మమ్ముట్టి… వయస్సు మీద పడే కొద్దీ… ఇక అమ్మడూ కుమ్ముడూ బాపతు సౌత్ హీరోయిక్ వేషాలను కాదనుకుని… బాగా వైవిధ్యమున్న పాత్రలు, తనను నటుడిగా గొప్పగా ఆవిష్కరించే పాత్రల వైపు పయనిస్తున్నాడు… సర్వత్రా ప్రశంసలు, చప్పట్లు… ఒకవైపు రజినీకాంత్ రా రా రావాలయ్యా వంటి వెగటు పాటలు చేస్తుంటే, చిరంజీవి పాటల గురించి చెప్పాల్సిన పనేలేదు… కమల్, వెంకటేశ్, నాగార్జున, రాజశేఖర్ ఎవరూ తక్కువ కాదు…
అందుకే మమ్ముట్టిని మెచ్చుకోవాలనిపిస్తుంది… నటనలో తిరుగులేదు, ఈరోజుకూ తను నేర్చుకోవడానికి రెడీ అన్నట్టుగా కష్టపడతాడు… అన్నిరకాల ఉద్వేగాల్ని కళ్లల్లో, మొహంలో, బాడీ లాంగ్వేజీలో ఆవిష్కరించగలడు… వద్దులెండి, మనవాళ్లతో పోల్చుకోవడం… అగ్రహీరోలకు సైతం నటన అనే పదార్థం అంటీముట్టని వ్యవహారమే ఇప్పటికీ…
ఎందుకిదంతా అంటారా..? మమ్ముట్టి తాజా సినిమా టర్బో ఓటీటీలోకి వచ్చేసింది… (సోనీ లివ్)… 72 ఏళ్లు కదా, ఇదేమో కమర్షియల్, రొటీన్ జానర్… మరి ఎలా ఉంది..? మమ్ముట్టి తన ఇతర సౌత్ కమర్షియల్ హీరోల్లాగే రొమాన్స్, స్టెప్పుల్లోకి మళ్లీ వెళ్లిపోయాడా అనేది ప్రశ్న… నో, తను కమిటెడ్… నో హీరోయిన్, నో అమ్మడూ నో కుమ్ముడూ… చివరకు శివుడి మీద మంచి పాటకు సైతం వికారమైన సినిమా స్టెప్పులు వేయడం లేనే లేదు…
Ads
స్ట్రెయిట్ స్టోరీ ప్రజెంటేషన్… ఎవడో ఓ ఫ్రెండ్… వాడికి ఓ లవర్… అదో లవ్ స్టోరీ… వాడికి సహకరించబోయి ఇరుక్కున్న మమ్ముట్టి… తీరా లోతుల్లోకి వెళ్తే వందలు, వేల కోట్ల స్కాములు, హత్యలు… దాన్ని ఈ సౌత్ ఇండియన్ టిపికల్ హీరో ఎలా సాల్వ్ చేస్తాడనేదే స్టోరీ… మరి మన హీరోలు దైవాంశ సంభూతులు కదా… సారీ, బూతులు అని కదా ఉండాల్సింది సరే… కానీ మమ్ముట్టి ఇక్కడా ఓ వైవిధ్యాన్ని చూపించాడు… యాక్షన్ సీన్లు, స్టోరీ… అంతే… ఎక్కడా సగటు సౌత్ వెకిలి, వెగటు ప్రజెంటేషన్ జోలికి పోలేదు…
ఇక్కడ సినిమా బాగుందా, లేదా, ఎలా ఉంది అనే రివ్యూ జోలికి పోవడం లేదు… నిజానికి ఇందులో మన కమెడియన్ సునీల్ (కమెడియన్ అని మాత్రమే అంటున్నాను…) ఉన్నాడు, బట్, పెద్దగా తన పంచ్ లేదు, తన మార్క్ లేదు, సునీల్‌లో ఏదో లోపించింది, సీరియస్‌గానే..! కన్నడ నటుడు రాజ్ బి శెట్టి విలన్… వెరసి మలయాళ, తమిళ, కన్నడ ఫ్లేవర్స్… పాన్ ఇండియా… చివరకు ఓటీటీ ప్రైస్ విషయంలోనైనా వర్కవుట్ అవుతుందనే ప్లాన్…
కానీ ఈ ఇద్దరు తెలుగు, కన్నడ నటులు పెద్ద ఇంప్రెసివ్ ఏమీ కాదు… మొత్తం మమ్ముట్టే మోశాడు సినిమాను ఎప్పటిలాగే… కాకపోతే కథలో అంత కొత్తదనం ఏమీ లేదు, థ్రిల్ లేదు… ఎటొచ్చీ మలయాళం వాళ్లు కాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మాయ చేస్తారు కదా, ఇందులోనూ అంతే… బోర్ రాదు… ఏదో ఓ సగటు సౌత్ సినిమా చూస్తున్నట్టుగా… అలా అలా… అంతే…!!
Share this Article