ప్రజాశక్తిలో ఓ వార్త… నదిలో రోజుకు సగటున 28 టీఎంసీల నీరు మాయమైపోతున్నదనీ, సీడబ్ల్యూసీ నివేదికలో కూడా ప్రస్తావించారనీ, దీంతో పోలవరం పటిష్ఠతపై కూడా అనుమానాలు ప్రబలుతున్నాయనేది వార్త… అదృశ్య గోదావరి అని శీర్షిక…
సాధారణంగా ప్రవాహజలాల్ని క్యూసెక్కుల్లో, నిల్వనీటిని టీెఎంసీల్లో కొలుస్తాం కదా… మరిదేమిటి..? రోజుకు 28 టీఎంసీలు అంటారేమిటి..? అంతటి సీడబ్ల్యూసీ కూడా (కేంద్ర జల మండలి) అలా నివేదికలో రాసిందా..? సరే, ఈ టెక్నికల్ సందేహాలు పక్కన పెడితే… వాళ్ల లెక్కల్లోనే 28 టీఎంసీ అంటే… 3 లక్షల క్యూసెక్కుల వరకు అనుకుందాం రఫ్‌గా…
మరి అంత నీరు మధ్యలోనే మాయమైపోవడం ఏమిటి..? నది నుంచి లెక్కకు రాని వినియోగం ప్రతిచోటా కొంత ఉండేదే… కానీ మరీ రోజూ 3 లక్షల క్యూసెక్కుల నీరు అదృశ్యం కావడం అంటే ఇదేమి మిస్టరీ అనిపించింది… అల్లాటప్పాగా రాసిన వార్తేమీ కాదు… సీపీఎం నేత రాఘవులు చంద్రబాబుకు రాసిన లేఖలో ప్రస్తావించింది ఇదే…
Ads
మరి ఇద్దరు సీఎంలు ఇన్నాళ్లుగా ఎందుకు పట్టించుకోలేదు..? అసలు నీళ్లు ఏమైపోతున్నాయి..? అదీ తేలాల్సింది… పైగా పోలవరం మీద ఇంత భారీగా ఖర్చు పెడుతున్నారు కదా… మరి దాని సంగతేమిటి..? అన్నింటికీ మించి కేంద్ర ప్రభుత్వమే నదుల అనుసంధానం అంటూ మహానది నుంచి కావేరి అంటూ వేల కోట్ల ఖర్చుకు రెడీ అవుతోంది కదా… రాష్ట్రాల ప్రభుత్వాల మెడలు వంచే ప్రయత్నం చేస్తోంది కదా… మరి గోదావరిలోనే నీళ్లు లేకుండా పోతున్నప్పుడు ఇక ఇచ్చంపల్లి నుంచి ఇంకా నీరు తోడటం దేనికి..?
సీడబ్ల్యూసీ కూడా గాలిలో లెక్కలేమీ వేయలేదు… 29 ఏళ్ల ప్రవాహాన్ని అధ్యయనం చేసిందట… పోలవరానికి 52 కిలోమీటర్ల ఎగువన ఉన్న కొయిదా నుంచి ఈ పరిశీలన సాగిందట, ఆ ప్రాంతంలోనే ప్రతి ఏటా భారీగా నీళ్లు మాయం అయిపోతున్నాయట… ఇదంతా నిజమే అయితే ఆ కేంద్ర జల మండలే కదా నిపుణుల్ని పంపించి నిగ్గు తేల్చాల్సింది… మిస్టరీని చేధించాల్సింది…
కాకపోతే వార్తలో చాలా సందేహాస్పద వాక్యాలు ఉండి, అదే ఓ మిస్టరీగా మారింది… ఉదాహరణకు… 1983 ఆగస్టు 15న కోయిదా వద్ద గోదావరి నదిలో 58,616 క్యూసెక్కుల ప్రవాహం వుంటే అది పోలవరం వద్దకు వచ్చే సరికి 40,176 క్యూసెక్కులకు తగ్గిందని గుర్తించారు… 1986లో కోయిదా వద్ద 1,552 టిఎంసిల నీరు వెళ్లగా, పోలవరం వద్దకు వచ్చే సరికి అది 1,345 టిఎంసిలకు తగ్గిపోయింది. అంటే 207 టిఎంసిల నీరు తేడా వచ్చింది… 18 వేల క్యూసెక్కుల తేడా వస్తే ఏకంగా 207 టీఎంసీలు నష్టపోయామా..? ప్రచురించేముందు ఈ వార్త పరిశీలన సాగిందా..? అనగా క్రాస్ చెక్ గానీ, రీరైట్ గానీ…!
గోదావరి నీళ్లు పెద్ద మొత్తంలో భూమి లోపలి పొరల్లోకి (బిగ్ డీప్ బెడ్ ప్రొఫైల్) ఇంకిపోతున్నాయని సిడబ్య్లుసి పేర్కొంది… అయితే, 52 కిలోమీటర్ల పరిధిలో కచ్చితంగా ఎక్కడ ఈ ప్రక్రియ జరుగుతోందన్నది నిర్దిష్టంగా గుర్తించాలని, అక్కడ లీకేజీని అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది… పోలవరానికి 200 కిలోమీటర్ల ఎగువనున్న ఖమ్మం జిల్లాలోని గుండ్లవాగు ప్రాజెక్టు వద్ద కూడా ఇదే రకమైన పరిస్థితి ఉన్న విషయాన్ని సిడబ్ల్యుసి ప్రస్తావించింది…
ఇంత భారీగా నీళ్లు భూమిలోకి ఇంకిపోతున్నాయనే మాటే మరో మిస్టరీ… ఆ నీరు అక్కడే ఉండిపోదు కదా, మరేమవుతోంది..? పోలవరం డీపీఆర్‌లో కూడా ప్రస్తావించినా ప్రభుత్వాలు పట్టించుకోలేదట… అనుకున్నట్టే 45.72 మీటర్ల ఎత్తుకు పోలవరం నిర్మిస్తే దిగువన ఉన్న ధవళేశ్వరానికి కూడా ముప్పే అని వార్త చెబుతోంది… ఇంతకీ గోదారమ్మా, ఎక్కడ ఎలా మాయమైపోతున్నావమ్మా..? ఈ నివేదికల వెనుక ఇంకేమైనా మర్మముందా తల్లీ..?!
Share this Article