2004లో సునామీ భారతదేశాన్ని అతలాకుతలం చేస్తే, 2011లో ఆ ప్రతాపం జపాన్ మీద పడింది. పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం కారణంగా అలలు ఉవ్వెత్తున ఎగిశాయి. భారీ అలలు తీరాన్ని తాకి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. జపాన్‌లో నమోదైన ప్రకృతి విపత్తుల్లో ఇది అత్యంత పెద్దది. ప్రపంచంలోని భయంకరమైన భూకంపాల్లో ఇది నాలుగోది. అలలు 133 అడుగుల ఎత్తున ఎగిసిపడి జనాన్ని నామరూపాలు లేకుండా చేశాయి. ఈ కారణంగా సుమారు 20 వేల మంది మరణించగా, 6,242 మంది గాయపడ్డారు. మరో 2,533 మంది పూర్తిగా గల్లంతయ్యారు. జపాన్ చరిత్రలో అదొక చీకటి అధ్యాయం.
ఆ సమయంలో జపాన్‌లోని Fukushima అనే పట్టణంలో సముద్రం ఒడ్డున Yuko అనే మహిళ కూర్చుంది. “Are you okay? I want to go home” అంటూ భర్త Yasuo Takamatsuకు తన ఫోన్ నుంచి మెసేజ్ పంపింది. కాసేపటికి ఆమె కంటి ముందు భారీ అలలు పైకి లేచాయి. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆమె పరుగు ప్రారంభించింది. కానీ ఎంత దూరం పరిగెత్తగలదు? అలా పరుగు పెడుతూనే ‘”The tsunami is disastrous” అనే మెసేజ్ టైప్ చేసింది. కానీ ఆ మెసేజ్ భర్తకు చేరలేదు. ఆ తర్వాత ఆమె ఏమైందో ఎవరికీ తెలియదు. కొన్నాళ్ల తర్వాత ఆమె ఫోన్ మాత్రం దొరికింది. అందులో ఆమె టైప్ చేసిన మెసేజ్ అలాగే ఉంది.
ఈ ఘోరం తర్వాత Yasuo Takamatsu అక్కడికి వెళ్లాడు. ఏముందని అక్కడ? మొత్తం నీళ్లు, శవాల కుప్పలు, రోదనలు. తన భార్య కోసం వెతకడం ప్రారంభించారు. కనిపించిన ప్రతి శవాన్నీ ‘అది నా భార్యదేనా?’ అని తరచి చూడటం కంటే ఓ మగవాడికి నరకం ఉంటుందా? కానీ తప్పదు. రోజుల తరబడి వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. ఆమె శవం కూడా కనిపించలేదు.
Ads
Yuko మరణించి ఉంటుందని, శవం సముద్రంలోకి కొట్టుకుపోయి ఉంటుందని అంతా అన్నారు. కానీ Yasuoకు వారి మాటల మీద నమ్మకం లేదు. తన భార్య ఎక్కడో ఉంది, భద్రంగా ఉంది, సముద్రంలోనే మరెక్కడో తన కోసం ఎదురుచూస్తోంది అని అనుకున్నాడు. ఆ నమ్మకాన్ని బలంగా నిలుపుకున్నాడు. సముద్రంలో ఉన్న భార్యను బయటకు తెచ్చేదెలా? సముద్రంలోకి వెళ్లాలంటే ఈత వస్తే చాలదు. డైవింగ్ తెలియాలి. కఠిన శిక్షణ కావాలి. సవాళ్లు ఎదుర్కోవాలి.
అందుకే Masayoshi Takahashi అనే వాలంటీర్‌ను కలిశారు. సునామీ వల్ల సముద్రంలో చేరిన అనేక భారీ వస్తువులను Masayoshi బయటకు తీశారు. సముద్రాన్ని కొంతమేరకు శుభ్రం చేశారు. ఆయనైతే తనకు సాయం చేస్తాడని భావించాడు. ఆయన వద్దే ఉంటూ డైవింగ్ ఎలా చేయాలో, సముద్రంలోకి వెళ్లాక తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో నేర్చుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం ఇద్దరూ కలిసి సముద్రంలోకి వెళ్లి వెతికాడు. ఆపైన Yasuo ఒక్కడే వెళ్లి తన భార్య కోసం వెతకడం ప్రారంభించాడు.
ఒకటి.. రెండు.. మూడు.. అలా 13 సంవత్సరాలు గడిచిపోయింది. ఆయన ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. ఇప్పటికి 600 సార్లు సముద్రంలోకి వెళ్లి వచ్చారు. ఆయన చేస్తున్న పని చూసి చాలామంది అడ్డుచెప్పారు, ఆపాలని ప్రయత్నించారు, పిచ్చిపని అని కొట్టిపారేశారు, ఆమె చనిపోయిందని, ఇక మర్చిపొమ్మని హితవు చెప్పారు. అవేవీ ఆయన వినిపించుకోలేదు. తన భార్య ఇంకా బతికే ఉందని, తన కోసం ఎదురుచూస్తోందని ఆయన నమ్ముతున్నాడు.
New York Times ఇంటర్య్యూలో ఆయన్ని అడిగారు ‘ఇంతకాలం ఒక మనిషి కోసం వెతకడం ఇబ్బంది కాదా? ఇంకా ఫలితం లభిస్తుందని అనుకుంటున్నారా?’ అని. ‘ఇది కష్టమని నాకు తెలుసు. కానీ వృథా అని మాత్రం అనిపించడం లేదు. ఒక భర్త నా భార్య కోసం నేను చేస్తున్న పని ఇది. ఎవరేమనుకుంటే నాకేంటి? ఈ అన్వేషణ నాకు ముఖ్యం. సముద్రంలోకి వెళ్లిన ప్రతిసారీ నా భార్య దొరుకుతుందన్న ఆశతో ఉంటాను. ఆమె దొరక్కపోయేసరికి నిరాశతో బయటకు వస్తాను’ అని వివరించారు.
ఆయన అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజంగానే ఆయన భార్య ఆయన కోసం సముద్రంలో నిరీక్షిస్తూ ఉందా? ఏమో? ఎవరికి తెలుసు? భార్య మీద ఇంత ప్రేమ దాచుకున్న మనిషి కోసం ఆమె ఏనాడైనా తిరిగిరావచ్చు… – విశీ (వి.సాయివంశీ)
Share this Article