‘‘ఎంట్రీ ఫీజే 1500 దొబ్బారు… క్లబ్బు అంటే, పబ్బు అంటే లిమిటెడ్‌గా ఉండాలి జనం… కానీ మస్తు జనాన్ని నింపేశారు… కిటకిట… పైగా అడ్డగోలు రేట్లు… కింద మండిపోతోంది ఒక్కొక్కడికీ… దానికితోడు ఆ సింగర్ నోరిప్పితే అపస్వరాలు… ఏదో నాలుగు గోడల మధ్య ఇష్టమొచ్చినట్టు పాడి జనంలోకి వదలడం కాదు కదా… లైవ్ ప్రోగ్రాంలో అలరించడానికి కాస్త స్వరశుద్ధి అవసరం… మరి నీళ్ల బాటిళ్లు విసిరారు, మందు చల్లారు అంటే ఏం తప్పుపట్టగలం..? మర్యాదగా ఎవడుంటాడు ఈరోజుల్లో..? తాగినోడికి ఎవరు మర్యాద నేర్పగలరు..? క్లబ్బు వాడు కూడా ఎంతమందికి బౌన్సర్లను పెట్టగలడు..? కాకపోతే ఆ క్లబ్బు వాడు ఊహించలేదు… లేకపోతే పోడియం చుట్టూ గ్లాస్ షీల్డ్ పెట్టేవాడు కదా పాపం…? ఐనా శ్రీరాం క్లబ్బులో పాడి రంజింపచేస్తాను అనే ధీమాతో ఉండటం తనదే తప్పు…’’ ఇలా సాగిపోయింది ఓ మిత్రుడి సమర్థన… అదే… గాయకుడు సిద్ శ్రీరాంపై హైదరాబాదు, జుబిలీ హిల్స్, రోడ్ నంబర్ టెన్‌లోని ఓ పబ్బులో తనను అవమానించారు అనే వార్తకు ఓ సగటు పాఠకుడి స్పందన అదీ…
నిజానికి ఈ పబ్బు వాడు విపరీతంగా జనాన్ని నింపాడు… ఏదీ కంట్రోల్ చేయలేని స్థితి… కక్కుర్తి… సిద్ శ్రీరాం కాదు, తన తాతొచ్చి పాడినా తాగినవాడికి నచ్చకపోతే ఇలాంటివి చోటుచేసుకుంటూనే ఉంటయ్… పబ్బువాడే ఏదో తిప్పలుపడి, కంట్రోల్ చేసి, ఎక్కడికక్కడ సర్దుబాటు చేస్తాడు, లేకపోతే పోలీసులు, అధికారులు అడ్వాంటేజ్ తీసుకుంటారు… రెగ్యులర్ కస్టమర్లు కూడా వేరే పబ్బు వెతుక్కుంటారు… లేడీస్‌తో పాటలు పాడించేటప్పుడు ఈ గొడవలు మరీ ఎక్కువ ఉంటాయి… అందుకే కొన్ని పబ్బులు వీటి జోలికి పోకుండా… దమ్మడదమ్మడ డీజేల జోలికి కూడా పోకుండా… కస్టమర్లకు కావల్సిన ‘మత్తు పదార్థం’ సప్లయ్ చేస్తుంటారట… ఎవడి సరుకు వాడు గుట్టుగా పీల్చేసి జారుకుంటారట… ‘‘నిజానికి ఇందులో శ్రీరాంకు జరిగిన అవమానం ఏముంది..? పబ్బుల్లో పెయిడ్ సింగర్లకు ఎవడూ మెచ్చుకుని కిరీటాలు పెట్టడు… నచ్చితే సైలెంటు, లేదంటే వయోలెంట్… ఇదీ రియాలిటీ… నో, నో, ఓ పాపులర్ సింగర్‌ను అలా అవమానిస్తారా..? ఇదేం మర్యాద..? వంటి మాటలు, హూంకరింపులు పబ్బుల్లో, బార్లలో చెల్లవు… డ్రింకర్ల ఎదుట ఏ మర్యాదసిద్ధాంతాలూ పనిచేయవు…
Ads
అంతకుముందు బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ను కూడా కొందరు కొట్టారు… కానీ అది వేరే… ఎందుకో మాటామాటా పెరిగిన ప్రైవేటు యవ్వారం… సో.., బార్లలో, క్లబ్బులో, పబ్బుల్లో ఇలా జరిగేవి జరుగుతూనే ఉంటాయి… అసలు గొడవ మొదలు కాగానే కొందరిని బయటికి వెళ్లిపోవాలని శ్రీరాం మైకులో అరిచాడట… దాంతో ఇష్యూ ముదిరిందట… Discipline the mind to never operate from a space of fear అని తరువాత, అంతా సద్దుమణిగాక ఏదో ట్వీట్ పెట్టాడు… మామూలు వాళ్లకే అర్థం కాదు తన స్వరం, తన భావం… ఇక తాగినోళ్లకు ఏం అర్థం అవుతుంది..? సో, అదేదో సినిమాలో ప్రకాష్‌రాజ్ చెబుతాడు చూడు… గిల్లితే గిల్లించుకోవాలీ అని… మరీ ఆ స్థాయిలో కాదు గానీ… బార్లలో, పబ్బుల్లో జరిగేవాటిని మరీ అంతగా హార్ట్‌కు కూడా తీసుకోనక్కర్లేదు… ఏదో మనకు తెలిసిన స్వరజ్ఞానంతో, సందర్భ పరిణతితో… కళ్లు మూసుకుని… ‘‘సామజవరగమనా… నిను చూసి ఆగగలనా…’’ అంటూ ఎవరో ఆ రాటుదేలిన స్వరరచయిత గారు రాసిన ఆ కాళ్లు, తొడల కీర్తనల్ని అందుకోవడమే…!!
Share this Article