సోషల్ మీడియా కదా… ఊరుకోదు… ఎవరికో తంపులు పెడుతుంది, ఎవరెవరికో పెళ్లి చేస్తుంది… ఆరోజుకు డిబేట్ ఏదీ లేకపోతే అర్జెంటుగా పెళ్లి గాకుండానే విడాకులు కూడా ఇచ్చేస్తుంది… సోషల్ మీడియా అలా ఎవరిని పడితే వాళ్లను ఎంచుకోదు, సెలబ్రిటీలు అయితేనే రీడర్‌షిప్ బాగా ఉంటుంది కదా, అందుకే లైమ్ లైట్‌లో ఉన్న ప్రముఖులనే ఎంచుకుంటుంది..?
ప్రస్తుతం సోషల్ మీడియా కన్ను ఒలింపిక్స్ పతక విజేతలు నీరజ్ చోప్రా, మను భాకర్‌ల మీద పడింది… మొన్న పారిస్‌లో వాళ్లిద్దరూ ఓచోట నిల్చుని మాట్లాడుతున్న వీడియో ఒకటి, నీరజ్ చోప్రాతో మను భాకర్ తల్లి మాట్లాడుతూ నీరజ్ చేతిని తన తల మీద పెట్టుకుని ఏదో ఒట్టు తీసుకుంటున్నట్టుగా ఉన్న వీడియో ఒకటి… రెండు కలిపేసి.,. అర్జెంటుగా కథలు అల్లేసింది సోషల్ మీడియా…, ఏమని..?
వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు… మను భాకర్ తల్లి నా బిడ్డను బాగా చూసుకోవాలి సుమా అని నీరజ్ చోప్రా నుంచి అలా ప్రమాణం చేయించుకుంటోంది అట… ఇప్పుడు సోషల్ మీడియా ఏది వండితే అదే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వడ్డిస్తుంది కదా… ఈ పెళ్లి వార్తలు కాస్తా వైరల్ అయిపోయాయి…
Ads
ఏమాటకామాట… అబద్ధమో, నిజమో పక్కన పెడితే… ఈ వార్తల మీద నెగెటివిటీ మాత్రం రాలేదు… పైగా అరె, భలే జంట, నిజమైతే బాగుండు కదా… ఇంకా ఇద్దరికీ బోలెడు కెరీర్ ఉంది, మెరిట్ ఉంది… ఒలింపిక్స్ మెడల్స్ తీసుకొచ్చి, భారత పతాకాన్ని ఎగరేసే అవకాశమూ ఉంది… ఇద్దరూ అందంగా ఉన్నారు… మంచి జంట అవుతుంది అని ప్రశంసలు కురిపిస్తున్నారు…
ఆలూ లేదు, చూలూ లేదు అంటారా..? అరె, జాతి మనోగతం అది… పైగా అక్రమ సంబంధాలేమీ అంటగట్టడం లేదు… ఎంచక్కా పెళ్లి చేసుకొండి, దేశమంతా శుభాక్షితలు చల్లుతుంది అని మంచి కోరుతున్నారు… గుడ్… కానీ… మను భాకర్ తండ్రికి చిర్రెత్తింది… ఎహె, ఊరుకొండి, నా బిడ్డకు ఇంకా పెళ్లి వయసు కూడా రాలేదు… మను భాకర్ తల్లికి ఆ నీరజ్ చోప్రాను కొడుకులా చూస్తుంది అని మీడియాను ఆక్షేపించాడు… ఆయన మర్చెంట్ నేవీలో చీఫ్ ఇంజనీర్…
పెళ్లి వయస్సు రాలేదు అనడం తప్పు… ఆమెకు ఇప్పుడు 22 ఏళ్లు… పుట్టింది హర్యానాలోని జజ్జర్ జిల్లాలోని గొరియా… తల్లి సుమేధా భాకర్ ఓ స్కూల్ ప్రిన్సిపాల్, ఆ స్కూల్ వీళ్ల పూర్వీకులదే… ఈసారి ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలు కొట్టింది, ఒకటి తృటిలో తప్పింది, నాలుగో స్థానం… తన లైఫ్ మీద, తన కెరీర్ మీద తనకు క్లారిటీ ఉంది, చాలా బ్రాండ్లకు ప్రచారం చేస్తుంది… డబ్బుంది… జాట్ సామాజికవర్గం… మరి నీరజ్ చోప్రా…?
తనదీ హర్యానాయే… పానిపట్ జిల్లా, కాంద్రా తన జన్మస్థలం… వయస్సు 26… మనూ భాకర్‌కన్నా నాలుగేళ్లు పెద్ద… తన ఖాతాలో ఆల్రెడీ ఓ ఒలింపిక్ స్వర్ణం, మరో రజతం ఉన్నాయి… ఆర్మీలో ఆఫీసర్… సామాజికవర్గం ఖత్రి అని కొందరు, సేమ్, మనూ భాకర్‌లాగే జాట్ అని మరికొందరు చెబుతుంటారు… సరే, ఆ రేంజుకు ఎదిగిన స్వతంత్ర వ్యక్తులకు సామాజికవర్గాల తేడాలు పెద్దగా అడ్డంకులేమీ కావు… కాకపోతే వాళ్లలో ఆ ఆలోచన ఉందనేది కదా అసలు ప్రశ్న…
నీరజ్ చోప్రా కుటుంబం కూడా డబ్బున్నదే… ఓ ప్యాలెస్ వంటి తన ఇంటి ఫోటోలు కూడా మొన్న ఏదో మెయిన్ స్ట్రీమ్ మీడియా పబ్లిష్ చేసింది… గోత్రాలు, కులాలు, జాతకాల దాకా ఇంకా సోషల్ మీడియా వెళ్లలేదు… ఈలోపు మనూ భాకర్ తండ్రి ఈ ఊహాగానాల్ని బద్దలు కొట్టేశాడు… సెలవు..!!
Share this Article