హైడ్రా… ఇప్పుడిదే సంచలనం… మా నగరాల్లోనూ హైడ్రా కావాలని కోరికలు… హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు… పొగుడుతూ మీడియాలో ప్రశంసలు… సోషల్ మీడియాలో కూడా అభినందనలు…
రుణమాఫీ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి రేవంత్ రెడ్డి ఎత్తుగడ అని బీఆర్ఎస్ నేతలు ఎంత గొంతు చించుకున్నా జనంలోకి పోలేదు… దాంతో స్వరం మార్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కుట్ర అనే రాగం ఎత్తుకున్నారు హరీష్ రావు, కేటీఆర్… హైడ్రా కత్తిని మెడ మీద పెట్టి కాంగ్రెస్‌లోకి లాగే ప్రయత్నం అని విమర్శిస్తున్నారు…
ఐనా సరే, కబ్జాలు నిజమే అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలయితే ఉపేక్షించాలా..? జనం ఈ లాజిక్ ఆలోచిస్తారని ఊహించలేదు వాళ్లు… పైగా మావాళ్లు కబ్జాదారులు, ప్రభుత్వం సహించడం లేదు అనే తప్పుడు భావనల్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నట్టవుతోంది… చెరువును కబ్జా చేసిన పల్లా రాజేశ్వరరెడ్డి మీద కేసు నమోదు కావడం, కబ్జాలకు పేరున్న మల్లారెడ్డి మీద మొదటి నుంచీ రేవంత్ రెడ్డి ఉరుముతుండటంతో బీఆర్ఎస్‌కు ఇక ఎలా సమర్థించుకోవాలో తెలియడం లేదు…
Ads
సర్వే నంబర్లను బట్టి చూడాలి, ఈ అనుమతులు చూడండి అనే హరీష్ రావు వాదన తప్పు… అధికారులు అడ్డగోలుగా, అక్రమాలు ఇచ్చారనే కదా జనం నుంచి వస్తున్న విమర్శ… అందుకే అక్రమ నిర్మాణాలను కూల్చడమే కాదు, సంబంధిత అధికార్లనూ బాధ్యులను చేసి వేటు వేయాలని జనం నుంచి కోరిక పెరుగుతున్నది…
ఇంకా బీఆర్ఎస్ మిత్రుడే కదా… ఒవైసీ కూడా ప్రభుత్వ భవనాల్ని కూడా కట్టారు, కూల్చేస్తారా అనడుగుతున్నాడు… ఈలోపు ఫాతిమా ఒవైసీ కాలేజీ ఏకంగా చెరువులోనే కట్టిన ఉపగ్రహ చిత్రాలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి… సీపీఐ ఎలాగూ కాంగ్రెస్ మిత్రపక్షమే కదా… హైడ్రాను స్వాగతిస్తున్నట్టు నారాయణ ప్రకటన… కానీ పులి మీద స్వారీ చేస్తున్నావు, జాగ్రత్త అని హితవు పలికాడు…
హైడ్రాకు కూడా ఓ పోలీస్ స్టేషన్ హోదా ఇచ్చి, ఇంకా దాని కోరలకు పదును పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది… నిజంగానే అది కాంగ్రెస్ ఆక్రమణల్ని కూడా కూల్చేస్తుందా..? కష్టం… ఆల్రెడీ దానం నాగేందర్ వంటి నేతలు ఇప్పటికే రుసరుసలాడుతున్నారు… పోనీ, ఎవరివైతేనేం, కొన్ని ఆక్రమణలు కూలినా సంతోషమే కదానేది జనం భావన… ఇలా కూల్చేస్తూ పోతే కొన్ని వేల భవనాల్ని కూల్చాల్సి ఉంటుందని కొందరి కొక్కిరింపులు, ట్రిపుల్ వన్ జీవోను కూడా హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చి, కేటీఆర్ జన్వాడ గెస్ట్ హౌజును ఫస్ట్ కూల్చాలని మరికొందరి సోషల్ డిమాండ్లు…
జన్వాడ గెస్ట్ హౌజు మరీ నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తరహా సులభవ్యవహారం అయితే కాదు… సులభమే అయి ఉంటే ఇప్పటికే బుల్‌డోజర్లు దండయాత్ర చేసేవి… ఎటొచ్చీ ఫాఫం… బీజేపీలోనే గందరగోళం… పార్టీలోని సమన్వయ రాహిత్యం, శృతితప్పిన వ్యవహారం హైడ్రా స్పందనలోనూ కనిపిస్తోంది… ఎవరేం మాట్లాడుతున్నారో, ఏ స్టాండ్ తీసుకున్నారో వాళ్లకే తెలియదు ఫాఫం… హైడ్రాను స్వాగతిస్తున్నాం, అవసరమైతే ఎన్ కన్వెన్షన్ విషయంలో నేను హైడ్రాకు మద్దతుగా హైకోర్టులో వాదిస్తాను అంటాడు రఘునందన్…
ఇదంతా హైడ్రామా తప్ప మరేమీ కాదంటాడు కిషన్‌రెడ్డి… సామాన్యుల్ని బెదిరిస్తున్నారు అంటాడు ఈటల… ఈమధ్య దూకుడు విమర్శలతో తెరపైకి బలంగా వస్తున్న ఏలేటి ఇంకేదో అంటాడు… నలుగురూ నాలుగు దిక్కులు… మరి జనం..? ఖచ్చితంగా హైడ్రా అడుగుల్ని వ్యతిరేకించడం లేదు… నీటివనరుల్ని చెరబట్టిన వాళ్లకు, అధికారికంగా వాళ్లకు మద్దతుగా ఉన్నవాళ్లకు కూల్చివేతలే కరెక్టు అంటున్నారు… కానీ ఇదే రేంజ్ స్పీడ్ హైడ్రా కొనసాగించడం కష్టం… కారణాలు అనేకం… అవీ తరువాత కథనాల్లో చెప్పుకుందాం…
మరి నాగార్జున అక్రమ నిర్మాణం కూల్చివేత మీద జనంలో స్పందన ఎలా ఉంది..? నాగార్జునకు మద్దతు ఏమాత్రం కనిపించడం లేదు… నేను శుద్దపూసను అనే నాగార్జున స్టేట్‌మెంట్లను కూడా ఎవరూ విశ్వసించడం లేదు సరికదా, పైగా మంచిగైంది అనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది… కొందరు వైసీపీ మీడియా పర్సన్స్, ఆంధ్రా బేస్డ్ జర్నలిస్టులు మాత్రం ఇండస్ట్రీని రేవంతే ఆంధ్రాకు తరలిస్తున్నాడు అనే డొల్ల వాదనలకు దిగారు… అంటే, ఇండస్ట్రీ ఇక్కడే ఉండాలంటే పెద్ద తలకాయలు ఏ అక్రమాలకు పాల్పడినా కళ్లు మూసుకోవాలా ఏం..?!
Share this Article