మరో ప్రబలమైన ఉదాహరణ చెప్పుకుందాం… మన వాడే… మొన్న కాంస్యం కూడా గెలిచాడు… అవును, మన అమన్ సెహ్రావత్… సెమీ ఫైనల్స్‌లో పైన చెప్పిన రేయ్ హిగుచి మీద ఓడిపోయాడు… తరువాత చూస్తే 61.5 కిలోల బరువున్నాడు… కానీ కాంస్యం పోరులో నిలబడాలంటే, కలబడాలంటే తను ఖచ్చితంగా 4.5 కిలోగ్రాములు తగ్గాల్సిందే… అవును, తను 57 కిలోల కేటగిరీలో పోటీపడుతున్నాడు కాబట్టి… ఆ బరువుకన్నా ఎక్కువ ఉండకూడదు కాబట్టి…
కానీ తను బరువు తూచుకున్న క్షణం నుంచి బరిలో దిగాల్సిన టైమ్‌కు తనకు మిగిలింది పది గంటలు… ఆ 10 గంటల్లో 4.5 కిలోలు తగ్గాలి, ఎలా..? సరిగ్గా 57 కిలోలు కాదు, ఓ 100 గ్రాములు తక్కువుంటేనే మంచిది… ఏ స్కేల్ ఎంత బరువు చూపిస్తుందో మరి..? తన కోచులు జగ్‌మందర్ సింగ్, వీరేందర్ దహియా దీన్ని ఓ చాలెంజులా స్వీకరించారు… ఏ 100 గ్రాములు వినేశ్ ఫోగట్‌కు విషాదం చూపించిందో, అదే 100 గ్రాములు తక్కువగా ఉండేలా ప్రయాసపడిన అమన్ కథ ఇది…
వెంటనే రంగంలోకి దిగారు కోచ్, క్రీడాకారుడు… ఓ గంట సేపు వేడి నీళ్ల స్నానం… 12.30 గంటలకు జిమ్‌లోకి ఎంట్రీ… ట్రెడ్‌మిల్ మీద గంటసేపు ఆగకుండా పరుగు… చెమటలు కారిపోతూనే ఉన్నాయి… పర్లేదు, ఎంత చెమట కారిపోతే అంత బరువు తగ్గిపోతాయి… అదేదో సినిమాలో పాటలాగా… ఒకటే గమనం, ఒకటే పయనం అన్నట్టుగా… పరుగు, పరుగు…
ఓ అరగంట బ్రేక్… తరువాత అయిదేసి నిమిషాల చొప్పున అయిదు సార్లు ఆవిరి స్నానం… తప్పదు మరి… జుత్తు కత్తిరించుకోవడం, డ్రెస్ కట్ చేసుకోవడం, సూదులు పొడిచి రక్తం తీసేయడం కాదు… మొత్తం ఆర్గానిక్ మెథడ్… ఇదంతా అయిపోయింది, ఐనా ఇంకా 900 గ్రాములు అధికంగా చూపిస్తున్నాడు… మసాజ్ చేశారు, చలో జాగింగ్ అన్నారు… ఇది పావుగంట చొప్పున అయిదు సెషన్స్… ఉదయం 4.30 గంటలు… సరిగ్గా 56.9 కిలోలకు వచ్చింది బరువు, అంటే అవసరమైన బరువుకన్నా 100 గ్రాములు తక్కువ…
గుడ్, కాసేపు రిలాక్స్… ఈ మొత్తం సమయంలో తనకు గోరువెచ్చని నిమ్మ నీళ్లు ఇచ్చారు, కొంచెం కాఫీ… ఇచ్చీఇవ్వనట్టుగా… నో నిద్ర… రాత్రంతా పాత రెజిలింగ్ వీడియోలు చూస్తూ గడిపాడు… ప్రతి గంటకూ బరువు తూచడం… అవసరమైన మేరకు బరువు తగ్గడం అనేది మాకు తెలిసిన విద్యే, కానీ టెన్షన్ ఉంటుంది అంటున్నాడు కోచ్ దహియా… పైగా వినేశ్ ఫోగట్ అనుభవం కలవరపెడుతూ ఉంది… చివరకు కాంస్యం పోటీలో ప్రత్యర్థి మీద గెలిచి ఇండియా యంగెస్ట్ మెడలిస్ట్ అయ్యాడు… జెండా ఎత్తి పట్టుకుని మురిసిపోయాడు…!! (ఎన్డీటీవీ కథనం)
Share this Article