బంట్రోతు కొడుకు కలెక్టర్ అవుతాడు.., తండ్రి పనిచేసే కలెక్టరాఫీసుకే కలెక్టరుగా వస్తాడు.., నగరంలోని దేశద్రోహులను చట్టానికి పట్టిస్తాడు… ఈ సినిమా 1976 లో వచ్చిన ఈ బంగారు మనిషి సినిమా … రాజయినా , పోలీసు ఆఫీసరయినా , సాహసం చేసే డింభకుడు అయినా , కలెక్టర్ అయినా NTR కు మారు వేషాలు ఉండాల్సిందే . ఈ సినిమాలో కూడా ఉంది .
ఈ సినిమాలో ముఖ్యంగా మెచ్చుకోవలసింది గుమ్మడి నటన . తాను పనిచేసే కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ కూర్చునే కుర్చీని కూడా భక్తిశ్రద్దలతో చూసుకునే పాత్ర . అలాగే , తన కొడుకే కలెక్టరుగా వచ్చినప్పుడు , ఆ కొడుకుకి బంట్రోతుగా సేవ చేసేటప్పుడు చక్కటి ఎమోషన్లను చూపారు . ఔట్ డోర్ షూటింగ్ అంతా విశాఖపట్టణంలోనే జరిగిన ఈ సినిమాలో NTR- లక్ష్మి జోడీ అందంగా ఉంటుంది . ప్రేక్షకులు ఓకే అన్న జోడీ . ఒకే కుటుంబం సినిమాలో కూడా ఈ జోడీ హిట్టయింది . ఈ రెండు సినిమాలకూ దర్శకుడు భీం సింగే .
గుమ్మడి కాఫీ తీసుకురమ్మని భార్యకు పురమాయిస్తే, వేణు కాఫీ తెస్తాడు. ‘‘బాబూ! నువ్వు తెచ్చావా?’’ అని తండ్రి అంటే.. ‘‘నాన్నా! ఆఫీసులో కలెక్టరు గారికి ప్యూన్‌గా పదిసార్లు కాఫీ ఇచ్చారు. కన్నకొడుకుగా ఒకసారైనా కాఫీ ఇవ్వకూడదా?’’ అనే సన్నివేశామూ.., తన స్నేహితుడు మధు (శరత్‌బాబు) ఆఫీసులో తన కలెక్టర్ స్నేహితుణ్ని చనువుగా సంభోదించబోతే కటువుగా వారిస్తూనే బయటకు వచ్చాక, ‘‘అరే మధూ! అక్కడ మాట్లాడడం ఎంత తప్పో, ఇక్కడ మాట్లాడకపోవడం అంత తప్పురా, ఆఫీసుకొక మర్యాద వుంది, స్నేహానికి ఒక హద్దు ఉంది’’ అనే సన్నివేశాన్ని రామారావు చాలా సహజంగా, ఆర్ధ్రంగా నటించారు… సహజ నటి లక్ష్మితో ఎన్.టి.రామారావు హీరోగా చేసిన చివరి చిత్రం ఇదే. ‘నా దేశం భగవద్గీత’ అన్న పాట ఎంతో ప్రజాదరణ పొందింది…
Ads
కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . ముఖ్యంగా NTR , లక్ష్మిల గీత రూపకం చాలా బాగుంటుంది . నా దేశం భగవద్గీత నా దేశం అగ్నిపునీత సీత ….. ఎక్కడకెళుతుందీ దేశం ఏమయిపోతుంది పాట బాగా చిత్రీకరించబడింది . మరో శ్రావ్యమైన పాట కలగన్నాను ఏదో కలగన్నాను నే కలగన్నాను పాట . జయమాలిని డాన్స్ పాట ఇది మరో లోకం ఇది అదో మైకం పాట , NTR మారువేషంలో సుక్కేస్కోరా నాయనా సుక్కేస్కోరా పాట ప్రేక్షకులకు హుషారుగా ఉంటాయి . నిండుకుండ తొణకనే తొణకదు , మేలుకో వేణుగోపాలా పాటలు శ్రావ్యంగా ఉంటాయి .
ముక్కామల , ప్రభాకరరెడ్డి , హేమా చౌదరి , అల్లు రామలింగయ్య , రమాప్రభ , శ్రీధర్ , శరత్ బాబు , మిక్కిలినేని , పండరీబాయి , నిర్మలమ్మ , గిరిజ , రావు గోపాలరావు , కె వి చలం ప్రభృతులు నటించారు . లంచానికి రకరకాల పేర్లను నామకరణం చేసిన మహానుభావుడు అల్లు రామలింగయ్య . ఈ సినిమాలో కూడా కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగిగా లంచానికో పేరు , పరమార్థం , నిర్వచనం సెలవిస్తాడు .
వంద రోజులు ఆడిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయిన సినిమా . సినిమా యూట్యూబులో ఉంది . చూడనివారు , ముఖ్యంగా NTR అభిమానులు , తప్పక చూడతగ్గ సినిమా . NTR-లక్ష్మి జంట , కెమిస్ట్రీ రెండూ బాగుంటాయి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు …….. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )
Share this Article