ఇక మగవాడే పుట్టడు… వాడి పని అయిపోయింది… ఇన్నేళ్ల ఆధిపత్యం, పెత్తనం, వివక్ష, హింస అన్నీ ఖతమ్… ఇక మొత్తం ప్రమీలా రాజ్యమే… అంతా ఆడాళ్లే… మగ పురుగు కనిపించదు… పుట్టదు… మంచిగైంది,.. ఇన్నేళ్ల అణిచివేతకు అంతకంతా అనుభవించబోతున్నది మగజాతి…
అచ్చం… ఇలాగే ఓ ఆర్టికల్ కనిపించింది… ఎవరబ్బా, ఈ వీర, ధీర, శూర, క్రూర ఫెమినిస్టు అని చూడటంకన్నా… అసలు ఆమె ఏ ఆధారంతో చెబుతున్నదీ అని పరిశీలిస్తే… రీసెంటుగా కొన్ని ఇంగ్లిష్ మ్యాగజైన్లలో ప్రచురితమైన ఓ ఆర్టికల్ ఆధారమట…
అదేమని చెబుతున్నదంటే… 16 కోట్ల సంవత్సరాల నుంచీ ఓ పరిణామం చోటుచేసుకుంటున్నదట… తెలుసు కదా… మనిషి దేహంలో ఎక్స్, వై క్రోమోజోములుంటాయి… సంభోగం తరువాత, వీర్య-అండాల కలయికలో… పిండం ఏర్పాటు దశలో… వై జతకలిస్తే మగ పిల్లాడు పుడతాడు… రెండు ఎక్స్‌లు కలిస్తే అమ్మాయి పుడుతుంది… ఇదేకదా శాస్త్రం చాన్నాళ్లుగా చెబుతోంది…
Ads
సదరు వై క్రోమోజోములో 16 కోట్ల ఏళ్ల క్రితం 900 జీన్స్ ఉండేవట… అవి మగ పుట్టుకను నిర్ధారించేవి… శాసించేవి… ఇప్పుడవి ఏకంగా 55కు పడిపోయాయట… అందులోనూ సగం జీన్స్‌కు అసలు ఏ నిర్ణాయక శక్తీ ఉండదట… జస్ట్, మరో కోటి సంవత్సరాల్లో ఈ 55 కూడా కనుమరుగై… ఇక పుట్టే ప్రతి శిశువూ ఆడ తప్ప మగ ఉండదు అని తాజా (2022) అధ్యయనాలు చెబుతున్నాయట…
ఆల్రెడీ జపాన్ తదితర దేశాల్లో కొన్నిరకాల ఎలుకల్లో ఈ వై ఫ్యాక్టర్ మొత్తం కనుమరుగైందట… సో, ఇక మగాడు పుట్టడు అని తేల్చేసింది ఆ స్టడీ… సైంటిఫిక్ స్టడీ, నమ్ముదాం… కానీ ఇక పూర్తిగా మగ పుట్టుకే లేకపోతే తదుపరి సంతాన వ్యాప్తి ఎలా..? మనిషి ఏకలింగ జీవి కదా… సంభోగం, వీర్యం-అండం కలయిక తప్పదు కదా… ప్రకృతి నిర్దేశించిన పద్ధతి అది… మరెలా..?
ఏమీ కాదు… మరీ ఆడాళ్లు అప్పటికి సంభోగాలకు దూరమై, సంతానోత్పత్తికి క్లోనింగ్ గట్రా ప్రక్రియలను అనివార్యంగా నమ్ముకునే పనేమీ ఉండదు… సవాలక్ష సమస్యలకు కోటిన్నర పరిష్కారాల్ని ప్రకృతే చూపిస్తుంది… వై క్రోమోజోమ్ లేకపోతేనేం, అలాంటిదే మరో క్రోమోజోమ్ పుట్టుకొచ్చిందట జపాన్ ఎలుకల్లో… సో, మగ జాతి సేఫ్… ఆడ-మగ రొమాన్స్ సేఫ్… సంభోగం సేఫ్…
ఐనా కోటి సంవత్సరాల తరువాత సిట్యుయేషన్ ఏమిటో ఎవడు చెప్పొచ్చాడు..? అసలు మన కాలుష్యం ధాటికి ఇప్పటికే వీర్యం- అండం నాణ్యతలు దెబ్బతిన్నాయి, సంతానోత్పత్తి సామర్థ్యమే దెబ్బతిన్నది… వంధ్యత్వం పెరిగింది, సామాజిక పరిస్థితులతో అసలు పెళ్లి, సంతానమే కోరుకోవడం లేదు ఎవరూ… అవి కదా అసలు సమస్యలు అంటారా..? కరెక్టు… అదే తక్షణం దృష్టి సారించాల్సిన సమస్య..! తూర్పు దేశాలన్నీ తలలు పట్టుకున్న జనాభా క్షీణత దశ..!!
Share this Article