హీరోయిన్‌పై లైంగికదాడి.. ఏళ్లు గడిచినా న్యాయానికి ఎదురుచూపులే! (THE KERALA STORY)
2017 ఫిబ్రవరి.. కేరళ రాష్ట్రం కొచ్చిలోని నెండుంబసేరిలో దారుణం జరిగింది. దక్షిణాది సినిమాల్లో నటిస్తున్న ప్రముఖ హీరోయిన్ భావన (‘ఒంటరి’, ‘మహాత్మ’ ఫేం) (బాధితురాలి పేరు బయటపెట్టకూడదు. కానీ ఆమె స్వయంగా బయటకు వచ్చి చెప్పింది కాబట్టి తప్పు లేదు)ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ కారులో ఎక్కించుకున్నారు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
కొంతదూరం వెళ్లాక ఆమెను వదిలేశారు. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాలుగు నెలల తర్వాత ఈ కేసు కీలక మలుపు తిరిగింది. మలయాళ హీరో దిలీప్ తెరపైకి వచ్చారు. ఈ ఘటన వెనుక కీలక సూత్రధారిగా ఆయనే ఉన్నారని తేల్చారు. 1992 నుంచి ఆయన మలయాళ సినీరంగంలో ఉన్నారు. మంజు వారియర్ అనే నటిని పెళ్లి చేసుకుని, విడాకులిచ్చి, ఆ తర్వాత కావ్య మాధవన్ అనే మరో హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్నారు.
Ads
దిలీప్ ఈ పనిచేయించారని అనుమానించిన అధికారులు ఆయన్ని విచారణకు పిలిచారు. తనకు ఈ విషయంతో సంబంధం లేదని, నిజానికి భావనే తన మీద లేనిపోనివి చెప్తోందని, తనకు వివాహేతర సంబంధం ఉందని ప్రచారం చేస్తానని బెదిరిస్తోందని ఆయన అధికారులకు చెప్పారు. మూడు నెలలు జైల్లో ఉన్న దిలీప్ ఆ తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చారు. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది.
విచిత్రమేమిటంటే, భావనపై ఈ ఘటన జరిగింది 2017లో అయితే 2023 దాకా ఆమెకు మలయాళ సినిమాల్లో అవకాశాలు రాలేదు. అనధికారికంగా ఆమెను ఆ ఇండస్ట్రీ నుంచి దూరం పెట్టారు. ఇలా కూడా బాధితురాలే… (ఆ సమయంలో ఆమె కన్నడ ఇండస్ట్రీకి వెళ్లింది…)
కేరళ ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి హేమ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది. ఇందులో తెలుగు నటి శారదతోపాటు విశ్రాంత ఐఏఎస్ అధికారిణి కె.బి.వత్సలకుమారి ఉన్నారు. మలయాళ సినీరంగంలో నటీమణులు, మహిళా నిపుణులు పడుతున్న ఇబ్బందులు, భద్రతా ప్రమాణాల గురించి విచారించి నివేదిక అందించాలని ప్రభుత్వం తెలిపింది. 2019 డిసెంబరులో అప్పటి కేరళ సీఎం పినరయి విజయన్‌కి కమిటీ 300 పేజీల నివేదికను అందించింది.
ఆ నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయకుండా 2022 జనవరిలో మరో కమిటీని వేసి ఆ నివేదికలోని అంశాలు, వాటి ఆచరణను పరిశీలించమని తెలిపింది. హేమ కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని, దాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలని కేరళకు చెందిన Women in Cinema Collective (WCC) సభ్యులు కోరినా ప్రభుత్వం స్పందించలేదు. ఆ నివేదికకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో కూడా చెప్పలేదు.
జులైలో సమాచార హక్కు చట్టంలో భాగంగా ఆ నివేదిక కావాలంటూ కొందరు దరఖాస్తు చేసుకున్నారు. సజీ పరయిల్ అనే నిర్మాత ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించి, ఎవరికీ ఆ నివేదిక ఇవ్వకూడదంటూ పిటీషన్ వేశారు. దాంతో హైకోర్టు స్టే విధించింది. మంగళవారం ఆ పిటీషన్‌ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.జి.అరుణ్ ఆ స్టేని ఎత్తేశారు. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
‘సమస్యను పరిష్కరించడం ద్వారా స్త్రీలకు భద్రత లభిస్తుంది తప్ప, ఆ సమస్యను కప్పిపుచ్చడం వల్ల సమస్య తీరదని’ వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తాలూకు నివేదికలో ఏముందో ప్రజలు తెలుసుకోవడంలో తప్పేం ఉందని ప్రశ్నించారు. వారంలోగా ఆ నివేదికను ప్రచురించి, దాన్ని కోరిన వారికి అందించాలని పేర్కొన్నారు.
హేమ కమిటీ నివేదిక ప్రకారం.. సినిమాల్లో పనికి తప్పకుండా కాంట్రాక్ట్ రాయించుకోవాలని, స్త్రీ, పురుషులకు సమానమైన వేతనం ఇవ్వాలని, షూటింగ్ లొకేషన్లలో మద్యం, డ్రగ్స్ వాడటాన్ని నిషేధించాలని, మహిళలకు రక్షణగా సిబ్బందిని ఏర్పాటు చేయాలని.. ఇలా పలు సూచనలు చేశారు. – విశీ (వి.సాయివంశీ)
Share this Article