ఆగస్టు 22. 1955. నర్సాపురం ఆసుపత్రి. ఉదయం 10. 10 నిమిషాలు. చిత్త నక్షత్రం. భూమికి నలుదిక్కులా మంగళ వాద్యాలు మోగుతున్నాయి. సప్త ఋషులు ఏడు దిక్కులా నిలబడి మంత్రోచ్ఛాటన చేస్తూ భూమి మీదకి పూలు విసురుతున్నారు. ఎనిమిదో దిక్కున నారద తుంబురులు స్వాగతగానం చేస్తున్నారు. ఒక మహోన్నత వ్యక్తి రాకని సూచిస్తూ ఒక నక్షత్రం ఆకాశంలో ప్రజ్వరిల్లుతూ ప్రకాశిస్తో౦ది.
‘పద్మావతీ నామధేయ నర్సు పురుడు పోయగా, పద్మాసానుడే ఉసురు పోయగా, నటరాజ తేజమై, నవరస నాందీ బీజమై అవతరించెను అంజనీ పుత్రుడయా… అసతోమా సద్గమయా’ … అని ఓ సినీ కవి వ్రాస్తూ ఉండగా నేను జన్మించానట..”.
ఇలా ప్రారంభిస్తే అంతకన్నా అతిశయోక్తి లేదు. ఒక చిన్న ఊర్లో, ఒక చిన్న హాస్పిటల్ లో అందరిలాగే నేనూ పుట్టాను. ‘తొమ్మిది నెలలు మోసి జన్మనిచ్చిన అమ్మను, పది జన్మల పాటూ ఆనంది౦పజేయటానికే నా జన్మ’ అని తెలుసుకుంటూ పెరిగాను.
Ads
** ** **
నేను, నా తరువాత అమ్మాయి గౌరీ పార్వతి. చనిపోయింది. తరువాత నాగబాబు. ఆపై విజయ దుర్గ. పవన్ కళ్యాణ్. తరువాత డాక్టర్ మాధవి. మాధవి ప్రస్తుతం నా బ్లడ్-బ్యాంక్ చూస్తోంది. మధ్యలో ‘రమణ’ అనే చెల్లి తన రెండో ఏట పోయింది. అయిదుగురిలో నాకు నాగబాబు దగ్గర. మా ఇద్దరికీ మాధ్య నాలుగైదేళ్ళ వయసు తేడా. చిన్నతనం నుంచీ తనతోనే ఆడుకునేవాడిని.
‘ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు’ అన్నారు ఆత్రేయ. ‘ప్రపంచానికి నీ తీపి గుర్తుగా కనీసం ఒక మంచి పని చేసి పో… ‘ అన్నారు అబ్దుల్ కలాం. ‘బీద కుటుంబంలో పుట్టటం నీ తప్పు కాదు. బీదవాడికి తండ్రి అవటం నీ తప్పు’ అన్నాడు అదానీ. రకరకాల ఫిలాసఫీలు.
మా నాన్నగారిది లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అమ్మది కాస్త పై అంతస్తే. పేరు అంజనాదేవి. ఆమె తండ్రి జే. ఆర్. కే నాయుడు. పోస్టల్ డిపార్ట్మెంటు. ఆయన శివ భక్తుడు. అందువల్ల నాకు ‘శివ శంకర వరప్రసాద్’ అని పేరు పెట్టారు.
పని చెయ్యకపోతే ఉక్కిరిబిక్కిరి అయ్యే విధానంలో నన్ను మా అమ్మ పెంచింది. డబ్బు కావాలి. నిజమే. దానికోసం పని చెయ్యాలి. అదీ నిజమే..! కానీ డబ్బు కన్నా ‘ప్రేమ’ ముఖ్యం అని తన జీవన విధానం ద్వారా అమ్మ చెప్పింది. ‘నువ్వు ఎంత ఖరీదైన కుక్కనయినా కొనవచ్చు గాక. కానీ అది నిన్ను చూసి తోక ఆడించాలీ అంటే నీలో ప్రేమ ఉండాలి’ అన్నారు మా గురువు చార్లీ చాప్లిన్.
అమ్మ నుంచి నేనూ, నా నుంచి నా పిల్లలూ వారసత్వం చేసుకున్న క్వాలిటీ ఏమిటంటే… ‘టుగెదర్నెస్’. ఇప్పటి కూడా నేనూ, నా తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ ఒక యూనిట్ గా కలిసే ఉంటాం. పిల్లలూ, పెద్దలూ ఎవరి ఏసీ గదుల్లో వాళ్ళు ఉండము. బావలూ, వారి భార్యలూ, వారి కుటుంబాలూ బాగా కలిసిపోతారు. కష్టం వచ్చినప్పుడు ఈ ఎమోషనల్ బాండింగ్ అనేది చాలా మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది.
‘పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది’ అన్న కృష్ణశాస్త్రి గారి పాట నిజం చేసే అయిదుగురు సహోదరులం మేము. మా పిల్లలు కూడా అంతే – అని గర్వంగా చెప్పగలను. అయితే చిన్న చిన్న అలకలు, కోపతాపాలు ఏ ఇంట్లో అయినా తప్పవు కదా. నాలుగైదు రోజులు మౌన గృహాల్లో మాట్లాడకుండా ఉంటాం. మళ్ళీ కలిసిపోతాం.
మా అమ్మకు నేను పెద్ద ఫ్యాన్ ని. ‘అమ్మ’ అంటే నాకు ప్రేమే కాదు, గౌరవo కూడా. ఈ రోజు, సినిమాల్లో నాతో పాటు నటించే ఆడపిల్లలు ఏ గిల్టూ లేకుండా నిర్భయంగా మా ఇంటికి వచ్చి మా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసి పోవటానికి కారణం వారికి నేను ఇచ్చే చనువు ఒక వైపు, వల్ల పట్ల నేను చూపించే గౌరవ౦ మరొ వైపు..!
సురేఖ కూడా వారిని అప్యాయంగా పలకరిస్తుంది. సొంత మనుష్యుల్లా చూసుకుంటుంది. స్త్రీ పట్ల నాకీ గౌరవం ఏర్పడటానికి కారణం మా అమ్మ. పెద్దయ్యాక నేనొక ఫెమినిస్ట్ గా మారటానికీ, నా భార్యని ప్రేమగానే కాకుండా “గౌరవం” గా కూడా చూసుకోవటానికీ కారణం… నేనొక ‘తల్లి జీవితాన్ని’ దగ్గరగా చూడటమే..! (జన్మదిన సందర్భంగా చిర౦జీవి బయోగ్రఫీ పుస్తకంలో ప్రారంభ వాక్యాలు. కవర్ పేజి కేవలం సూచన మాత్రమే..) ( Yandamuri veerendranath )
Share this Article