మేధావులు (?), కళాకారులు, రచయితలు, పాత్రికేయులు ఎట్సెట్రా చాలా మంది కేసీయార్ క్యాంపు మనుషులు (ఒక్క హరగోపాల్ మినహా అనుకుంటున్నాను) చాలా ఆవేదనతో, వేదనతో, బాధతో, నొప్పితో రాహుల్ గాంధీకి ఒక లేఖ రాశారు… అయ్యా, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీ రేవంత్ రెడ్డి మా సచివాలయం ఎదుట పెడతా అంటున్నాడు… కానీ సరికాదు…
సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెడితేనే మొత్తం తెలంగాణ సమాజం ఆకాంక్షలను గౌరవించినట్టు… ఇంకెక్కడ పెట్టినా సరే అవమానించినట్టు… కేసీయార్ కూడా ఫాఫం అక్కడే పెట్టాలని అనుకున్నాడు పదేళ్లుగా… కానీ కుదరలేదు… రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మా డిమాండ్ అంగీకరించాలి…… అన్నట్టుగా ఆ లేఖ సాగిపోయింది…
హేమిటో… పదేళ్లుగా మరి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా ఎవరాపారు శ్రీమాన్ కేసీయార్‌ను…? సచివాలయం ఎదురుగా ఏం ఖర్మ..? ఏకంగా సచివాలయం లోపలే ప్రతిష్ఠిస్తాను అంటున్నాడు రేవంత్ రెడ్డి… అవునూ, ఈ మేధోసమాజం ఎవరి కోసం గొంతులు విప్పుతోంది..? ఏ పార్టీ క్యాంపు ఇది..? ఇందులో బీజేపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ గట్రా ఒక్కరైనా ఉన్నారా అసలు..? మరి ఇది తెలంగాణ సమాజం గొంతు ఎలా అవుతుంది..?
Ads
రాజకీయ ప్రయోజనాల కోసం యాదగిరిగుట్టలో హరీష్‌రావు పోయి, బయట పూజారులతో పూజలు చేసి, నర్సింహస్వామినీ రాజకీయాల్లోకి లాగుతాడు… ఏయ్, రాజీనామా చేయ్ అంటున్నారు కదా అందరూ, అది పక్కదారి పట్టించడానికి ఇదొక క్రతువు..? కేవలం కేటీయార్ క్యాంపు కోసం పనిచేస్తూ, కేవలం రేవంత్ రెడ్డి మీద బురద జల్లడమే పాత్రికేయంగా కొందరు జర్నలిస్టులుగా చెప్పబడతారు… అదొక ఎపిసోడ్… అక్కలు అంటే కించపరిచినట్టు అంటూ గాయిగత్తర చేస్తారు, తనే రికార్డింగ్ డాన్సులు చేసుకొండి అని వెక్కిరిస్తాడు తెలంగాణ మహిళను… ఇదొక నాటకం…
అవునూ, ఇంతకీ రాహుల్ గాంధీకి రాసిన లేఖపై తెలంగాణ బుద్ధిజీవులు నిజంగా ఏమంటున్నారు..? మస్తు రాశారు బ్రదర్స్ అని మెచ్చుకుంటున్నారా..? సంఘీభావం చెబుతున్నారా..? లేదు… ఇంకా మీ రాజకీయ మకిలి వదల్చుకోరా అనడుగుతున్నారు… మిత్రుడు గుఱ్ఱం సీతారాములు ఇంకాస్త నిశితంగా విమర్శిస్తున్నాడు ఇలా..?
తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అన్నా, మూడెకరాల భూమి అందరికి కాకున్నా కనీసం అమరుల కుటుంబాలకు అయినా ఇవ్వడం న్యాయబద్దం అని అడిగితే ‘బుద్ది’ జీవుల మాటకు ఒక సార్ధకత… ఎందుకడగలేదు..?
ఒకనాడు సచివాలయం ముందు ఉన్న ధర్నా చౌక్ ను లోయర్ టాంక్ బండ్ మురికి కాలవ పక్కన విసిరేస్తే బంగారు తెలంగాణలో ధర్నాలు బంద్ లు అవసరమే లేదు అని ధర్నా చౌక్ ఎత్తేస్తే అది తప్పు కదా అని ఒక ప్రకటన ఇవ్వాల్సింది కదా… ఇవ్వలేదు..?
లేఖలో రాయబడిన లిస్టులోని మొదటి పేరు బుద్దిజీవి హరగోపాల్ మీద ఉపాకేసు పెట్టినప్పుడు, జాక్ అగ్ర నాయకుడు కోదండరాం ఇల్లు తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేస్తే ఒక సంయుక్త ప్రకటన ఇవ్వాల్సింది కదా…. లేదు… జరగలేదు…
తెలంగాణ ఉద్యమాన్ని నెత్తుటి ఏరులు పారించిన. జలగం వెంగళ రావు, పచ్చి తెలంగాణ వ్యతిరేకి కాసు బ్రహ్మానంద రెడ్డి , పెప్పర్ స్ప్రే కొట్టి పార్లమెంట్ ను అభాసుపాలు చేసి నగరం నడిగడ్డ మీద కురుపులా మొలిసిన లాంకో హిల్స్ (వక్ఫ్ భూములు) అన్యాయం అని ఒక ప్రకటన ఇవ్వాల్సింది…. సోయి లేదు…
ట్యాంక్ బండ్ మీద వెన్నులో దిగిన బాకులా ఉన్న తెలంగాణ ద్రోహుల విగ్రహాల స్థానే కొమురం భీం, చాకలి ఐలమ్మ, మారోజు వీరన్న, కాళోజి , జయశంకర్ విగ్రహాలు ఉండడం న్యాయం కదా అని అని నోరు విప్పాల్సి ఉండే… మరేమైంది..? నోళ్లు ఎందుకు పెగలలేదు..?
వేల కోట్లు గుడులకు దానాలు సంతర్పణలు చేస్తుంటే, బడులలో మరుగు దొడ్లు లేవు, అవి ముఖ్యం కదా అని అడిగి … చదువుకున్నాం అనే ఎరుకతో అడగాల్సి ఉండే…. అదీ లేదు…
మూడు లక్షల కోట్లు అక్రమంగా ఖర్చు పెట్టాడు కెసిఆర్ అని స్వయంగా కాగ్ అంటే అది బక్కజీవుల సొమ్ము కదాని అడగాల్సి ఉండే… పాలన సచివాలయం నుంచి కాకుండా ఎర్రవల్లి, జన్వాడ ఫామ్ హౌజులకు అధికారులు, నాయకులు కాట్ వాక్‌లు చేస్తుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోంది కదాని నోరు విప్పా ల్సింది… విప్పలేదు… నోళ్లున్నాయనే సోయీ లేదు…
వేల ఎకరాలు కబ్జా పెట్టిన రామోజీ, జీయరు, ఎంతో మంది తెలంగాణ వ్యతిరేకుల మీద నోరు విప్పాల్సి ఉండే… తెలుగు తల్లి ఎవడికి బుట్టిన తల్లి అని తెలంగాణ తల్లిని నెలకొల్పుకున్నప్పుడు ఆ బొమ్మ దొరసానిలా ఉండాల్సింది కాదు అని అడగాల్సి ఉండే… ఏమైంది మరి..?
తొమ్మిదేళ్ళు తెలంగాణ జాతీయ గీతం లేకుంటే… ఒక అలగా మాదిగ రాసిన గీతాన్ని అవమాన పరిస్తే… ప్రజాస్వామ్య దేశంలో వివక్ష ఏల అని అడగాల్సి ఉండే… అడగలేదు…
రాజీవ్ గాంధీ విగ్రహం వద్దు అనడానికి ఇన్ని సంతకాలు, ఇంత పేపర్ అవసరమా, మేము కెసిఆర్ సంతకం పెట్టమంటే పెట్టాము అంటే పోలా..? తెలుగు తల్లి విగ్రహం మార్చి పెట్టాలి, విగ్రహాల మీద నాకు భ్రమలు లేవు, అంత అల్పున్ని కాను కానీ రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రధాని, అమరుడు…
నోట్: మరి నువ్వేం పీకావు అంటారేమో, ఈ పదిహేను ఏళ్ళ లో పైన పేర్కొన్న ప్రతి అంశాన్ని ఏదో ఒక రూపంలో అడిగా, రాసా… ఒకనాడు నేను పనిచేసిన సంఘాలలో అది ఇచ్చిన స్ఫూర్తిలో భాగమై అడిగా (ఇప్పుడు నేను ఏ సంఘాలలో లేను) సొ… బుద్ది జీవులకు అడిగే హక్కు ఉంది, వాళ్ళను కూడా ప్రశ్నించే గొంతుకు కూడా హక్కు ఉంది….
Share this Article