మామూలుగానైతే దీపావళి, కార్తీక పౌర్ణమి నడుమ పేనీలు తినేది… పేనీలు అంటే చాలామంది తెలంగాణవాసులకే తెలియదు… సన్నగా, అత్యంత సన్నగా, పొరలుపొరలుగా చేసిన ఒకరకం స్వీట్… చక్కెర పొడి, వేడి పాలు పోసుకుని తినేయడమే… వంటామంటా ఏమీ ఉండదు… నార్తరన్ డిష్ కదా, తెలంగాణలోని కొన్ని కులాల కుటుంబాలకే పరిమితం…
రాజస్థాన్ స్వీట్ హౌజులో కనిపిస్తే రేటు అడిగాను… రెండు రంగుల్లో కనిపించాయి… ముదురు గోధుమ రంగు అయితే నెయ్యితో చేసినవి అట… పావుకిలో 120 రూపాయలు అట… తెల్లగా ఉన్న పేనీలేమో పావుకిలో 80 రూపాయలట… ఎంత తేడా..? అసలెందుకు రేట్లలో ఈ ఫరక్ అనడిగితే… తెల్లవి డాల్డాతో చేసినవి, ముదురు రంగువి నెయ్యితో చేసినవి అని క్లారిటీ ఇచ్చాడు షాపు వాడు…
వెంటనే మిత్రుడు జాన్ కోరా (భాయ్ జాన్) తాజా పోస్టు ఒకటి అర్జెంటుగా గుర్తొచ్చింది… నిజమే కదా, డాల్డా, వనస్పతి పేర్లు విని చాలా రోజులైంది కదా, అసలేమిటీ వీటి కథ అనిపించింది… సో, ఆ పోస్టు యథాతథంగా ఇక్కడ చదివేద్దాం…
Ads
ఆ బిల్ పాస్ అయ్యుంటే.. మన ఆరోగ్యాలు మరింత మెరుగైన స్థితిలో ఉండేవి!
ప్రస్తుతం 35 ఏళ్లు దాటిన ఎంతో మంది బీపీ, డయాబెటిస్, ఆధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. మన ఆహారపు అలవాట్లే ఇలా చిన్న వయసులోనే అనేక రోగాలకు కారణం. ఒకానొక దశలో భారతీయులు తమ వంటల్లో వనస్పతి వాడటం వల్లే అధిక కొలెస్ట్రాల్‌కు కారణమని తేల్చింది. వనస్పతి వాడకం వల్ల గుండె జబ్బులు పెరిగిపోయాయని, అనేక మరణాలకు అదే కారణమని విశ్లేషించారు. అసలు ఈ వనస్పతి వాడకం ఇండియాలోకి ఎలా ప్రవేశించింది…?
స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో అనేక విదేశీ కంపెనీలు ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాయి. అలా ఆసక్తి చూపిన సంస్థలో “డాల్డా” కూడా ఒకటి. నెదర్లాండ్స్‌కు చెందిన ‘దాదా” అనే కంపెనీ నెయ్యిని విక్రయించేది. అయితే తమ నెయ్యి అధిక ధర ఉండటంతో పేదలు, మధ్య తరగతి వాళ్లు కొనుగోలు చేసే వారు కాదు. దీంతో నెయ్యిని పోలిన వనస్పతిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. పామాయిల్‌ను ‘హైడ్రోజినేటెడ్’ చేయడం ద్వారా నెయ్యిని పోలిన వనస్పతి తయారవుతుంది. నెయ్యితో వంటలు చేస్తే ఎంత రుచిగా ఉంటాయో.. ఈ వనస్పతితో చేసిన వంటలు కూడా అంతే రుచిగా ఉండేవి.
‘Dada’ కంపెనీని Unilever కొనుగోలు చేశాక, దాని పేరు ‘Dalda’గా మార్చింది. ఇండియాలో డాల్డా పేరుతో విక్రయాలు మొదలు పెట్టింది. భారతీయులు మొదట్లో డాల్డాపై విముఖత చూపించారు. దాని వాసన, నేరుగా రుచు చూస్తే వికారంగా ఉండటంతో మొదట్లో ఎవరూ పెద్దగా కొనుగోలు చేయలేదు. అయితే పత్రికల్లో, హోర్డింగుల ద్వారా మంచి ప్రకటనలు ఇచ్చి సేల్స్ భారీగా పెంచుకుంది. హోటల్స్, స్వీట్ షాప్స్‌తో పాటు పేద, మధ్యతరగతి వంటల్లో డాల్డా ఒక భాగమైపోయింది. అయితే ఈ డాల్డా వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అనేక మంది ఆరోగ్య నిపుణులు అప్పటి ప్రధాని నెహ్రూ దృష్టికి తీసుకొని వచ్చారు.
కాంగ్రెస్ మాజీ ఎంపీ పండిట్ తుకార్‌దాస్ భార్గవ ‘డాల్డా’ను బ్యాన్ చేయాలని గళమెత్తారు. ప్రభుత్వ మద్దతుతో లోక్‌సభలో వనస్పతిని బ్యాన్ చేయాలని బిల్ కూడా ప్రవేశపెట్టారు. అయితే బిల్ మీద చర్చించే క్రమంలో మిగతా సభ్యుల సూచన మేరకు దానిపై ఒక సర్వే చేయాలని నిర్ణయించారు.
డాల్డా ఉత్పత్తి కోసం అప్పట్లో 47 ఫ్యాక్టరీలు తెరిచారు. అందులో దాదాపు 30 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఇక దేశంలో రూ.5,000 కోట్ల విలువైన పామాయిల్ పంటను వేలాది మంది రైతులు సాగు చేయడం ప్రారంభించారు. ఒక్కసారిగా డాల్డాను బ్యాన్ చేయడం వల్ల వీళ్లందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడం సాధ్యం కాదని.. దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందని సర్వేలో తేల్చారు.
మరోవైపు పండిట్ ఠాకూర్‌దాస్ మనసులో ఏదో పెట్టుకొని డాల్డాకు వ్యతిరేకంగా బిల్లు ప్రవేశపెట్టారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ప్రధాని నెహ్రూ ఆ బిల్లును పక్కన పెట్టేశారు. ఇక ఆ తర్వాత డాల్డా విక్రయాలు మరింతగా పెరిగిపోయాయి.
కాలక్రమంలో అక్షరాస్యత పెరగడం, ఆరోగ్యంపై ప్రజలకు శ్రద్ద పెరగడంతో డాల్డా (వనస్పతి) వాడకాన్ని తగ్గించారు. డాల్డాలో పశువుల కొవ్వును కలుపుతున్నారనే వార్తలు కూడా దాని వాడకాన్ని తగ్గించింది. ప్రస్తుతం ఇళ్లల్లో డాల్డా వాడకం పూర్తిగా తగ్గింది. కానీ హోటల్స్, మిఠాయి దుకాణాల్లో మాత్రం ఇంకా కొనసాగుతోంది. అవునూ, మన పల్లీనూనె, మన నువ్వుల నూనెతో చేయలేరా వీటిని..?!
ఒకవేళ ఆ రోజు బిల్ ప్రవేశపెట్టి, ఆమోదించి ఉంటే మన ఆరోగ్యాలు మరింత మెరుగుగా ఉండేవనడంలో ఎలాంటి సందేహం లేదు. Inputs: Chirag Bharjatya….. #భాయ్‌జాన్
చివరగా… సరదాగా… అదేదో పాత సినిమాలో నాగార్జున, బ్రహ్మానందం… ప్యారిస్ మహిళను బ్రహ్మానందం పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది… ఆమె పేరేమిటి అంటాడు నాగార్జున… ఆల్డా అంటాడు బ్రహ్మానందం… డాల్డానా అనడుగుతాడు నాగార్జున సరిగ్గా అర్థం గాక… ఏఎల్‌డిఏ… ఆల్డా అని క్లారిటీ ఇస్తాడు బ్రహ్మానందం… భలే పేలిందిలే జోకు…
సరే, మరోసారి చివరగా…. గతంలో… చాలా ఏళ్ల క్రితం ఓ ఆయిల్ మిల్ మీద కేసు పెట్టారు అధికారులు అడల్టరేషన్… ఎక్కువ ధర నూనెల్లో తక్కువ ధర నూనెలు కలిపేయడం… డబ్బులకు లొంగలేదు సదరు ఆఫీసర్… కోర్టు దాకా పోయింది… ఆ లాయర్ వాదించాడు… ‘‘రకరకాల వంట నూనెలు కలిపితే తప్పేమిటి..? డాల్డా, వనస్పతిలో అన్ని నూనెలూ కలిపేస్తారు కదా… అది అనారోగ్యం కానప్పుడు, నా క్లయింట్ కలిపితే తప్పేమిటి..?’’
Share this Article