Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాపు తప్ప ఇంకెవరూ ఈ సినిమాను ఇంత అందంగా చెక్కేవారు కాదేమో..!

August 22, 2024 by M S R

నవరసాలు వర్షించిన కళాఖండం . ఓ దృశ్య కావ్యం . బాపు తప్పక మరెవ్వరూ ఇంత అద్భుతంగా తీయలేరేమో అని అనిపిస్తుంది . అంత అద్భుతంగా తీసారు . శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని అష్ట దిగ్గజాలలో ఒకరయిన ధూర్జటి మహాకవి విరచిత శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం ఆధారంగా వచ్చిన పలు సినిమాలలో ఒకటి 1976 లో వచ్చిన ఈ భక్త కన్నప్ప సినిమా .

దీనికి ముందు కన్నడ హీరో రాజకుమార్ నటించిన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం సినిమా వచ్చింది . బాగానే ఆడింది . బాపు గారి ఈ సినిమా కృష్ణంరాజుని తిరుగులేని పాజిటివ్ హీరోని చేసేసింది . వాణీశ్రీ గురించి చెప్పేదేముంది . ఈ ఇద్దరి జోడీని , వారిద్దరి మధ్య ప్రేమను బాపు అద్భుతంగా ఆవిష్కరించారు .

William Wordsworth లాగా బాపు ప్రకృతి ప్రేమికుడు . సుమారు 90% ఔట్ డోర్ షూటింగే . పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం , పట్టిసీమ ప్రాంతాల్లో తీసారు . తిన్నడి గూడెం , తిన్నడు మల్లన్న ఫైటింగుల ఎరీనా , డ్రమ్ముల మీద వాణిశ్రీ డాన్సులకు కావలసినంత ప్రదేశం .

Ads

ఈ సినిమాలో ప్రతీ పాత్రను గొప్పగా మలిచారు . బహుశా ఒక్క సన్నివేశాన్ని , ఒక్క డైలాగునీ తొలగించలేమేమో ! అంత గొప్ప స్క్రీన్ ప్లే , దర్శకత్వం . ఈ సినిమాను రెండు వందల రోజులు ఆడించిన వారిలో మరో ఇద్దరు ముఖ్యులు సంగీత దర్శకుడు సత్యం , నృత్య దర్శకుడు శీను .
బాల సుబ్రమణ్యం పాడిన తకిటతక తకిటతక చకిత పదయుగళం పాటతో , శివ తాండవంతో , కిరాతార్జునీయంతో సినిమా ప్రారంభమవుతుంది .

మహానుభావుడు వేటూరి అద్భుతంగా వ్రాసారు . ఆయన వ్రాసిందే మరో పాట శివ శివ శంకర భక్తవ శంకర శంభో హరహర నమో నమో . మహా శివరాత్రి నాడు , పర్వదినాలలో మనమందరం వినే భక్తి పాట . రామకృష్ణ చాలా బాగా పాడారు .

కండ గెలిచింది కన్నె దొరికింది పాటలో వాణిశ్రీ డాన్స్ ఆమె కెరీర్లో న భూతో న భవిష్యతి . ముతగ్గా చెప్పాలంటే ఇరగతీసింది . డ్రమ్ముల మీద డాన్స్ . నృత్య దర్శకుడు శీనుకు హేట్సాఫ్ . రామకృష్ణ , సుశీలమ్మ పాడారు . మరో పాట ఆకాశం దించాలా నెలవంకా తుంచాలా . వేటూరి గారిదే . ఆరుద్ర వ్రాసిన పాట ఎన్నియలో ఎన్నియలో సందమామా సిన్నాదాని మనువు సేయి సందమామా . వీటిని కూడా రామకృష్ణ , సుశీలమ్మలే పాడారు . బహుశా రామకృష్ణని ఇంకా జనం గుర్తులో ఉంచింది ఈ సినిమాయే కావచ్చు .

ప్రత్యేకంగా మురిసిపోవాల్సిన పాట శివ శివ అననేలరా పాట , జయమాలిని నృత్యం . సి నారాయణరెడ్డి వ్రాసిన ఈ పాట మిట్ట మధ్యాహ్నం తోటలో షూట్ చేసారు . పౌర్ణమిని చూపించారు బాపు ప్రేక్షకులకు . దేవదాసి పాత్రలో జయమాలిని నటన , నృత్యం సూపర్బ్ .

ఈ సినిమాలో జనం మరచిపోలేని కాంబినేషన్ తండ్రీకొడుకులుగా రావు గోపాలరావు , సారధిలది . ఏదో వంకర కూత కూస్తావుగా అనే రావు గోపాలరావు డైలాగ్ , పక్కనే ఉండి తండ్రి అఘాయిత్యాలను చూడలేక సతమతమయ్యే కాశీ పాత్రలో సారధి పది కాలాల పాటు గుర్తుండే పాత్రలో నటించాడు . రావు గోపాలరావు సాఫ్ట్ , కన్నింగ్ విలనీ గురించి చెప్పే పనిలేదు .

vanisri

వీరందరితో పాటు ఝాన్సీ , శివపార్వతులుగా బాలయ్య – వరలక్ష్మిలు , మల్లన్నగా శ్రీధర్ , నీల తండ్రిగా ప్రభాకరరెడ్డి , రెడ్డి గారిగా ముక్కామల నటించారు . ఎవరికి వారు అద్భుతంగా నటించారు . ఈ సినిమాలోని ముళ్ళపూడి వారి కొన్ని డైలాగులు తూటాల్లాగా ఉంటాయి . V S R స్వామి ఫొటోగ్రఫీ , ఆపరేటివ్ కెమేరామేన్ యస్ గోపాలరెడ్డిల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే .

ముత్యాలముగ్గు గురించి ఎలా అయితే గ్రంధాలు గ్రంధాలు వ్రాయవచ్చో , ఈ సినిమా గురించి కూడా అంతే . ఎంత వ్రాసినా తనివితీరదు . అవి పాటల్లోని సాహిత్యం కావచ్చు , మాటలు కావచ్చు , దర్శకత్వం కావచ్చు , సంగీతం కావచ్చు , నృత్యం కావచ్చు , ఫోటోగ్రఫీ కావచ్చు . ఎవరికి వారు ఈ సినిమాను చూసి తన్మయత్వంలో మునిగిపోవటమే . ఎన్ని సార్లయినా చూడవచ్చు . శివరాత్రి నాడు ఏదో ఒక చానల్లో రాకుండా ఉండనే ఉండదు . యూట్యూబులో కూడా ఉంది . ఆస్వాదించండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

ఇదీ చదవండి… జగములేలినవాని సగము నివ్వెరబోయె, సగము మిగిలినవాని మొగము నగవైపోయె…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండోసోల్ కంపెనీ… అది మరో మేఘా… అయినవారే అందరికీ…
  • యాక్టింగ్ సీఎం మీనాక్షి పట్ల పొంగులేటి డోన్ట్ కేర్ యాటిట్యూడ్..!!
  • ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సాయం..? నిజమా..? అబద్ధమా..?
  • కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!
  • వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!
  • ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!
  • జనాదరణలో దుమ్మురేపుతున్న మన యువ గాయకుడు…
  • పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…
  • నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …
  • హరిహరా… ఓ వీరమల్లూ… నీ కథెప్పటిది..? ఆ చార్మినార్ ఎప్పటిది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions