తమ చెరువులను ఆక్రమించారని అనేక ఆరోపణలు వస్తున్న క్రమంలో ఓ ముప్ఫై ఏండ్ల కింద రేడియోలో వచ్చిన నాటిక యాదికి వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి రేడియో శ్రోతను… అది అలా వుంచితే .. ఆ నాటిక సారాంశం ఏమంటే…
ఒక వూళ్ళో ఒక రైతు బావి తవ్వడం కోసం బ్యాంకు లోను కావాలని వెళ్ళాడు. ఇప్పుడున్న చాలామంది అధికారుల మాదిరిగా నాకేంటి అని పేచీ పెట్టారు.. ఇప్పటిలా సోషల్ మీడియా సహా మరేవీ లేవు కదా అప్పట్లో.. రుణమొత్తం ప్రాతిపదికన ఎంతో కొంత లంచం ముట్టచెప్పాడు. బావి తవ్వకం, సిమెంట్ రింగులు (మన దగ్గర ఓడలు, ఒరలు అంటారు) పోయడం, విద్యుత్ మోటర్ కొనుగోలు తదితరాల ఏర్పాటుకు విడతలవారీగా రుణ వాయిదాలు రైతుకు చెల్లించారు…
ఎలాగూ లంచాలు ఇచ్చాడు, బావి తవ్వుకుంటున్నాడు అనుకుని బ్యాంక్ అధికారులు ఇక ఏనాడూ రైతు తవ్వే బావి వైపు వెళ్లకుండా టీయ్యేలు క్లెయిమ్ చేసారు… బావిలో నీళ్ళు పడ్డాయని, మోటర్ నడుస్తుందని, పంట చేతికి వస్తుందని చెబుతూ రైతు ఒకటి రెండు వాయిదాలు కట్టాడు.
Ads
ఒకనాడు ఆ రైతు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన బావిని దొంగలు ఎత్తుకెళ్ళారని ఫిర్యాదు చేశాడు. దొంగలు బావిని ఎత్తుకొని పోవడం ఏంటని మొదట తేలిగ్గా తీసేసినా, రైతు ఒత్తిడి తగ్గకపోవంతో ఇక తప్పనిసరై ఆ ఎస్సై రైతు పొలం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఏమీ లేదు. సారూ, ఈ సర్వే నెంబర్, ఈ మడిలోనే బావి తవ్వించాను, మోటర్ కూడా పెట్టానని రైతు చెప్పాడు.
విస్తుపోవడం ఎస్సై వంతు అయ్యింది… లాఠీ ఎత్తేసరికి… అయ్యా, నా మాట అబద్దమైతే మా బ్యాంకు మేనేజర్ ను అడగండి అన్నాడు… వెనక్కి తగ్గిన ఆ ఎస్సై ఆ రైతుని తీసుకొని బ్యాంక్ కు వెళ్ళాడు. బ్యాంక్ మేనేజర్ కూడా ఈ రైతు లోన్ తీసుకున్నాడని, బావి తవ్వాడని, దశల వారీగా రుణం ఇచ్చానని, రైతు రెండు రుణవాయిదాలు కూడా కట్టాడని బయానా (సాక్ష్యం) చెప్పాడు … మొదటి పంట వడ్లు మాకు ఉచితంగా ఇచ్చాడని కూడా చెప్పాడు.
బ్యాంక్ లోన్ కాగితాలు కూడా ఆధారాలుగా చూపాడు. తలతిరిగిన ఎస్సై రైతుని పక్కకు పిలిచి, అసలు బావి ఏంటి, లోన్ ఏంటి, దొంగలు దోచుకోవడం ఏంటని గట్టిగా అడిగేసరికి సదరు రైతు సవివరంగా ఆ బ్యాంకు వారి లంచాల కథ చెప్పాడు. అప్పుడు ఎస్సై నేరుగా బ్యాంక్ సిబ్బందిని పిలిపించి, లంచం పీకల మీదకు వచ్చిందని, కేస్ పెట్టాల్సిందే అని చెప్పాడు.
బ్యాంకు సిబ్బంది ఠారుమన్నారు… రైతుని ప్రాధేయపడ్డారు ఆ కేసు వాపస్ తీసుకోవాలని… అబ్బే, నాకేం తెల్వదు సర్.. నా బావి నాకు కావాలి. బావి తవ్వడానికి ఆరు కంతులు (తడవలు, విడతలు) పైసలు ఇచ్చిండ్రు కదా.. మీరే స్వయంగా వచ్చి చూశారు కదా,. ఆ బాకీ తీరక ముందే దొంగలు పడ్డారు అని ఠలాయించాడు… సీన్ అర్థమైంది బ్యాంక్ అధికారులకు…
విషయం పై అధికారులకు తెలిస్తే తమ ఉద్యోగాలు పోవడం సహా జైలుపాలు అవుతామని భయపడి,. తిన్న లంచాలకు పది రెట్లు ఖర్చు భరించి, కొత్త బావి తవ్వించి, మోటార్ బిగించి, రైతుకు దండం పెట్టుకొని ఇంకోసారి లంచాల జోలికి వెళ్ళలేదు… అలాగే ఇలా లంచాలకు మరిగిన అధికారులను గుర్తించి, చెవులు పిండితే తప్ప ఆ మాయమైన చెరువులు మళ్లీ కనిపించవు కదా…. (వుప్పల రమేశ్ శర్మ)
Share this Article