నర్సింహస్వామి దర్శనం చేసుకుని బయటికి వస్తుంటే… ఓ ముసలాయన, తన ముందు కొడుకు, వెనుక ఓ మహిళ… ఆ ముసలాయనకు ఆక్సిజెన్ పైపు, పోర్టబుల్ మినీ ఆక్సిజన్ సిలిండర్‌ను తోసుకుంటూ కొడుకు… వాళ్లను తీసుకెళ్తూ ఓ ఆలయ ఉద్యోగి… ఆశ్చర్యం అనిపించింది… ఆ అవస్థలోనూ, క్షణక్షణం కృత్రిమ ఆమ్లజని లేకపోతే గడవని అనారోగ్యం, వృద్ధాప్యంలోనూ నర్సన్న దర్శనం కోసం… అలా దివ్యాంగులు, రోగపీడితులు…
దేవుడంటేనే నమ్మకం… నమ్మకమే బలం… ఆ బలమే బతుకు మీద ఆశను, కష్టాలపై పోరాటానికి భరోసాను ఇస్తుంది… వీళ్లు కదా ఈ దేవుడిని గుండెల్లో పెట్టుకుని పూజించేది… కాలక్షేపానికి వచ్చీపోయే భక్తులు కాదు, ఇదుగో ఇలాంటోళ్లకు గుడి సౌకర్యాల్ని, ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సింది… తమ వ్యక్తిగత సమస్యల్ని కాగితంపై రాసి, దేవుడిని మంచి కోరుతూ హుండీల్లో వేస్తుంటారు… నర్సన్నకు లిఖితపూర్వకంగా సమస్య చెప్పుకుంటే ఏదో ఉపశమనం, మంచి జరుగుతుందనే విశ్వాసం… అవును, విశ్వాసమే కదా మనిషి ఆశ, శ్వాస…
మామూలుగా గతంలో యాదగిరిగుట్టకు వచ్చేవాళ్లు, స్నానాలు, దర్శనాలు గట్రా అన్నీ అయిపోయాక… తిరిగి వెళ్తూ కల్లు తాగి, తెచ్చుకున్నది ఆ రోడ్డు పక్కనే కూర్చుని ఫ్యామిలీతో సహా అక్కడే ఆరగించి… కాసేపు అక్కడే గడిపి, ఇంటికెళ్లిపోయేవాళ్లు… తిరిగి వస్తుంటే గుట్ట నుంచి వరంగల్ హైవే దారిలో పది వరకూ కల్లుపాకలు కనిపించాయి… అక్కడక్కడా ఫ్యామిలీస్ స్పిరిట్యుయల్ పిక్నిక్ తరహాలో రోడ్డు పక్కన కూర్చుని చిట్‌చాట్లలో మునిగిన తీరూ కనిపించింది… ఆ దారిలో బోలెడు హోటళ్లు… భోజనానికి, వసతికి… పైగా కులాల వారీ సత్రాలు సరేసరి…
Ads
శివుడితో పోలిస్తే విష్ణువు అలంకారప్రియుడు, భోగప్రియుడు, ఆహారప్రియుడు… అందుకే విష్ణు దేవాలయాల్లో భోగాల ఖర్చు చాలా ఎక్కువ… గుడి ఆదాయవ్యయాల మాటేమిటో గానీ… జర్మన్ టెంట్లు, జీతభత్యాలు, ఫ్రీబస్సులు, భోగాలు ఎట్సెట్రా ఖర్చులే గాకుండా… హైవే మీద నుంచి గుట్ట వైపు వచ్చే రోడ్డు దగ్గర నుంచి మొత్తం నిర్వహణ గుడిదే… తడిసిమోపెడు… ఇవి గాకుండా విశిష్ట అతిథుల కోసం విల్లా టైపు కాటేజీలు… చినజియ్యరుడు ఉద్దరించేది ఏమీ ఉండదు గానీ తనకు ఓ యాంటిక్ నేచర్ ఆశ్రమం…
నిజానికి దాన్ని ఏదైనా దైవసంబంధ కార్యక్రమానికి లేదా మ్యూజియం తరహా భవనంగా ఉపయోగించడం బెటర్… (కేసీయార్ అడ్డదిడ్డం నిర్ణయాలు ఇలాగే ఉంటాయి… ఒక స్వామికి అలాంటి సౌకర్యం ఇస్తే, మిగతా పీఠాధిపతులూ అడిగితే, దానికి అంతెక్కడ ఇక..? చివరకు ఆ చిన జియ్యరుడితోనూ ఆయనకు పడలేదు, పడటం లేదు… కారణాలు నర్సన్నకే తెలియాలి…)
టెంపుల్ సిటీ పేరుతో వందల ఎకరాలు తీసుకున్నారు… ఇంకా చాలామంది రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది… ఇప్పటికే 1800 కోట్ల ఖర్చు, అందులో గుడికి పెట్టింది 360 కోట్లే… ఇంకా చాలా పనులు పెండింగ్… అందులో ఏవి అవసరమో, ఏవి అనవసరమో రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి భేటీలో నిర్ణయం తీసుకోవాల్సిందే… రాజకీయ నిర్ణయాలే అంతిమం కదా… అన్నింటికీ మించి… అన్నప్రసాదం వెయ్యి, రెండు వేల మందికే ప్రస్తుతం… వచ్చిన ప్రతి భక్తుడికీ తిరుమల తరహాలో నిత్యాన్నదానం చేయగలదా గుడి..? చేయగలిగితే మహాభాగ్యం… చేయాల్సిన పనులకు ఇదొక ఉదాహరణ, ఇలాంటివెన్నో పెండింగ్… తిరుమలకు దీటైన గుడి అనే సంకల్పం వరకూ వోకే… కానీ మన సాధనసంపత్తితోపాటు ఎక్కడా ఆపని ప్రయత్నం అవసరం… సో, ఓసారి దృష్టి సారించాల్సిందిక రేవంతుడే..!!
Share this Article