అంతులేని కథ… నిజానికి ఈ సినిమా మీద విశేషాలెన్ని చెప్పుకున్నా, అది అంతులేని కథే… ఒడవదు, తెగదు… బాలచందర్ మార్క్ & మేజిక్ సినిమా . జయప్రద సినిమా . 1975 లో అరంగేట్రం చేసి భూమి కోసం , నాకూ స్వతంత్రం వచ్చింది సినిమాల్లో తళుక్కుమన్నా , హీరోయిన్ లెవెలుకు తీసుకుని వెళ్లిన సినిమా 1976 లో వచ్చిన ఈ అంతులేని కధ సినిమా . ఇంట్లో బయటా అందరికీ రాక్షసి లాగా కనిపిస్తూ , పనికిమాలిన కుటుంబ సభ్యుల కోసం తనను తాను కర్పూరహారతిని చేసుకునే అభాగ్యురాలి కధ టూకీగా . ఫుల్ లెంగ్త్ హీరోయిన్ పాత్ర మొదటిసారే అయినా జయప్రద జయప్రదంగా చేసింది . ఈ సినిమా ఆమె నట జీవితానికి ఓ మలుపు .
తమిళంలో సక్సెస్ అయిన అవల్ ఒరు తొడర్ కధై అనే సినిమాకు రీమేక్ అంతులేని కధ . తమిళంలో జయప్రద పాత్రను సుజాత పోషించింది . తెలుగులో కూడా సూపర్ హిట్టయ్యాక 1997 లో బెంగాలీలో కబిత అనే టైటిల్ తో రీమేక్ అయింది . కబిత అంటే కవిత . బెంగాలీలు వ ను బ అంటారు కదా ! జయప్రద పాత్రను మాలాసిన్హా నటించింది . 1983 లో కన్నడంలోకి రీమేక్ అయింది . కన్నడంలో సుహాసిని నటించింది . 1982 లో జీవన్ ధారా అనే టైటిల్ తో రీమేక్ అవ్వగా జయప్రద పాత్రను రేఖ నటించింది . అంత ట్రాక్ రికార్డు ఉన్న కధ ఈ సినిమా కధ . అయిదు భాషల్లో నిర్మితమైన ఈ సినిమాలో అందరికన్నా జయప్రదే బాగా నటించిందని అంటారు .
ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టే . ముఖ్యంగా బాల సుబ్రమణ్యం పాడిన తాళి కట్టు శుభవేళ మెడలో కల్యాణమాల పాట . మిమిక్రీతో కూడిన పాట . బాల సుబ్రమణ్యంకు తప్పితే ఈ ఫీట్ మరెవరికీ చేతకాదు . ఆ తర్వాత దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి పాట . జేసుదాసు బ్రహ్మండంగా పాడారు . యస్ జానకి పాడిన రెండు పాటలు జనం చెవుల తుప్పు వదిలించాయి . అరే ఏమిటి లోకం పలుగాకుల లోకం మరియు కళ్ళలో ఉన్న నీరు కన్నులకే తెలుసు పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . పాటలన్నీ ఆత్రేయే వ్రాసారు . యం యస్ విశ్వనాథన్ సంగీత దర్శకత్వానికి హేట్సాఫ్ .
Ads
(తాళికట్టు శుభవేళ పాటలో అడవిలో జంతువుల పాత్రలు తీసుకుని, సినిమా కథకు ముడేసి మిమిక్రీతో చెప్పడం గొప్ప ప్రయోగం… సేమ్, ఇది కథ కాదులో కూడా బాలచందర్ వెంట్రిలాక్విజం ఉపయోగించి ఓ బొమ్మ ద్వారా ఓ పాత్ర అంతరంగాన్ని చెప్పిస్తాడు… ఇప్పుడు ఆ లోతు, ఆ భావం, ఆ ప్రయోగం ఎక్కడివి..? అన్నీ ఊ అంటావా ఊఊ అంటావా అంటూ కుర్చీలు మడతపెట్టడమే కదా… అంతులేని కథ సినిమాలోని ఒక్కో పాటపై ఒక్కో వ్యాసం రాయొచ్చు…)
ఈ సినిమాకు చాలా విశేషాలు ఉన్నాయి . రజనీకాంత్ , నారాయణరావు , శ్రీప్రియలకు తెలుగులో మొదటి సినిమా . రజనీకాంత్ స్టైలుగా సిగరెట్ కాల్చటం ప్రేక్షకులకు బాగా నచ్చింది . వికటకవి పాత్రలో నటించిన నారాయణరావుకు మంచి పేరు వచ్చింది . ఇంక బెంగాలీ బాబు పాత్రలో కమల్ హసన్ మంచబ్బాయిగా చక్కగా నటించారు . బెంగాలీ సినిమాలో ఇదే పాత్రను తిరిగి పోషించారు . కన్నడంలో కూడా నటించారు .
ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది జయలక్ష్మి . ఈ సినిమా ద్వారానే ఫటాఫట్ జయలక్ష్మి అయింది . ఈ సినిమాకు మాటలు వ్రాసిన ఆత్రేయకు ఈ ఫటాఫట్ పదం ఎక్కడ దొరికిందో కాని ఆంధ్ర దేశమంతా ఫటాఫట్ ఆడింది , ఇంకా ఆడుతూనే ఉంది . Careless యువతిగా , చలాకీగా , హుషారుగా బ్రహ్మాండంగా నటించింది . అరె ఏమిటి లోకం పాటలో ఇరగతీసింది . తల్లీకూతుళ్ళ మధ్య ఎన్ని విబేధాలయినా రావచ్చు కాని సవతి పోరు మాత్రం రాకూడదనే డైలాగ్ బాగా పేల్చింది .
మరో నటుడు ప్రసాద్ బాబు . అతనికి కూడా ఇదే మొదటి సినిమా అనుకుంటా . Subject to correction . ఆల్మోస్ట్ షూటింగ్ అంతా విశాఖపట్నం లోనే జరిగింది . బాలచందర్ కు కూడా విశాఖ అంటే సెంటిమెంట్ లాగా ఉంది . చరిత్ర సృష్టించిన మరో చరిత్ర సినిమా కూడా విశాఖలోనే తీసారు . బ్లాక్ & వైట్ సినిమా అయినా సూపర్ హిట్టయింది .
టివిలో ఇప్పటికీ వస్తూనే ఉంటుంది . బహుశా ఈతరంలో కూడా చూడనివారు ఎవరూ ఉండరేమో ! ఒకరూ అరా ఎవరయినా ఉంటే అర్జెంటుగా చూసేయండి . యూట్యూబులో ఉంది . మధ్య తరగతి కుటుంబాలలో ఏ పనీ చేయకుండా భూమికి భారమయ్యే కుటుంబ సభ్యుల బాధితులు అవుతున్న అభాగ్య అక్కలకు , తల్లులకు ,తండ్రులకు ఈ సినిమా అంకితం . వారి జీవితాలు అంతులేని కధే #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
Share this Article