Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాపు అంటే ముళ్లపూడి కూడా… ఈ ఒక్క రాముడి కథే మినహాయింపు…

August 14, 2024 by M S R

బుధ్ధిమంతుడు , అందాలరాముడు , ముత్యాలముగ్గు వంటి సాంఘిక సినిమాలే పౌరాణికాల్లాగా ఉంటాయి . ఇంక సీతాకల్యాణం , శ్రీరామాంజనేయ యుధ్ధం వంటి పౌరాణికాలు తీస్తే ఎలా ఉంటాయో చెప్పవలసిన అవసరం లేదు . వాల్మీకి , వ్యాసుడు , పోతన కూడా ఆశ్చర్యపోవాల్సిందే . అంతటి కళాకారుడు బాపు .

1975 లో వచ్చిన ఈ శ్రీరామాంజనేయ యుధ్ధం సినిమా చూస్తే నాస్తికుడు కూడా ఆస్తికుడు కావాల్సిందే . అంత కళాత్మకంగా , కన్నుల పండగ్గా తీసారు మహానుభావుడు బాపు . NTR పౌరాణికాల స్థాయిలో ఆడలేదు కానీ రెండు కేంద్రాలలో వంద రోజులు ఆడింది . రిలీజయిన అన్ని సెంకర్లలోనూ యాభై రోజులు ఆడింది .

లవకుశ సినిమాలో నాగరాజు , సుబ్రమణ్యం ఎంత అద్భుతంగా నటించారో ఈ సినిమాలో యయాతి బిడ్డలుగా నటించిన రాధ , మురళి అంత అద్భుతంగా నటించారు . శ్రీరామరాజ్యం సినిమాలో చిరంజీవులు కూడా చక్కగా నటించారు . బహుశా ఈ పాత్రలను నటించే సమయంలో పాత్రధారుల్ని రాముడే ఆవహిస్తాడేమో !

Ads

ఈ సినిమా ఇంత అద్భుతంగా రావటానికి బాపుతో పాటు మరో ఇద్దరు నిపుణులు ఉన్నారు . ఒకరు గబ్బిట వెంకటరావు . నాటక , సినిమా రచయిత . చాలామందికి ఈ పేరు తెలిసి ఉండకపోవచ్చు . ఈ సినిమాకు ముళ్ళపూడి సంభాషణలు వ్రాయలేదు . ఈ వెంకటరావు గారే మాటలు , కొన్ని పాటలు వ్రాసారు . ఆ తర్వాత కె వి మహదేవన్ . ఆయన సంగీత దర్శకత్వం లోని పాటలు వింటూ ఉంటే అలా రాముడిలో ఐక్యం కావాల్సిందే . అంత భక్తి పూర్వకమైన శ్రావ్యత ఉంటుంది .

ఈ రామాంజనేయ యుధ్ధం వాల్మీకి రామాయణంలో లేదు . తెలుగునాట ద్రోణంరాజు సీతారామారావు , డి లక్ష్మీ నరసింహంలు రచించి , వేల ప్రదర్ళనలు ఇవ్వబడిన శ్రీ రామాంజనేయ యుధ్ధం నాటకాలు ఈ కధను ఇంటింటికీ చేర్చాయి . 1958 లో ఇదే టైటిల్ తో ఒక సినిమా వచ్చింది . విశేషం ఏమిటంటే ఆ సినిమాలో , ఈ సినిమాలో విశ్వామిత్రుడిగా ముక్కామలే నటించటం .

NTR గురించి చెప్పేది ఏముంది ! రాముడే దిగి వచ్చి NTR ని రాముడి వేషంలో చూస్తే నేను ఇంత అందంగా ఉన్నానా అని ఆనుకోవాల్సిందే . ఈ సినిమాలో బాపు NTR ని అంత చక్కగా చూపించారు . ఆయన తర్వాత ఆర్జా జనార్ధనరావు . ఆంజనేయుని పాత్రలో ఇద్దరు నటులు ఒదిగిపోయారు . ఒకరు రాజనాల , మరొకరు ఆర్జా జనార్ధనరావు . అయితే ఆర్జానే అగ్రగణ్యులు . ఈ సినిమాలో కూడా NTR తో సమానంగా నటనను ప్రదర్శించారు .

సీతమ్మగా బి సరోజాదేవి , యయాతిగా ధూళిపాళ , ఆయన భార్యగా జయంతి , వశిష్టునిగా కాశీనాధ్ , పార్వతీ పరమేశ్వరులుగా పి జె శర్మ , రాజశ్రీ , నారదుడిగా కాంతారావు జీవించారు . ఇతర పాత్రల్లో శ్రీధర్ , నాగరాజు , హేమలత ప్రభృతులు నటించారు .

ఈ సినిమా విజయానికి కారణమయిన పాటలు , నృత్యాలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే . సినిమా ప్రారంభమే బాలమురళీ కృష్ణ పాడిన మేలుకో శ్రీరామా మేలుకో రఘురామా పాటతో ప్రారంభమవుతుంది . కౌసల్యా సుప్రజారామ అనే సుప్రభాతం గుర్తుకొస్తుంది . పి సుశీల , వసంతలు పాడిన శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృత సాధం , భీకరమౌ శ్రీరామ బాణం తిరుగులేని అస్త్రం పాటలు , ఆ పిల్లల నృత్యం అద్భుతం . నృత్యాలను కంపోజ్ చేసిన హీరాలాల్ , కె యస్ రెడ్డిలను మెచ్చుకోవాల్సిందే .

ప్రముఖ రంగస్థల నటులు కె రఘురామయ్య కూడా కొన్ని పద్యాలు , పాటలు పాడటం విశేషం . ముఖ్యంగా సాకేత సార్వభౌమా శరణు శరణయా జానకిరామా , జయతు జయతు మంత్రం రామా నీల మేఘశ్యామా పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . బాలమురళీ కృష్ణ పాడిన మరో పాట కరుణాలోలా నారాయణ త్రిటజనపాల దీనావనా కూడా ఎంతో శ్రావ్యంగా ఉంటుంది . యం యస్ రామారావు పాడిన శరణము నీవే శ్రీరామా పాట చెవుల తుప్పు వదలాల్సిందే . సినిమా చివరలో ఆంజనేయుడు పాడే మహా విష్ణువుని అవతారాల పాట చూడాల్సిందే .

ఎంతయినా వ్రాయవచ్చు ఈ భక్తి పూర్వకమైన సినిమా గురించి . తండ్రీకొడుకుల్ని ఇద్దరినీ శ్రీరాముడి పాత్రలో దర్శకత్వం వహించారు బాపు . ఆయన దర్శకత్వంలో NTR కి ఇదే మొదటి సినిమా . నేనయితే ఈ సినిమా ఎన్ని సార్లు చూసానో ! యూట్యూబులో ఉంది . నాస్తికులు కూడా వీక్షించవచ్చు . సినిమా చివర్లో శివుడు చెపుతాడు . ఈ కధను విన్న వారికి కన్న వారికి సకల శ్రేయోదాయకం కాగలదు అని . ఈ సినిమా చూసిన వారికి , నా ఈ రివ్యూ చదివిన వారికి కూడా సర్వం శ్రేయోదాయకం కాగలదు . జై బాపు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ……….. By దోగిపర్తి సుబ్రహ్మణ్యం 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions