Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సంక్షోభంలోకి ప్రపంచ రాజకీయాలు… ఆ వ్యూహాల్లో బంగ్లాదేశ్ ఓ పావు…

August 12, 2024 by M S R

షేక్ హసీనాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో అల్లర్లను ప్రేరేపించింది ఎవరు..? ఆమె దేశం వదిలిపెట్టి పారిపోయే రేంజులో, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చిన స్థాయిలో మూకల స్వైరవిహారం… వందల మంది మరణాలు, విధ్వంసాలు, పనిలోపనిగా మతోన్మాదులు కూడా చెలరేగి హిందూ సమూహాలపై దాడులు… సర్వత్రా అరాచకం…  జైళ్ల నుంచి ఖైదీలు పారిపోవడం, హసీనా ప్రత్యర్థి ఖలీదా జియా విడుదలైపోవడం, సైన్యం రంగప్రవేశం… చివరకు ఓ నోబెల్ విజేత యూనుస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఎంపిక కావడం చకచకా జరిగిపోయాయి…

మనకు ఇరుగూపొరుగూ పాకిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్… ఎక్కడైనా సరే తుపాకీదే రాజ్యం… బడితె ఉన్నవాడిదే బర్రె… షేక్ హసీనాకు అజ్ఞాతం, వలస నివాసం కొత్తేమీ కాదు, గతంలో కూడా భారతదేశమే ఆమెకు ఆశ్రయం ఇచ్చింది… ఇప్పుడు ఈ వయస్సులో, ఈ స్థితిలో ఎక్కడ ఉంటుందో తెలియదు… మళ్లీ రాజకీయ తెర మీదకు వస్తుంది అంటున్నాడు ఆమె కొడుకు… ఏమో, పరిస్థితులు సహకరిస్తాయా..? సందేహమే…

ఐతే ఈ అల్లర్లలో పెట్రోల్ పోసిందెవరు..? అమెరికాయేనా..? ఎందుకు..? ఈ ప్రశ్నే ఇప్పుడు చర్చనీయాంశం… ఒక దేశం మా దేశంలో ఎయిర్ బేస్ కట్టుకుంటాను అంటే నేను అనుమతించలేదు అని ఆమధ్య హసీనా ఎక్కడో ఆరోపించినట్టు గుర్తు… ఏ దేశం..? అమెరికా..? అదేనా..? ఎందుకు..? నిజానికి బంగ్లాదేశ్‌ను వ్యూహాత్మకంగా అమెరికా వాడుకునే అవకాశం ఉంది కాబట్టి, దానికి చాన్స్ లేకుండా ప్లస్ ఇండియా పక్కన కుంపటి పెట్టేలా చైనా ఏనాటి నుంచో బంగ్లాదేశ్ వ్యవహారాలపై ఆసక్తి చూపిస్తోంది…

Ads

కానీ హసీనా చైనా షరతులు, ఆంక్షలు, వ్యూహాలకు అడ్డు… చివరకు చైనా నుంచి రుణం తీసుకునే విషయంలో చైనా పెట్టిన షరతులకు అంగీకరించలేదు, ఫలితంగా ఆ ప్రయత్నాలు ఫెయిల్… మరోవైపు అమెరికాకు బంగ్లాదేశ్ సాయం కావాలి అంతర్జాతీయ రాజకీయ వ్యూహాల్లో,.. చైనాకు పొరుగున బంగ్లాదేశ్‌లో వీలయితే సైనిక స్థావరమే ఏర్పాటు చేసుకోవాలి… అదీ దాని ప్లాన్… అంతెందుకు..? వ్యూహాత్మక ద్వీపం సెయింట్ మార్టిన్‌ను ఇచ్చేయాలని చాన్నాళ్లుగా అడుగుతోంది… పైకి మాత్రం అబ్బే, అదేమీ లేదు అని బుకాయిస్తుంది…

3, 4 చదరపు కిలోమీటర్లు, 3 వేల లోపు జాలర్ల జనాభా మాత్రమే ఉన్న ఈ ఫిషింగ్ హబ్, ఈ పగడాల దీవి ఇప్పుడు వార్తల్లో ఉంది… అది కొనేస్తే, లేదా లీజుకు తీసుకుంటే చైనా సరిహద్దుల్లో ఓ కుంపటి పెట్టవచ్చునని అమెరికా ఎత్తుగడ… దీనికి చైనా కౌంటర్ ప్లాన్స్ వేస్తుంది ఎలాగూ… బంగాళాఖాతంలో ఈ అగ్రదేశాల వ్యూహాలు అంతిమంగా ఇండియాకు నష్టదాయకం… మయన్మార్ ఆర్మీ అణిచివేతతో దాదాపు 10 లక్షలమంది రోహింగ్యాలు దేశం వదిలేశారు… వారిలో ఆరేడు లక్షల మంది కాక్స్ బజార్ క్యాంపుల్లో ఉన్నారు…

వేలాది మంది ఎలాగోలా ఇండియాను కూడా చేరారు… మన హైదరాబాదులో సైతం ఉన్నారు… వాళ్లది ఓ అరాచకం… సరే, ఆ కాక్స్ బజార్ క్యాంపు ఈ సెయింట్ మార్టిన్ దీవికి దగ్గర… ఏ కోణం నుంచి చూసినా ఇప్పుడు అత్యంత సున్నితమైన ప్రాంతం ఈ సెయింట్ మార్టిన్ దీవి… తనపై జరిగిన కుట్రను, అమెరికా పాత్రను ఖుల్లంఖుల్లా జనానికి చెప్పేసి, ఆ తరువాతే దేశం విడిచిపెట్టి పోవాలని హసీనా అనుకుని, ఓ ప్రసంగం ప్రిపేర్ చేసుకుందట… అందులో ఏముందో తెలుసా అంటూ బంగ్లా మీడియా వార్తలు రాస్తోంది…

bangla crisis(సెయింట్ మార్టిన్ దీవి)

నో, నో, మా తల్లి ఆ స్పీచ్ రాసుకోలేదు, అసలు అంత చాన్స్, అంత టైమ్ కూడా ఆమెకు ఇవ్వలేదు అంటున్నాడు ఆమె కొడుకు… ఇవన్నీ నాన్సెన్స్ వార్తలు అంటూ అమెరికా ఖండిస్తోంది… కానీ కొన్ని నిజాలుంటయ్… అంతర్జాతీయ సముద్రాల్లో, అదీ అత్యంత ప్రాముఖ్యమున్న వాణిజ్య సముద్రమార్గాల్లో పెత్తనం కోసం చైనా మన దిగువన శ్రీలంకను, కాస్త దూరంలో ఉండే మాల్దీవులను ప్రలోభపెట్టి, చివరకు వాటిని భ్రష్టుపట్టించింది… అది అక్కడెక్కడో ఉండే జిబౌటీలో వేల ఎకరాల్ని లీజు తీసుకుని, అడ్డా వేసి… అక్కడి దాకా తన నేవీ ఆధిపత్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తోంది…

మారిపోతున్న అంతర్జాతీయ రాజకీయ స్థితిగతుల్లో తను ఏకైక అగ్రదేశం కావాలని చైనా ప్లాన్… జాగ్రత్తగా వ్యూహాలు అమలు చేస్తోంది… అది ఇండియాకే కాదు, అమెరికాకు కూడా ప్రమాదమే… ఐనా దానికి ఇంకా ఆ సోయి రాలేదు… అసలే పెరిస్ట్రోయికా తరువాత తీవ్రంగా దెబ్బతిని, ఈమధ్య ఉక్రెయిన్ యుద్ధంలో కూడా దెబ్బతిని రష్యా తనే ఓ అగ్రదేశంగా ఉండే సిట్యుయేషన్ లేదు… అది అటు చైనాతో, ఇటు ఇండియాతో టైమ్ బీయింగ్ వ్యూహాల్ని అమలు చేస్తోంది… ఈ స్థితిలో ఇండియా విదేశాంగ నీతి అత్యంత సంక్లిష్టంగా, సున్నితంగా మారిపోయింది…!! అన్నింటికీ మించి అటు నాటో వర్సెస్ రష్యా వయా ఉక్రెయిన్… ఇజ్రాయిల్ వర్సెస్ పాలస్తీనా వయా ఇరాన్, లెబనాన్… ఇప్పుడు బంగ్లాదేశ్… ప్రపంచం ఓ విషమ సంక్షోభంలోకి జారిపోతోంది..!!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అదే కథ, అదే పాత్ర… విజయచందర్ సూపర్ హిట్… నాగార్జున ఫ్లాప్…
  • కాళేశ్వరంపై బీఆర్ఎస్ క్యాంప్ ఆపసోపాలు… నానా విఫల సమర్థనలు…
  • కాంతారా బీజీఎం మోతల వెనుక ఈ ఆఫ్రికన్ గిరిజన వాయిద్యం..!
  • సింగరేణి మట్టి కూడా బంగారమే… అత్యంత విలువైన ‘రేర్ ఎర్త్ మినరల్స్’…
  • ఎందుకు కట్టాలి టోల్..? భలే బాగా చెప్పారు యువరానర్…
  • వేరే గ్రహాల దాకా దేనికి..? ఈ భూమి లోపలే తెలియని ఏవో ప్రపంచాలు…!
  • భలే మ్యాషప్ చేశారబ్బా..! అరుదైన స్వరవిన్యాసాలు, స్వరప్రయోగాలు..!!
  • సింగరేణి అంటే నల్లబంగారమే కాదు… ఇప్పుడిక అసలు బంగారం కూడా..!!
  • అవునూ.., హిందూ ఉత్సవాల వేళ భారత్ మాతాకీ జై అనకూడదా..?!
  • తెలుగు అభ్యర్థి..! ఇండియా కూటమిలో రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions