అబ్బే, కోర్టు స్టే ఇచ్చింది… విచారణ పూర్తయితే, నాది తప్పు అని తేలిస్తే నేనే కూలగొట్టేవాడిని… కోర్టులో ఉన్నప్పుడు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా కూలగొట్టుడేంది..? అని అక్కినేని నాగార్జున తను చెరువును కబ్జా చేసి కట్టిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా కూలగొట్టడం మీద స్పందించి వివరణ ఇచ్చాడు, రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు…
నిజంగానే హైడ్రా తప్పు చేసిందా..? రేవంత్ రెడ్డి ప్రభుత్వం లీగల్‌గా ఇరకాటంలో పడినట్టేనా..? అర్జెంటుగా హైకోర్టు ఆ నిర్మాణం కూల్చివేత మీద స్టే ఇచ్చింది… ఈలోపే అది నేలమట్టమైపోయింది… ఇప్పుడిక నాగార్జున లీగల్‌గా ప్రొసీడ్ అవుతాడా..? కోర్టు విచారణ జరుపుతుందా..? నాగార్జున ఆక్రమించినట్టు చెబుతున్న ఆ మూడున్నర ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా..?
ఇవే కదా ప్రశ్నలు… ఒకవైపు తెలంగాణ సామాజిక ప్రముఖులు మొత్తం ఈ కూల్చివేతను సమర్థిస్తున్నట్టుగా పలు స్పందనలు, వ్యాఖ్యలు చెబుతున్నాయి… మరోవైపు ఎప్పటిలాగే బీఆర్ఎస్ ఈ కూల్చివేతకు వ్యతిరేకంగా స్పందించింది… కొంతకాలంగా జనాభిప్రాయానికి వ్యతిరేకంగానే ఉంటోంది కదా పార్టీ ధోరణి… ఐతే బీజేపీ స్పందన ఏమిటి..?
Ads
బీజేపీ నాయకుడు, ఎంపీ, న్యాయవాది రఘునందన్‌రావు ఏకంగా హైకోర్టు స్టే ఇవ్వడాన్నే తప్పుపడుతున్నాడు… ఇలా స్పందించడం సబ్ జుడీస్ ఏమీ కాదనీ, గతంలో సుప్రీంకోర్టే నీటివనరులను ఆక్రమిస్తే నోటీసులు కూడా ఇవ్వనవసరం లేకుండా కూలగొట్టమని చెప్పింది… బీఆర్ఎస్ సర్కారు కూడా మూడున్నర ఎకరాల్ని ఆక్రమించినట్టు గుర్తించి నోటీసులు కూడా ఇచ్చింది… అదే హైకోర్టు చెబితేనే కదా సర్వే చేసి ఆక్రమణ అని తేల్చింది..? జీవో నంబర్ 157 వచ్చిందే హైదరాబాద్ నీటివనరుల రక్షణ కోసం… కోర్టు చెబితేనే జీవో వచ్చింది, మళ్లీ ఈ కూల్చివేత మీద స్టే ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు… హైకోర్టు అనుమతిస్తే తను వచ్చి వాదనలు వినిపిస్తానని చెబుతున్నాడు…
గతంలో ఉన్న కోర్టు తీర్పులు, ఇదే ఎన్ కన్వెన్షన్ లీగల్ హిస్టరీ చూడకుండా, ఆలోచించకుండా హైడ్రా అధికారులు నాగార్జున నిర్మాణాన్ని కూల్చివేశారని అనుకోలేం… అంత పెద్ద కేరక్టర్ ఎలాగూ ఈ వందల కోట్ల ప్రాపర్టీ మీద లీగల్‌గా ప్రొసీడ్ అవుతాడని అనుకుంటారు కదా… పైగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ అక్రమ నిర్మాణాన్ని ఉపేక్షించిందనే విషయమూ తెలుసు కదా… సో, ఇప్పుడు ఈ కూల్చివేత కేసు ఇంట్రస్టింగుగా తయారైంది…
హైకోర్టు గతంలో స్టే ఇచ్చిందనే మాటే అబద్దం, గతంలోనే దాని కూల్చివేతకు కోర్టు తీర్పులున్నాయి… రెగ్యులరైజేషన్‌కు ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించింది, కానీ ప్రభుత్వం ఆ విజ్ఞప్తులను తిరస్కరించింది… కూల్చివేత ఎలాంటి చట్టవ్యతిరేకంగా జరగలేదు అని హైడ్రా రంగనాథ్ ఓ ప్రకటనలో క్లారిటీ ఇచ్చారు… అయిపాయె… అంటే నాగార్జున ఖండన ప్రకటనే జనాన్ని మిస్‌లీడ్ చేయడం అన్నమాట…!
111 జీవో పరిధిలో నిర్మాణాలు వేరు… ఆ జీవో స్పిరిట్‌ను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ధ్వంసం చేసింది గతంలో… దాని బదులుగా రిలీజైన కొత్త జీవో పరిస్థితి ఏమిటో తెలియదు… ఏమో… రఘునందన్ రావే దాని లీగల్ ప్రజెంట్ స్టేటస్ చెప్పాలేమో… కాంగ్రెస్‌ను రాజకీయంగా వ్యతిరేకించే పార్టీ అయినా సరే, ఈ విషయంలో బీజేపీ ఔట్ రైట్‌గా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాల్ని, అడుగుల్ని సమర్థిస్తున్న తీరు రాష్ట్ర రాజకీయాల్లో విశేషమే మరి… https://x.com/V6News/status/1827291162954154293?t=-6foTCX0Qf25Y3W1VnJSKQ&s=08
Share this Article